నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం పట్వారిగూడెం లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలో భాగంగా వారు పట్వారిగూడెం గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిపాలనా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రామపంచాయతీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు పాలనా సేవలు మరింత వేగంగా, సులభంగా అందుతాయని పేర్కొన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



