– ట్రాఫిక్, శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులు
– మూడు రోడ్ల ప్రధాన కూడలిలో ఏర్పాటు
– ప్రారంభ వేడుకలతో డీజే హోరు
– విద్యార్థుల చదువులకు ఆటంకం..
– వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలోని ప్రధాన కూడలి విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రారంభ వేడుకలు, డీజే శబ్ధాలతో నిత్యం రద్దీగా మారుతోంది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన మార్గాలు కలిసే ఈ కూడలిలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
ఇదే కూడలిని ఆనుకుని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలతో పాటు ముస్లిం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి. పాఠశాలల ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న డ్రైనేజీ ప్రాంతంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయా కులాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్వామి వివేకానంద, మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలంగాణ తల్లి, జ్యోతిరావు పూలే దంపతులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు.
వరుసగా విగ్రహాల ప్రారంభాలు:
ఇటీవల పునర్నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ ఛైర్పర్సన్ ,వైస్ ఛైర్పర్సన్ లు జూపల్లి శశికళ రమేష్ బాబు లు ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన కొమరం భీమ్ విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు సుమన్, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. త్వరలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాకలి ఐలమ్మ విగ్రహం నిర్మాణంలో ఉంది. బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మాదిగ సామాజికవర్గ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
వేడుకల సమయంలో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి?
మహనీయులను స్మరించుకోవడం, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమే. అయితే జయంతులు, వర్ధంతులు, విగ్రహాల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధాన కూడలిలో పెద్దఎత్తున జనసమీకరణ, డీజే శబ్ధాలు, ప్రముఖుల రాకతో ట్రాఫిక్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు అత్యవసర వాహనాలు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంటోంది.
డీజే హోరుతో విద్యార్థులకు ఇబ్బందులు:
పాఠశాలల సమీపంలోనే వేడుకలు నిర్వహిస్తూ డీజేలు ఏర్పాటు చేయడం విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తరగతులు జరిగే సమయంలో పెద్ద శబ్ధాలతో డీజేలు మోగిస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల చుట్టుపక్కల శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
భవిష్యత్తు అవసరాలపై ఆలోచించాలి:
కుల అస్థిత్వాన్ని చాటుకోవడం కోసం మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్, పాఠశాలల అవసరాలు, శబ్ధ కాలుష్యం, ప్రజల రాకపోకలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు సమన్వయంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి విగ్రహాల ఏర్పాటు, వేడుకలకు తగిన నిబంధనలు రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు.



