గడువు తీరిన కాల్పుల విరమణ ఒప్పందం
పొడిగింపు ప్రశ్నే లేదు… విజయం మాదే : ఇరాన్
తాజా శాంతి చర్చలపై అనుమానాలు
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించే ఉద్దేశంతో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం (ఇస్లామాబాద్ ఎంఓయూ) గడువు సోమవారం ముగిసింది. ఒప్పందాన్ని పొడిగించేందుకు చర్చలేవీ జరగడం లేదని ఇరాన్ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. యుద్ధాన్ని అన్ని రకాలుగా ముగించేందుకు, సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేసేందుకు ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంపై జూన్‌లో అమెరికా, ఇరాన్ సంతకాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఒప్పందం మనుగడ ప్రతి రోజూ దినదిన గండంగానే గడిచింది. గత నెల 7వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. మరోవైపు ఎంఓయూలో ఇచ్చిన హామీలను అమెరికా పదే పదే ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. తాత్కాలిక ఒప్పందం కుదిరిన 48 గంటల లోనే అమెరికా దానిని ఉల్లంఘిం చిందని, ఆ తర్వాత కొద్ది రోజులకే ఒప్పందం నుంచి వైదొలిగిందని ఇరాన్ వర్గాలు తెలియ జేశాయి. అందుకే ఒప్పందం పొడిగింపుపై చర్చలు జరపడం లేదని చెప్పాయి.
పొడిగింపు ప్రశ్నే లేదు : అరాగ్చీ
కాల్పుల విరమణను పొడిగించే ప్రశ్నే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఎంఓయూను ఉల్లంఘిస్తున్న అమెరికా తమ పై దాడులు చేస్తూనే ఉన్నదని ఆరోపించారు.
తుది ఒ ప్పందంపై చర్చలకు అవకాశం కల్పించేందుకే ఎంఓ యూను కుదుర్చుకున్నాం తప్ప దానిని కాల్పుల విరమణకు గడువుగా భావించలేదని చెప్పారు. కాగా ఇరాన్ ఇటీవల తన జాతీయ భద్రతా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది. భవిష్యత్తులో జరిగే చర్చలకు ఇరాన్ అనుసరించబోయే కఠిన వైఖరిని ఇది సూచిక అని పరిశీలకులు తెలిపారు. అమెరికాతో రాజీ పడేందుకు ఇరాన్ ఏ మాత్రం సుముఖంగా లేదు. ముఖ్యంగా హా ర్ముజ్ జలసంధి విషయంలో తన పట్టు వీడడం లేదు.
పూర్తి విజయం సాధించాం :
ఘలీబఫ్
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలపై తాము పూర్తి విజయం సాధించామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించే సమయంలో తాము నిర్దేశించుకున్న తొమ్మిది లక్ష్యాలలో ఏ ఒక్క దానినీ ఆ దేశాలు సాధించలేకపోయాయని ఎద్దేవా చేశారు. సైనిక, రాజకీయ కోణాలలో తమదే విజయమని చెప్పారు. అయితే దీనర్థం అమెరికా లేదా ఇజ్రాయిల్ సేనలను భౌతికంగా నిర్మూలించినట్లు కాదని వివరణ ఇచ్చారు. ‘అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు నిర్దిష్ట, స్పష్టమైన లక్ష్యాలతో మాపై దాడి చేశాయి. ఆ లక్ష్యాలను వారు అధికారికంగా ప్రకటించారు. లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే ఏ స్థాయిలోనూ వాటిని సాధించలేకపోయారు. ఇది అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు అతి పెద్ద, ఘోర పరాజయం’ అని వివరించారు. ఇదిలావుండగా అమెరికా-ఇజ్రాయిల్ సేనలను పూర్తిగా ఓడిస్తామని, మధ్యప్రాచ్యంలో శత్రువులు పూర్తిగా మట్టికరిచే వరకూ వెనుదిరిగే ప్రశ్నే లేదని ఇరాన్ సైన్యం ప్రకటించింది. 1980-1988 మధ్య ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 1990 ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఇరాన్ యుద్ధ ఖైదీలు ఇరాక్ నుంచి స్వదేశానికి రావడం ప్రారంభమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరాన్ సైనిక దళాల జనరల్ స్టాఫ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘నాడు ప్రపంచంలో అత్యంత భారీ ఆయుధాలను కలిగిన సేనలకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతిఘటన వారసత్వాన్ని కొత్త తరం ఇరానీయులకు అందిస్తున్నాం’ అని తెలిపింది. శత్రువు పూర్తిగా లంగిపోయే వరకూ దేశం యొక్క చట్టబద్ధమైన హక్కులు, నాయకత్వ డిమాండ్లను ఇరాన్ కొనసాగిస్తుందని చెప్పింది. ఇరాన్ సాయుధ దళాలకు లభిస్తున్న ప్రజా మద్దతును ప్రశంసించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా దురాక్రమణలకు పాల్పడుతోందని విమర్శిస్తూ దాని ఆధిపత్య ధోరణిని దుయ్యబట్టింది.
దినదిన గండంగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



