Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతాగునీటికే తొలి ప్రాధాన్యం

తాగునీటికే తొలి ప్రాధాన్యం

- Advertisement -

నిల్వ జలాల ఆధారంగానే సాగునీరు విడుదల
కృష్ణా బేసిన్‌లో 76.63 శాతం.. గోదావరిలో 68.1 శాతం నీరు : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలోని ప్రజల తాగు నీటికే తొలి ప్రాధాన్యత ఇస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, తాగునీటి అవసరాలు, ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి విడుదలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా వర్షాలు కురుస్తాయనీ, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదలు వస్తాయని ముందుగానే ఊహించుకుని నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం సమంజసం కాదన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున తాగునీటి భద్రతే ముఖ్యమన్నారు. అదే సమయంలో అందుబాటులో ఉన్న మిగులు జలాలను ఖరీఫ్ పంటలకు అందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 973.68 టీఎంసీలకు గాను 746.12 టీఎంసీలు (76.63), గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీలకు గాను 208.38 టీఎంసీలు(68.1) అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. కృష్ణాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 164 టీఎంసీల నీటి నిల్వ ఉందనీ, ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ఇంకా 47 శాతం మేర వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలను జాగ్రత్తగా అంచనా వేయాలని సూచించారు.

శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యాం, సింగూరు సహా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో అందుబాటులో ఉన్న నీటి పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలకు అవకాశం ఉన్నచోట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్, అవుట్‌లెట్ రెండు వైపుల నుంచి కొనసాగుతున్న పనులపై ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలనీ, భద్రత విషయంలో రాజీపడకుండా పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ర్టంపై ఏర్పడే ముంపు ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఐఐటీ నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న విచారణలు, సుప్రీంకోర్టులోని కేసులు, కృష్ణా జలాల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, తదితర అంశాలపై ఇంజినీరింగ్, న్యాయ విభాగాల అధికారులు సమగ్రమైన నోట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. జలవనరులకు సంబంధించిన అన్ని సాంకేతిక అధ్యయనాల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఈఎన్‌‌సీలు ఓవి. రమేష్ బాబు, టి. శ్రీనివాస్, ఆర్. మధుసూదన్ రావు టన్నెల్‌ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -