– ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
– అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్‌రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్ ఎస్పీకి స్వాగతం పలికారు.అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్, పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలకు సత్వర న్యాయం అందేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. వివిధ వర్టికల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్నారు.
పేకాట, కోడిపందాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులను సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చోరీకి గురైన ఆస్తి రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి:
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సీసీటీఎన్‌ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.
పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ – 112 కు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు.కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, సీఐ నాగరాజు, అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజు, దమ్మపేట ఎస్సై రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



