- –సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
– పాత పద్ధతిలోనే ఎరువులను పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) సంతకాల సేకరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు ఎరువులను పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాకర్లపల్లి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… యూరియా పొందేందుకు యాప్‌లో వివరాల నమోదు, సాంకేతిక సమస్యలు, సర్వర్ నిలిచిపోవడం వల్ల రైతులు రోజుల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే పాత విధానాలనే కొనసాగించాలని, సాగుకు అవసరమైన ఎరువులను సమయానికి అందుబాటులో ఉంచాలని కోరుతూ ఈ సంతకాల సేకరణ చేపట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ… ప్రభుత్వం స్పందించి యూరియా కొరతను తక్షణమే తీర్చకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనల కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, కాకర్లపల్లి గ్రామ సర్పంచ్ పొదిలి మారేశ్వరరావు, రైతు సంఘం మండల నాయకులు వేపులపాటి కుమారస్వామి, కంచర్ల నాగేశ్వరరావు, కొప్పుల రమేష్, కంచర్ల వెంకటేశ్వరరావు, బండి వేలాద్రి, దాట్ల రాంబాబు, చంటి, తడికమళ్ల రామకృష్ణ, రాగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



