Saturday, August 22, 2026
E-PAPER
Homeఆటలుపతకం ఖాయం

పతకం ఖాయం

- Advertisement -

క్వార్టర్స్‌లో చైనా ద్వయంపై
గాయత్రి, ట్రెసా గెలుపు
పోరాడి ఓడిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ
బిడబ్ల్యూఎఫ్‌ 
ప్రపంచ 
చాంపియన్‌షిప్స్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆతిథ్య భారత్‌ ఓ పతకం ఖాయం చేసుకుంది. 2011 నుంచి బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కనీసం ఓ మెడల్‌ సాధిస్తూ వచ్చిన టీమ్‌ ఇండియా.. 17 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్‌లో ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ.. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి జంట నుంచి ఒక్క విజయం వచ్చినా.. పతకం ఖాయమైన పరిస్థితుల్లో అమ్మాయిలు అదరగొట్టారు. తాజాగా ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున దక్కించుకున్న గాయత్రి, ట్రెసాలు క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న వేళ భారత్‌కు మెడల్‌ ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌, చైనా షట్లర్లు జియా యి , జాంగ్‌ షులపై పుల్లెల గాయత్రి గోపీచంద్‌, ట్రెసా జాలి మూడు గేముల మ్యాచ్లో గెలుపొందారు. 16-21తో తొలి గేమ్‌లో నిరాశపరిచిన గాయత్రి, ట్రెసాలు తర్వాత వరుస గేములను 21-15, 21-13తో గెల్చుకుని మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఈ విజయంతో గాయత్రి, ట్రెసాలు భారత్‌ ఓ మెడల్‌ ఖాయం చేయటంతో పాటు 2001 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించనున్న రెండో భారత జోడీగా నిలువనుంది. 2001 లండన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ షట్లర్‌ గుత్వా జ్వాల, అశ్విని పొన్నప్పలు మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలి మెడల్‌ అందించిన సంగతి తెలిసిందే.

మనోళ్లు ఇరగదీశారు
మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో సహజంగానే నాల్గో సీడ్‌ చైనా జోడీ ఫేవరేట్‌గా బరిలోకి దిగారు. అంచనాలకు తగినట్టుగానే తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. మెగా ఈవెంట్లలో ఆడిన, నెగ్గిన అనుభవం చైనా షట్లర్ల సొంతం. యువ షట్లర్లు గాయత్రి, ట్రెసాలు మంచి పోటీ ఇస్తున్నారు అదే చాలు అనిపించిన తరుణంలో మ్యాచ్‌ సమీకరణాలు మారిపోయాయి. తొలి గేమ్‌ కోల్పోయినా, ఏమాత్రం ఒత్తిడికి గురవని గాయత్రి, ట్రెసాలు ప్రత్యర్థి తమ వ్యూహం ప్రకారం గేమ్‌ ఆడేలా చేశారు. రెండో గేమ్‌ ఆరంభంలోనూ చైనా షట్లర్లు 10-7తో ముందంజలో నిలిచారు. కానీ నెట్ దగ్గర అవకాశాలు సృష్టించుకున్న గాయత్రి, ట్రెసాలు క్రాస్‌ కోర్టు స్మాష్‌లతో చైనా అమ్మాయిలను షాక్‌కు గురి చేశారు. 21-15తో రెండో గేమ్‌ గెల్చుకున్న మనోళ్లు మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మ్యాచ్‌ గాయత్రి, ట్రెసా జోడీ వైపు మొగ్గింది. మూడో గేమ్‌లో పూర్తి ఎటాకింగ్‌ ఆటతీరు కనబరిచి 9-4తో ముందంజ వేశారు. అదే జోరులో ద్వితీయార్థంలోనూ వరుసగా పాయింట్లు సాధించిన గాయత్రి, ట్రెసాలు 21-13తో మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ క్వార్టర్‌ఫైనల్లో నిరాశపరిచారు. మూడో సీడ్‌ చైనా షట్లర్లు కెంగ్‌, చాంగ్‌లు 21-18, 21-9తో సాత్విక్‌,చిరాగ్‌లపై వరుస గేముల్లో విజయం సాధించారు. ఈ ఓటమితో సాత్విక్‌,చిరాగ్‌ పతక ఆశలు ఆవిరయ్యాయి. సింగిల్స్‌లో పి.వి సింధు, లక్ష్యసేన్‌లు ప్రీ క్వార్టర్‌ఫైనల్లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

‘మ్యాచ్‌తో పాటు భావోద్వేగాలు ఎంతో కఠినంగా సాగాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించటం సంతోషంగా ఉంది. మేము ఓ లక్ష్యంతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు వచ్చాం, ఇక్కడితో (పతక ప్రదర్శన)తో ఆగబోము. ఈ రోజు మ్యాచ్‌లో అభిమానుల మద్దతు అమోఘం. ఒత్తిడితో కూడుకున్న సమయంలో విజయం దిశగా సాగేందుకు అభిమానుల మద్దతు దోహదం చేసింది. వెనుకంజలో నిలిచినా, ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ఆడుతూ పాయింట్ల సాధనపై దృష్టి నిలపటం విజయానికి కారణమైంది’
పుల్లెల గాయత్రి గోపీచంద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -