Saturday, August 22, 2026
E-PAPER
Homeమానవిఅతనిలో మార్పు వచ్చింది

అతనిలో మార్పు వచ్చింది

- Advertisement -

చాలా మంది ఏదో కారణం చెప్పి మద్యం తాగుతుంటారు. ఫంక్షననో, స్నేహితుడొచ్చాడనో, బాధగా ఉందనో, సంతోషంగా ఉన్నామనో… ఇలా తాగాలనుకునే వాళ్లకు సవాలక్ష కారణాలుంటాయి. ఇక కొందరైతే పూర్తిగా దానికి బానిసలై పోతుంటారు. అలాంటి వారికి ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఇబ్బందులు పడుతున్న కుటుంబం గురించే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)‌లో తెలుసుకుందాం…

సుహాసినికి దాదాపు 35 ఏండ్లు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు పిల్లలున్నారు. బాబుకు 12 ఏండ్లు, పాపకు 5 ఏండ్లు. ఇద్దరూ స్కూల్‌‌కి వెళుతున్నారు. భర్త దినేష్‌, ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం ఏమీ చేయడం లేదు. వీరిది ప్రేమ వివాహం. పెండ్లి జరిగి 14 ఏండ్లు అవుతుంది. పదేండ్ల నుండి ఉమ్మడి కుటుంబం నుండి వేరుపడి విడిగా ఉంటున్నారు.
దినేష్‌‌కు మద్యం అలవాటు ఉంది. ఇది ఇప్పుడు వ్యసనంగా మారింది. ఒక విధంగా మద్యానికి బానిసైపోయాడు. అతనితో ఎక్కడికైనా వెళ్లాలంటే సుహాసిని భయపడుతుంది. ఎందుకంటే బాగా తాగి బంధువులతో, చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకుంటాడు. ఈ సమస్యతో ఇప్పటికే ఏడెనిమిది ఇండ్లు మారాల్సి వచ్చింది. ఉద్యోగం చేయడు, ఇంటి ఖర్చులు పట్టించుకోడు, పైగా గొడవలు చేస్తుంటాడు. ఒక వేళ ఏదైనా పని చేసినా కేవలం తాను తాగడానికి మాత్రమే చూసుకుంటాడు. తన దగ్గర లేకపోతే అప్పులు చేస్తాడు. సుహాసిని ఎప్పుడైనా సరుకులు తెమ్మని, పిల్లలకు ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే వాటితో కూడా తాగేస్తాడు.

చివరకు సుహాసిని వాళ్ల అత్తగారింటికి కూడా వెళ్లడం లేదు. అక్కడకు వెళ్లినా తల్లి, తండ్రి, తమ్ముడు, మరదలిని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అందుకే ఆమెకు అక్కడికి వెళ్లాలంటే భయం. తాగొచ్చి పిల్లల్ని కూడా కొడతాడు. తాగనప్పుడు మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. పాపను, బాబును స్కూల్‌ ‌దగ్గర దింపి తీసుకొస్తాడు. సుహాసిని తల్లికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్‌‌కి తీసుకెళతాడు, మందులు ఇప్పిస్తాడు. తన తల్లికంటే కూడా అత్తనే బాగా చూసుకుంటాడు. తాగినప్పుడు మాత్రం విపరీతంగా తిడతాడు.
అతన్ని రీహాబిటేషన్‌ ‌సెంటర్‌‌కి పంపించాలన్నా సుహాసిని భయపడుతుంది. అంతకు ముందు వాళ్ల ఆడపడుచు దినేష్‌‌ను డాక్టర్‌ ‌దగ్గరకు తీసుకెళ్లింది. మందులు తీసుకొచ్చింది. కానీ అవి వాడినప్పుడు అతను ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆరు నెలల వరకు మద్యం ముట్టుకోలేదు. ప్రస్తుతం ఆ డాక్టర్‌ ‌లేడు. ఎలాగైనా తన భర్తలో మార్పు తీసుకురావాలనుకుంది. అందుకే సలహా కోసం ఐద్వా అదాలత్‌‌కు వచ్చింది.

మేము దినేష్‌‌ని పిలిపించి మాట్లాడాము. అతను చెప్పింది ఏమిటంటే ‘నేను కూడా తాగడం మానుకోవాలనే అనుకుంటున్నాను. కానీ మానలేకపోతున్నాను. మా కుటుంబం మొత్తం సుహాసినీకే సపోర్ట్‌ ‌చేస్తుంది. మా అమ్మ, అక్క ఇద్దరూ సుహాసినీ ఏం చేసినా సరే అంటారు. నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తాగనప్పుడు చాలా మంచిగా ఉంటాను. అయినా నా గురించి ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడరు. ఇంట్లో ఏ ఫంక్షన్‌ ఉన్నా సుహాసినీకి చెబుతారు తప్ప నాకు ఒక్కమాట కూడా చెప్పరు. ఆమె నాకు సరిగ్గా వంట చేసి పెట్టకపోయినా నేను ఏమీ అనను. నా పిల్లలైతే నేను తాగినప్పుడు అసలు నా దగ్గరికే రారు. అదే తాగకపోతే వాళ్ల అమ్మ దగ్గకు వెళ్లమన్నా వెళ్లరు.
ఒకప్పుడు మా అక్క నాకు బాగా సపోర్ట్‌ ‌చేసేది. నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆమెనే పరిష్కరించేది. నాకు ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆమెనే సహాయం చేసేది. అలాంటి ఆమె ఇప్పుడు నాతో మాట్లాడడం మానేసింది. నా భార్యా పిల్లలను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పిల్లలకి నేను లేకపోయినా పర్లేదు, వాళ్ల అత్త ఉంటే చాలు అన్నట్టుగా ఉంటారు. నేను ఇంట్లో ఏం చేసినా ఇద్దరూ ఫోన్‌ ‌చేసి వాళ్ల అత్తకు చెబుతారు. నేను ఎంతగా బతిమలాడినా అక్క నాతో మాట్లాడడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి సుహాసిని ‘నువ్వు తాగుడు మానుకుంటే మాట్లాడుతుంది. నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు తాగి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఆమె మాత్రం ఎన్ని రోజులని ఓపిక పడుతుంది’ అని అన్నది. వెంటనే దినేష్‌ అందుకొని ‘చూశారా మేడం ఇలాగే నన్ను మానసికంగా హింసిస్తున్నారు. అందుకే నేను తాగుతున్నాను’ అన్నాడు.

‘చూడు దినేష్‌ ‌మీకు భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులపై నిజంగా ప్రేమ వుంటే తాగడం మానుకోవాలి. తాగినప్పుడు పిల్లలు రారని మీరే చెబుతున్నారు. కాబట్టి వాళ్ల కోసమైనా మీరు మారాలి. ఇప్పటికే మీపై చిరాకుతో మీ అక్క మాట్లాడడం మానేసింది. భార్య కాబట్టే సుహాసిని ఇంత ఓపికతో మిమ్మల్ని మార్చుకోవాలని తపిస్తుంది. మా దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా మీరు తాగుడు మానుకొని ఇంటిని పట్టించుకోకపోతే ఆమె మాత్రం ఎన్ని రోజులని భరిస్తుంది. వెంటనే డాక్టర్‌ ‌దగ్గరకు వెళ్లి మందులు వాడండి. మీరు మారడానికి ప్రయత్నిస్తే కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు. మద్యం తాగే స్నేహితులకు, బంధువులకు కొన్ని రోజులు దూరంగా ఉండండి. మీకు భార్యా పిల్లలు కావాలనుకుంటే తాగడం మానాల్సిందే, ఇక మీ ఇష్టం. మీకు ఆరు నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికీ మీరు తాగడం మానకపోతే సుహాసిని విడాకులు ఇస్తానంటుంది, అప్పుడు మీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోండి’ అని కాస్త గట్టిగానే చెప్పాము.
దాంతో భయపడ్డ అతను ‘లేదు మేడం, నేను కచ్చితంగా మానేస్తాను. నాకు భార్యా పిల్లలు కావాలి. వాళ్లు లేకపోతే నేను బతకలేను. సుహాసిని ఇంత దూరం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక నా వల్ల తనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’ అని చెప్పి వెళ్లిపోయాడు.
మళ్లీ ఆరు నెలల తర్వాత వచ్చి మేడం నేను తాగడం మానేశాను. నా భార్యా పిల్లల కోసం మారాను. ఉద్యోగం కూడా చూసుకున్నాను. మా ఇంట్లో ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదు. అందరూ నాతో మంచిగా ఉంటున్నారు’ అని చెప్పాడు.

‘ఇది చెప్పాల్సింది మీరు కాదు, మీ భార్య..’ అన్నాము. దినేష్‌ ‌వెంటనే సుహాసినికి ఫోన్‌ ‌చేసి మాకు ఇచ్చాడు.
‘మేడమ్‌ ఇప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చింది. తాగడం మానుకున్నాడు. చాలా మార్పు కూడా వచ్చింది. మాతోనే కాదు అందరితో మంచిగా ఉంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మీ దగ్గరకు రావడం వల్లనే ఆయనలో ఈ మార్పు వచ్చింది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’ అని సంతోషంగా చెప్పింది.

– వై. వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -