విచారణలో భాగంగా పలు కీలకాంశాలు వెలుగులోకి..
లక్నో : అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) తుది నివేదికను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ హోం శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని సోమవారం అర్ధరాత్రి వేళ వెల్లడించింది. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి ట్రస్టుకు అవకాశం దక్కనుంది. ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న సిట్ ని ఏర్పాటు చేసింది. జూన్ 23న ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అందులో అనేక కఠినమైన సిఫారసులను చేసింది.
లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ అధ్యక్షతన ఏర్పడిన ఈ ముగ్గురు సభ్యుల కమిటీలో ఐజీ రేంజ్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా జూన్ 25న శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందులో ఎనిమిది మంది వ్యక్తుల పేర్లతో పాటు ఇతర వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు
ఇదిలా ఉండగా, అంతకుముందు జరిగిన సిట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపాలను సిట్ గుర్తించింది. అనంతరం పలు అరెస్టులు కూడా చేసింది. రామాలయ విరాళాల కౌంటింగ్ కేంద్రాల నుంచి రూ.500 నోట్లతో మొదలైన ఈ చేతివాటం, తర్వాత కట్టలకొద్దీ తస్కరించే వరకూ వెళ్లిందని సిట్ గుర్తించింది. వాటి మొత్తం రూ. 2-3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. అంతేకాదు, సీసీటీవీ నిఘా, భద్రతా నిబంధనల్లోని లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని గతంలో పేర్కొంది. తొలుత కరెన్సీ నోట్లను జేబులో వేసుకున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. తమ దుస్తుల్లో ఆ నోట్లను దాచుకొని, బయటకు తీసుకెళ్లినట్టు నిందితులు అంగీకరించారు. అయితే, ఆ దొంగతనాలను ఎవరూ గుర్తించకపోవడంతో క్రమంగా ఆ నోట్ల సంఖ్య పెరిగింది. కాగా, ఈ కేసులు ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ఆలయ నిర్వహణ కోసం కొత్త సీఈఓ నియామక ప్రక్రియ నడుస్తోంది.
సుప్రీం కోర్టు ఏమంది?
అయోధ్య విరాళాల చోరీ వ్యవహారానికి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని, అలాగే, కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని పేర్కొంది. విరాళాల చోరీపై దర్యాప్తునకు నియమించిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో ఐదో సభ్యుడిగా ఫోరెన్సిక్ ఆడిటర్‌నూ చేర్చాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు పారదర్శంగా జరగాలని, ఆలయంలో అక్రమాలకు చోటివ్వని విధంగా తగిన చర్యలూ తీసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యాబాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం సూచించింది.
కాగా, రామమందిర కానుకల చోరీ వ్యవహారం ఘటన దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పిస్తునే ఉన్నాయి. అయితే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
అయోధ్య ట్రస్ట్‌కు తుది నివేదిక అందజేసిన సిట్
- Advertisement -
- Advertisement -


