నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) దమ్మపేట మండల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్‌కేఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రైతులు, శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న వ్యవసాయ, ఆర్థిక, సామాజిక సంక్షోభంపై తక్షణం దృష్టి సారించాలని కోరుతూ సోమవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు గండుగులపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో డిమాండ్ల చార్టర్‌తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకులు అమర్లపూడి రాము, దొడ్డ లక్ష్మీనారాయణ, సుంకిపాక ధర్మ, గోకినపల్లి ప్రభాకర్, మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులు, కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో 385 రోజులపాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం సందర్భంగా 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఉద్యమంలో 736 మంది రైతులు అమరులయ్యారని తెలిపారు.
అన్ని పంటలకు సేకరణతో కూడిన చట్టబద్ధమైన C2+50 శాతం ఎంఎస్‌పీని అమలు చేయాలని, రైతులు, వ్యవసాయ కూలీలపై పెరుగుతున్న రుణభారాన్ని తగ్గించేందుకు సమగ్ర రుణమాఫీ చేపట్టాలని కోరారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
2021 నవంబర్ 19న మూడు వ్యవసాయ చట్టాల రద్దు రైతు ఉద్యమం సాధించిన విజయమని, అనంతరం డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన హామీల ఆధారంగా ఉద్యమాన్ని విరమించినప్పటికీ గత ఐదేళ్లలో వాటిని అమలు చేయలేదని విమర్శించారు.
2014 లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన C2+50 శాతం ఫార్ములా ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్నా వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని, పేద, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు సమగ్ర రుణమాఫీ చేపట్టడం లేదని ఆరోపించారు. మరోవైపు కార్పొరేట్ సంస్థల భారీ బకాయిలను మాఫీ చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో సంపద, ఆదాయ అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు కల్లూరి కిషోర్, పండూరి వీరబాబు, చిరంజీవి, కురసం ముత్యాలరావు, చెన్నారావు, కేశవరావు, బండి ఆదినారాయణ, కేసరి వెంకటేష్, సోయం నాగేశ్వరరావు, సోయం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



