భారత వైమానిక దళానికి (ఐఎఎఫ్) చెందిన స్క్వాడ్రన్ లీడర్ భవనా కాంత్ మరో అరుదైన చారిత్రాత్మక ఘనతను సాధించారు. ఐఎఎఫ్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘టాప్ గన్’ స్కూల్ నుండి ఉత్తీర్ణత సాధించిన తొలి మహిళా ఫైటర్ కాంబాట్ లీడర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఎనిమిదేండ్ల కిందట ప్రారంభమైన ఆమె విజయ ప్రస్థానంలో ఇది మరొక మైలురాయిగా నిలిచింది. బీహార్‌లోని ఒక చిన్న ప్రాంతం నుండి ఆకాశంలో ఎగరాలని కలలు కని, నేడు తన పేరును భారత సైనిక చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు…
అధికారులకు అధునాతన పోరాట వ్యూహాలలో శిక్షణ ఇచ్చే ఈ కఠినమైన 20-వారాల కార్యక్రమానికి కేవలం కొద్దిమంది IAF పైలట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భావనా కాంత్ ఎంపికకావడంతో అసాధారణమైన ఘనతను సాధించిన తొలిమహిళగా నిలిచింది. అంతేగాదు ఆమె 2021లో, భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు.
ఎవరీ భావనా కాంత్..?
భావనా కాంత్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లా ఘన్‌శ్యామ్‌పుర్ బ్లాక్‌లోని బౌర్ గ్రామం. ఆమె తండ్రి తేజ్ నారాయణ్ కాంత్. ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. బౌర్ గ్రామంలోనే భావనా కాంత్ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. బెగుసరాయ్‌లో 12వ తరగతి వరకు చదివారు. చిన్నతనం నుండి విమానాలు నడపడం అంటే ఆమెకు మహా ఇష్టం. పాఠశాల విద్య పూర్తైన తర్వాత కోచింగ్ కోసం కోట (రాజస్థాన్)కు వెళ్లారు. అనంతరం బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఆమె టాటా కన్సల్టెన్సీలో టెక్నీషియన్‌గా ఎంపికయ్యారు. అయితే ఆమె దేశ సేవ చేయాలనే ఆసక్తితో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాశారు. తల్లిదండ్రుల స్ఫూర్తి, అచంచలమైన అంకితభావం, కఠోర శ్రమతో భావన భారత వాయుసేనకు ఎంపికయ్యారు. అప్పటి నుండి అంచలంచెలుగా ఎదగుతూ వచ్చారు.
సాధించిన ఘనతలు..
2016లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్లుగా నియమితులైన మొదటి ముగ్గురు మహిళలలో ఒకరు. మిగిలిన ఇద్దరు మహిళలు వాణి చతుర్వేది, మోహనా సింగ్. దీంతో భారత విమానయాన చరిత్రలో తొలిసారిగా మహిళలకు ఫైటర్ కాక్‌పిట్‌లోకి ప్రవేశం కల్పించేందుకు నాంది పలికింది. భావనా కాంత్ 2017లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరి, మరుసటి సంవత్సరం మిగ్-21 బైసన్‌పై తన తొలి సోలో ఫ్లైట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత భారత వైమానిక దళం (IAF) అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన సుఖోయ్-30MKIని నడిపే స్థాయికి ఎదిగారు. దీంతో 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా భావనాకు ‘నారీ శక్తి పురస్కార్’ లభించింది. 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఐఏఎఫ్ శకట ప్రదర్శనలో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా ఘనత సాధించారు.
‘భావన యావత్ రాష్ట్రం తలెత్తుకునేలా చేశారు’
భావనా కాంత్ సాధించిన ఈ విజయం మిథిలాంచల్ ప్రాంతం సహా యావత్ బిహార్ గర్వంతో తలెత్తుకునేలా చేసిందని ఆమె తాత నరేంద్ర కుమార్ దాస్ పేర్కొన్నారు. భావన ప్రాథమిక విద్యాభ్యాసం సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని గుర్తు చేశారు. భావన ఉన్నత విద్య కోసం వేరే ప్రాంతానికి వెళ్లారని వెల్లడించారు. పైలట్ అయినప్పటికీ భావన స్వగ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని స్పష్టం చేశారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తరచుగా స్వగ్రామానికి వస్తుంటారని వివరించారు. దేశంలోనే తొలి మహిళా ‘టాప్ గన్’గా నిలిచిన భావనా కాంత్ గురించి ఇప్పుడు యావత్ దేశం తెలుసుకుందని ప్రశంసించారు. ప్రస్తుతం తమ కుటుంబం బీహార్ రాజధాని పట్నాలో నివసిస్తోందని అన్నారు.
మహిళా సాధికారతకు నిదర్శనం
ప్రాథమిక విద్య తర్వాత భావన ఉన్నత విద్యను వేరే చోట అభ్యసించారని భావనా కాంత్ మేనత్త కిరణ్ దేవి తెలిపారు. పైలట్ అయినప్పటి నుంచి భావన మూడు- నాలుగు సార్లు గ్రామాన్ని సందర్శించారని ఆమె చెప్పారు. భావన సాధించిన ఇటీవలి చారిత్రక విజయం తమ గ్రామంలో ఆనందకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చిందని అన్నారు. వైమానిక దళంలో భావన సాధిస్తున్న విజయాలు మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని గ్రామప్రజలందరూ కొనియాడారు. అలాగే ఆమె సాధించిన ఈ ఘనత దేశంలోని ప్రతి మహిళలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు. ప్రతిభ, క్రమశిక్షణ, నిరంతర కృషి ద్వారా ఏ సవాలునైనా అధిగమించవచ్చని భావన తాజా విజయం ఒక బలమైన సందేశాన్ని ఇస్తోంది. అలాగే ఏ రంగంలోనైనా పురుషుల కంటే మహిళలేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది.
తొలి మహిళా టాప్‌గన్ పైలట్‌గా
2024లో రియాద్‌లో జరిగిన ‘వరల్డ్ డిఫెన్స్ షో’ను సందర్శించిన భారతీయ మహిళా అధికారుల త్రివిధ దళాల ప్రతినిధి బృందంలో భావన కాంత్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అతిథిగా ప్రసంగిస్తూ.. రక్షణ దళాలలో నాయకత్వ, కమాండ్ బాధ్యతలతో సహా మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సిన ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. అలాంటి ఆమె ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫైటర్ కంబాట్ లీడర్ (ఎఫ్‌సీఎల్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా టాప్‌గాన్ పైలట్‌గా రికార్డు సృష్టించింది. ఆమె సాధించిన ఘనతలకు ఫిదా అవుతూ సెల్యూట్ మేడమ్ అంటూ నటుడు మాధవన్ ప్రశంసలతో ముంచెత్తారు.



