Tuesday, August 18, 2026
E-PAPER
Homeమానవితోలుబొమ్మలాట కుజీవం పోస్తున్న భీమవ్వ

తోలుబొమ్మలాట కుజీవం పోస్తున్న భీమవ్వ

- Advertisement -

అది76వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు. కర్ణాటక సాంప్రదాయ కళను పరిరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన 96 ఏండ్ల కళాకారిణి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే రాష్ట్రపతి నిలయ సిబ్బంది ఆమెను పట్టుకొని తీసుకొచ్చారు. ఆమే తోలుబొమ్మలాట కళాకారిణి భీమవ్వ దొడ్డబలప్ప శిలెక్యాతర. న్యూఢిల్లీలోని ఆ వేదికపైకి ఆమె వచ్చినప్పుడు ఒక అద్భుతమైన క్షణం ఆవిష్కృతమైంది. సాంప్రదాయ తోలుబొమ్మలాట కళ అయిన ‘తోగలు గొంబెయాట’లో ప్రసిద్ధ కళాకారిణి.. శతాబ్దాల నాటి ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి దశాబ్దాలుగా చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడ్డారు.

భీమవ్వ 1929లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లా, మోరనాల గ్రామంలో పుట్టారు. ఆమె కుటుంబం ‘తోకలు గొంబెయాట’ అనే అతి పురాతన కళారూపాన్ని వంద ఏండ్లకు పైగా పరిరక్షిస్తూ వస్తోంది. ఇది కర్ణాటకలో సాంప్రదాయ తోలుబొమ్మలాట. ఇందులో తోలుతో చేసిన బొమ్మలను ఉపయోగించి కథలు చెబుతారు. భీమవ్వ చిన్నప్పటి నుంచే తన కుటుంబం నుండి ఈ కళను నేర్చుకుంది. చాలా మంది ఈ కళారూపాన్ని దాదాపుగా మరచిపోయినప్పటికీ, ఆమె డెబ్బై ఏండ్లకు పైగా నిశ్శబ్దంగా, ఓపికగా ప్రదర్శనలు ఇస్తూ దీనిని సజీవంగా ఉంచుతోంది.

తోకలు గొంబెయాట అంటే ఏమిటి?
తోకలు గొంబెయాట అంటే కన్నడలో ‘తోలుబొమ్మలాట’. ఇది ఒక రకమైన తోలుబొమ్మలాట, ఇందులో చదునైన తోలు బొమ్మలను ఒక తెర వెనుక ఉంచి, వాటి వెనుక నుండి కాంతిని ప్రసరింపజేస్తారు. బొమ్మలు కదులుతున్నప్పుడు, వాటి నీడలు తెరపై పడతాయి. ప్రేక్షకులు కాంతి నీడల ద్వారా కథ విప్పారడాన్ని చూస్తారు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు. కథ చెప్పడం, సంగీతం, కళాత్మకత అన్నీ ఒకేచోట కలిసిన రూపం. తోలుబొమ్మలాట కళాకారులు రామాయణ, మహాభారతాల వంటి గొప్ప భారతీయ ఇతిహాసాలతో పాటు ఇతర జానపద కథలను, బొమ్మలను అత్యంత నైపుణ్యంతో కదిలిస్తూ వివరిస్తారు. తోలుబొమ్మలను తయారు చేయడం కూడా ఎంతో నైపుణ్యంతో కూడిన కళ. తోలును కత్తిరించి, బొమ్మలాటకు అవసరమైన ఆకృతులుగా తీర్చిదిద్దుతారు.

జీవితకాల అంకితభావం
దశాబ్దాలుగా భీమవ్వ గ్రామాలలో ఈ నీడ నాటకాలను ప్రదర్శిస్తూ, తరతరాలుగా వస్తున్న కథలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కాలం గడిచేకొద్దీ, ఆధునిక వినోదం ప్రాబల్యం చెందడంతో, అంతరించిపోతున్న ఈ కళను అభ్యసించే వారి సంఖ్య కూడా తగ్గింది. కానీ భీమవ్వ ఈ కళను వదులుకోలేదు. ప్రదర్శనలు కొనసాగించడమే కాకుండా, ముఖ్యంగా తన తరంతో పాటు ఈ కళ అంతరించిపోకుండా ఉండేం దుకు యువతకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేశారు. ఆమె వంటి కళాకారుల వల్లే, తోలు బొమ్మల గొంబయాట చరిత్ర పుస్తకాలలో కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోకుండా, నేడు కర్ణాటక సంస్కృతిలో ఒక సజీవ భాగంగా నిలిచింది.

చివరకు గుర్తింపు
పద్మశ్రీ పురస్కారాన్ని జనవరి 2025లో ప్రకటించగా.. భీమవ్వ ఏప్రిల్ 2025లో న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమెతో పాటు ఆ ఏడాది కర్ణాటకకు చెందిన ఇతర ప్రముఖులను కూడా సత్కరించారు. వారిలో జానపద కళాకారుడు వెంకప్ప అంబాజీ సుగటేకర్, అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సంగీత విద్వాంసుడు డాక్టర్ ఎల్. సుబ్రమణియం ఉన్నారు. భీమవ్వకు ఆ పురస్కారం కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు. అది ఒక సంపూర్ణ సంప్రదాయానికి లభించిన గుర్తింపు. ఆ సంప్రదాయం అంతరించి పోకుండా ఆమె చేస్తున్న కృషి వల్లే అది ప్రధానంగా నిలబడింది.

ఆమె కథ ఎందుకు ముఖ్యమైనది
సంస్కృతి దానంతట అదే నిలబడదని భీమవ్వ శిల్లెక్యాతర కథ మనకు గుర్తు చేస్తుంది. సంవత్సరాల తరబడి ఎవరికీ తెలియకుండా ఎవరో ఒకరు దానిని ఆచరిస్తూ, బోధిస్తూ, దానిని విశ్వసిస్తూ ఉండటం వల్లే అది నిలబడుతుంది. చాలా మంది ఎప్పుడో ఆ కళను మర్చిపోయినప్పటికీ 96 ఏండ్ల వయసులో ఆమె శతాబ్దాల నాటి ఒక కళకు వారసురాలిగా నిలిచారు. దేశ మూలాలను కాపాడే కళాకారుల నిశ్శబ్ద, జీవితకాల సేవను దేశం గుర్తిం చింది. నిజమైన గొప్పతనం తరచుగా కీర్తి ప్రతిష్టల వల్ల కాకుండా, కాపాడదగిన దానికి చూపించే ఓపికతో కూడిన వినయపూర్వకమైన అంకితభావం నుండే వస్తుందని భీమవ్వ జీవితం తెలియజేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -