Friday, August 21, 2026
E-PAPER
Homeఖమ్మంఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మెను జయప్రదం చేయాలి

ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మెను జయప్రదం చేయాలి

- Advertisement -

– వాహన కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

రాష్ట్రంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. శుక్రవారం దమ్మపేట ఆటో అడ్డా వద్ద నిర్వహించిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానిపై దృష్టి సారించే తీరిక మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

ఆటో కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని, దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని తెలిపారు. ఆర్టీసీతో ఆటోలను అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోటార్ రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల కారణంగా ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ‘టీజీ యాప్’ తీసుకువచ్చి ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. చట్టవిరుద్ధంగా వైట్‌ ప్లేట్‌తో నడుపుతున్న ద్విచక్ర వాహనాలను నిషేధించాలని,త్రీ వీలర్ లైసెన్సులను ఎల్‌ఎంవీగా మార్చే సమయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.

కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు విక్రం, బాలయ్య, వెంకట్, రవి, శ్రీను, బుచ్చిరాజు, రాజశేఖర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -