రాజకీయ నేతల బంధువులకు భారీ లాభాలు
తక్కువ ధరకు కొనుగోలు.. కొన్నేండ్లకే అధిక ధరకు ట్రస్టుకు విక్రయం
బీజేపీ మాజీ మేయర్ బంధువులు, ఏబీవీపీ నేత, ఇతర నాయకుల కుటుంబాల పేర్లు వెలుగులోకి
యూపీలోని అయోధ్యలో రామమందిరం చుట్టూ భక్తి, విశ్వాసం పేరుతో సాగిన నిర్మాణాల వెనుక భూముల లావాదేవీల్లో భారీ లాభాల ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయోధ్యలోని బాగ్ బిజైసీ గ్రామంలో భూముల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వారి బంధువులు, రాజకీయ అనుబంధ వ్యక్తులు తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి.. కొంతకాలం తర్వాత రామమందిర ట్రస్టుకు అధిక ధరలకు విక్రయించిన పలు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఓ జాతీయ ఆంగ్ల వార్థా సంస్థ విశ్లేషణలో ఈ విషయం బయటపడింది.
లక్నో : యూపీలో రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారుతున్న వేళ.. భూముల ధరల పెరుగుదల కొందరికి భారీ లాభాల పంట పండిస్తున్నది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలు, వారి బంధువులు, అనుబంధ వ్యక్తులు ఆలయ ట్రస్టుకు భూములు విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలు పొందుతున్నారన్న ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రామమందిరానికి కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న బాగ్ బిజైసీ గ్రామంలో జరిగిన కొన్ని భూ లావాదేవీలు ఈ పశ్న్రలను మరింత తీవ్రం చేస్తున్నాయి.
ఏబీవీపీ నేతకు నాలుగు రెట్లు
2021 డిసెంబర్‌లో మంతోశ్ మౌర్య 277 చదరపు మీటర్ల భూమిని రూ.13.3 లక్షలకు కొనుగోలు చేశారు. నాలుగేండ్ల తర్వాత 2025 జనవరిలో దానిని రామమందిర ట్రస్టుకు రూ.50 లక్షలకు విక్రయించారు. అంటే దాదాపు నాలుగు రెట్లు అధిక ధర. మౌర్య.. ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ సభ్యుడు. ఆయన యూపీలోని దేవరియా జిల్లా ఏబీవీపీ నగర అధ్యక్షుడిగా ఉన్నారు.
ఎస్పీ నేత బంధువుకూ భారీ లాభం
2021 డిసెంబరులో శిఖా గుప్తా 833 చదరపు మీటర్ల భూమిని రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. 2023 నవంబరులో అందులో 763.3 చదరపు మీటర్లను రామమందిర ట్రస్టుకు రూ.1.14 కోట్లకు విక్రయించారు. శిఖా గుప్తా భర్త అమిత్ గుప్తా.. యూపీ ఎస్పీ వ్యాపార విభాగం రాష్ట్ర కార్యదర్శి నంద్‌కుమార్ గుప్తాకు మేనల్లుడు.
ఉచితంగా వచ్చిన భూమిని.. ట్రస్టుకు భారీ ధరలకు!
మరోలావాదేవీలో హరీశ్, కుసుమ్ పాఠక్‌లు 2021 మార్చిలో 890 చదరపు మీటర్ల భూమిని రవీంద్ర దూబేకు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. అంటే దూబే ఆ భూమిని కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించలేదు. రెండున్నరేండ్ల తర్వాత 2023 అక్టోబరులో అందులో 510 చదరపు మీటర్ల భూమిని రామ మందిర ట్రస్టుకు రూ.54.9 లక్షలకు విక్రయించారు. ఆ భూమి మార్కెట్ విలువ రూ.24.5 లక్షలుగా ఉండగా.. దానికి రెట్టింపు కంటే ఎక్కువ ధర ఆయనకు లభించడం గమనార్హం. కాగా రవీంద్ర దూబే బీజేపీ మాజీ మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయకు బంధువు అని వార్తలు వచ్చాయి. అయితే దానిని రవీంద్ర దూబే ఖండించారు.
నిమిషాల వ్యవధిలోనే రూ.2 కోట్ల భూమి.. రూ.18.5 కోట్లు!
అయోధ్యలో భూ లావాదేవీలపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2021 మార్చిలో బాగ్ బిజైసీలో ఒక భూమిని హరీశ్ పాఠక్, కుసుమ్ పాఠక్‌లు రవీ మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీకి రూ.2 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే అదే భూమిని వారు రామజన్మభూమి ట్రస్టుకు రూ.18.5 కోట్లకు విక్రయించినట్టు గతంలో వార్తలు వెలువడ్డాయి. అంటే ఒకే భూమి లావాదేవీలోనే ధర తొమ్మిది రెట్లకు పైగా పెరగడం గమనార్హం. రవీ మోహన్ తివారీకి రిషికేశ్ ఉపాధ్యాయ కుటుంబంతో బంధుత్వం ఉన్నట్టు సమాచారం.
రూ.9 లక్షల భూమి.. రూ.98.2లక్షలకు!
2020 జనవరిలో విశ్వ మోహిని చౌబే.. బాగ్ బిజైసీ గ్రామంలో 621.66 చదరపు మీటర్ల భూమిని రూ.9 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంత సర్కిల్ రేటు రూ.29.8 లక్షలు. ఐదేండ్ల తర్వాత.. అంటే 2025 ఏప్రిల్‌లో అదే భూమిని రామ మందిర ట్రస్టుకు రూ.98.2 లక్షలకు విక్రయించారు. అంటే కొనుగోలు ధరతో పోలిస్తే దాదాపు 11 రెట్లు ఎక్కువ అన్నమాట. విశ్వ మోహిని చౌబే భర్త ప్రదీప్ చౌబే 2023 అయోధ్య మున్సిపల్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున దేవ్‌కాలీ వార్డు అభ్యర్థిగా పోటీ చేశారు.
యోగి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఎక్కడ?
ఇలాంటి భూ లావాదేవీలపై గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో యూపీలోని బీజేపీ సర్కారు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ భూ లావాదేవీలను పరిశీలించింది. అయితే కమిటీ నివేదిక ఇప్పటి వరకూ బహిర్గతం కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రామమందిరం చుట్టూ భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుండటంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కొందరు రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులు తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, ఆలయ ట్రస్టు భూముల సేకరణ ప్రారంభించిన తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో భక్తులు, ప్రజల నుంచి వస్తున్న పలు అనుమానాలు, ప్రశ్నలకు యోగి సర్కారు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
అయోధ్యలో భూముల దందా
- Advertisement -
- Advertisement -



