శ్రీశైలం నుంచి నిత్యం నీటి దోపిడీ
రైతులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
నల్లగొండ ఉమ్మడి జిల్లా మంత్రులు చేతకాని దద్దమ్మలని, నాగార్జున సాగర్ నీళ్లను అంధ్రప్రదేశ్ యథేచ్ఛగా దోచుకొని పోతున్నా నోరు ముసుకున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి నిత్యం నీటి దోపిడీ జరుగుతున్నదన్నారు. జిల్లాలో ఈ ఇద్దరు మంత్రుల వల్ల వ్యవసాయం ఆగం అయిందని సాక్ష్యాలతో సహా ఆంధ్రా నీటి దోపిడీని కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు ద్వారా బొక్కపెట్టి నదిని మొత్తాన్నీ మళ్లించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆంధ్రా వాళ్ల ఆటలు సాగనివ్వలేదన్నారు. సాగర్ ఓవర్ ఫ్లో అయి సముద్రంలో నీళ్లు వదిలినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుపోవాలని నిబంధన ఉందని, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని దోచుకొని రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను ఫుల్‌గా ఏపీ ప్రభుత్వం నింపుకుంటున్నదని తెలిపారు.
నాగార్జున సాగర్‌లో ఇప్పుడున్న నీటి కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా సాగు నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. 17 సార్లు వరుసగా నీళ్లు అందించామని, చెప్పి మరి నీళ్లు ఇచ్చి చూపామని తెలిపారు. ఎడమ కాల్వ కింద ఉన్న లిఫ్ట్‌లకు కూడా పుష్కలంగా నీళ్లు అందించామన్నారు. ప్రస్తుతం సాగర్‌లో 532 అడుగుల నీటి మట్టం ఉందని, ఇప్పుడు ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వచ్చని తెలిపారు. కానీ జిల్లా మంత్రులు నిద్ర మత్తులో జోగుతూ కేవలం పదవుల భయంతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ఎడమ కాల్వకు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. సాగర్‌లో ఓ యాగం చేసి చేతులు దులుపుకున్నారని, రైతులు పంటలు పండనివ్వొద్దని కుట్ర చేస్తున్నారని అన్నారు. పంటలు పండితే బోనస్, యూరియా ఇవ్వాలని కావాలనే ఈ ప్రభుత్వం దొంగచాటుగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి పిచ్చోడిలా నీళ్లు ఇవ్వమని చెబుతున్నారని, కానీ కోమటిరెడ్డిన, ఉత్తమ్‌ని గెలిపించి సాగర్ ఆయకట్టు రైతులు తప్పు చేశారని అన్నారు. కేసీఆర్‌తో చర్చించి ఓ కార్యాచరణ రూపొందిస్తున్నామని, పార్టీ తరుపున పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. ఎలాగైనా నీటిని సాధిస్తామని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లబోతు భాస్కరరావు, మాజీ జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మంత్రులు చేతకాని దద్దమ్మలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



