నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ పనులతో రైతులకు అవసరమైన సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో యార్డులో మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త షెడ్ల నిర్మాణం, గోదాముల నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వర్షాకాలంలో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా అదనపు షెడ్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఇబ్బందులు తగ్గనున్నాయి.
మార్కెట్‌కు వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇప్పటికే రూ.5కే భోజనం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు, అవసరమైన సమయంలో భోజనం చేసేందుకు అనువైన వసతులను కల్పిస్తున్నారు. మార్కెట్ యార్డులో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, లైటింగ్ తదితర సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ఈ-నామ్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, ఈ-కెవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి ప్రక్రియలను వేగవంతం చేయడంతో పంట విక్రయాల అనంతరం రైతులకు నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్లో వివిధ పంటలకు సంబంధించిన రోజువారీ గరిష్ట, కనిష్ట ధరలను డిజిటల్ బోర్డుల ద్వారా రైతులకు తెలియజేసేలా చర్యలు చేపడుతున్నారు. మార్కెట్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక యూనిఫాం విధానాన్ని అమలు చేయడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించనున్నారు. వ్యాపారులకు సింగిల్ ట్రేడింగ్ లైసెన్స్ విధానం అందుబాటులో ఉండటంతో మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఏర్పడుతుందని మార్కెట్ కమిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు భవిష్యత్‌లో మరింత పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.3.70 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయితే రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలు కూడా వేగవంతం కానున్నాయి.ఈ అభివృద్ధి పనుల ద్వారా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను రైతులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పనిచేస్తోందని చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి ఫసియోద్దీన్(ముక్రమ్) మాట్లాడుతూ ఇప్పటికే మార్కెట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మూడు కోట్ల 70 లక్షల రూపాయల తో వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.



