నవతెలంగాణ – కామారెడ్డి
బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భట్టు విఠల్ ముదిరాజ్‌ను తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (టీఎస్ సీపీఎస్ఈయూ) రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. యూనియన్ ఆర్థిక నిర్వహణ, జవాబుదారీతనం, సంస్థాగత కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించే బాధ్యతలను రాష్ట్ర కార్యదర్శిగా డా. విఠల్ ముదిరాజ్ నిర్వహించనున్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలనే లక్ష్యంతో సంఘం కొనసాగిస్తున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని విఠల్ ప్రతిజ్ఞ చేశారు. సంఘ రాజ్యాంగం, నియమ నిబంధనలను పాటిస్తూ ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేస్తానని తెలిపారు. డా. భట్టు విఠల్ ముదిరాజ్ నియామకం పట్ల టీఎస్సీపీఎస్ఈయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.



