నవతెలంగాణ – పరకాల
పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం ఓటరు ముసాయిదా జాబితాను ఆర్డీవో ప్రదర్శనకు పెట్టారు. ముసాయిదా జాబితా ప్రకారం పరకాల నియోజకవర్గంలో మొత్తం 2,03,598 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 98,913 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,04,682 మందితో పురుషుల కంటే 5,769 మంది అధికంగా ఉన్నారు. ఇతర ఓటర్లు ముగ్గురు ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు ముసాయిదా జాబితా స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా ఓటరు జాబితాను పరిశీలించి, అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిబంధనల ప్రకారం అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి విజయశ్రీ, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్, ఎలక్షన్ ఆపరేటర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం ఆర్డీవో అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. పరకాల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం ఐదు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటిని సమగ్రంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతగా స్పందించి, నిర్ణీత గడువులోగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుని, అవసరమైన సందర్భాల్లో దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.



