Saturday, August 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగుర్తింపునకు నోచుకోని కౌలు రైతులు

గుర్తింపునకు నోచుకోని కౌలు రైతులు

- Advertisement -

వ్యవసాయ పథకాలు వర్తించవు..
సర్కారు పథకాలు భూ యజమానులకే
పంట అమ్ముకునేందుకూ కష్టాలు..

నూటికి 92.5 శాతం కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ..
ఓటీపీల గోలతో అడుగడుగునా ఇబ్బందులే
రుణాలివ్వడానికి బ్యాంకుల నిరాకరణ..

ప్రయివేటు అప్పులకు మిత్తీలకు మిత్తీలు కడుతున్న వైనం..
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సర్వేలో వెల్లడి
ఊపందు
కుంటున్న కౌలు రైతుల హక్కుల ఉద్యమం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాగు చేయకున్నా భూ యజమానులకు పథకాలతో లబ్ది చేకూరుస్తున్న రాష్ట్ర సర్కారు.. భూమినే నమ్ముకుని ఇంటిల్లిపాదితో కష్టపడుతున్న కౌలు రైతులను మాత్రం గుర్తించడం లేదు. ఓటీపీల విధానం కౌలుదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడంతో విత్తనాలు, ఎరువులు కొనే దగ్గర నుంచి పంటను అమ్ముకునే వరకు అడుగడుగునా అరిగోస వెల్లబుచ్చుకోవాల్సి వస్తున్నది. ‘‘కౌలు రైతులా…మీకు ఏం చూసి రుణాలివ్వాలి’’ అంటూ బ్యాంకులు మొహం మీదనే చెబుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏటా ఖర్చుపెడుతున్న వేల కోట్ల రూపాయలు యజమానుల ఖాతాల్లో పడిపోతుండగా…కౌలు రైతులు నిండా మునిగిపోతున్నారు. 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులివ్వాలనే విషయాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ‌పాలకులూ…నేటి కాంగ్రెస్‌ సర్కారు ‌పాలకులూ విస్మరిస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కౌలు రైతుల హక్కుల కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ, రైతు స్వరాజ్య వేదిక చేపట్టిన సర్వేలో పలు కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఏటేటా పెరుగుతున్న కౌలు…
తెలంగాణలో 30 శాతం మేర కౌలు రైతులున్నారు. కాగా, 22 జిల్లాల్లో 57 గ్రామాల్లో 1,816 మంది కౌలు రైతుల స్థితిగతులపై సర్వే చేపట్టారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే 92.5 శాతం మంది ఉన్నారు. కౌలు గరిష్టంగా ఎకరాకు రూ.53 వేలు పలుకుతుండగా కనిష్టంగా రూ.10 వేలు ఉంది. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో, ప్రాజెక్టుల కింద కౌలు రేట్లు భారీస్థాయిలో ఉన్నాయి. ఒకటెండ్రు ఎకరాలు కౌలుకు తీసుకుంటే ఏమీ మిగలకపోతుండంతో ఎక్కువ మంది ఐదెకరాలకుపైనే కౌలుకు తీసుకుంటున్న పరిస్థితి. కౌలుకు తీసుకునే భూమి పెరుగుతున్నకొద్దీ రిస్కు కూడా పెరుగుతున్నదని రైతులు చెప్పారు. సర్వే చేసిన కౌలు రైతుల్లో అస్సలు భూమి లేని వారు 16 శాతం మంది ఉన్నారు. రెండున్నర నుంచి ఐదెకరాల లోపే ఉండి మిగతాది భూమి లేని వారు 16 శాతం మంది ఉన్నారు. రెండున్నర నుంచి ఐదెకరాల లోపే ఉండి మిగతాది కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్న కౌలు రైతులు 73.1 శాతం.

అప్పు రూ. 2 లక్షలకుపైనే
సర్వేలో పాలుపంచుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సగటున రూ.2 లక్షల చొప్పున అప్పు ఉంది. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు లభించట్లేదు. దీంతో అనివార్యంగా కౌలు రైతులు వడ్డీ వ్యాపారులు, షావుకార్లు, ఎరువులు, విత్తన వ్యాపారులు, పంటలను కొనుగోలు చేసే దళారులు, బంధువులు, భూ యజమానుల వద్ద సాగు కోసం అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీ వ్యాపారులు, షావుకారుల వద్ద 1,214 మంది కౌలు రైతులు, గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు అమ్మేవారు, పంటలు కొనుగోలు చేసే దళారుల వద్ద 540 మంది అప్పులు తీసుకున్న పరిస్థితి. తీసుకున్న డబ్బులకు ప్రతి వెయ్యి రూపాయలకు రూ.2 నుంచి రూ.3 చొప్పున అసలుకు తోడు రూ.20 వేల నుంచి రూ.30 వేలు మిత్తీనే కట్టాల్సి వస్తోంది.

పథకాల్లో దక్కుతుంది అంతంతే…
ఓటీపీలతో తిప్పలే
సర్వేచేసిన కౌలు రైతుల్లో కేవలం 412 మంది మాత్రమే సబ్సిడీ ఎరువులు పొందగలిగారు. 1394 మంది కౌలు రైతులు సబ్సిడీ యూరియా పొందలేకపోయారు. రాయితీతో యూరియా పొందిన 412 మందిలో కౌలురైతులమని చెప్పి తెచ్చుకున్నది 40 మంది మాత్రమే. ఎరువులకు సంబంధించిన యాప్‌ ఓటీపీల సమస్య కౌలు రైతులను తీవ్రంగా వెన్నాడుతున్నదని దీనినిబట్టే అర్థమవుతున్నది. హైదరాబాద్‌‌లోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉండే భూ యజమానాలు ఓటీపీలు చెప్పే విషయంలో కౌలురైతులకు పెద్దగా సహకరించడం లేదు. దీంతో అనివార్యంగా కౌలు రైతులు బ్లాక్‌‌లో ఎరువులు కొనాల్సిన దుస్థితి నెల కొంది. కొందరు భూ యజమానులు తమ పేరుతో యూరియా బస్తాలు తీసుకుని కౌలు రైతులకు వంద, రెండు వందల రూపాయలు అదనంగా తీసుకుని ఇస్తున్నట్టు కూడా సర్వేలో తేలింది.

పంట నష్టపరిహారం అందింది 11 మందికే..
సర్వేలో పాల్గొన్న 1816 మంది కౌలు రైతులకుగానూ 1548 కౌలు రైతులకు పంట నష్టం వాటిల్లింది. అందులో 1171 మంది కౌలు రైతులకు సంబంధించి పంట నష్టాన్నే అధికారులు నమోదు చేయలేదు. కేవలం 264 మందికి భూ యజమాని పేరుతో పంటనష్టాన్ని నమోదు చేశారు. 45 మంది యజమానుల అకౌంట్‌‌లలో నష్టపరిహారం డబ్బులు పడ్డాయి. వాటిని యజమానులు కౌలు రైతులకు ఇవ్వలేదు. కౌలు రైతుల పేరిట నష్టపరిహారం నమోదు చేసింది 116 మంది రైతులకే. అందులో పరిహారం అందింది 11 మందికి మాత్రమే.

పంట అమ్ముకోవడంలోనూ అన్యాయమే…
మొత్తం సర్వే చేసిన రైతుల్లో 1137 మంది పత్తిని సాగు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన కపాస్‌ ‌కిసాన్‌ ‌యాప్‌ ‌కౌలు రైతులకు ప్రాణసంకటంగా మారింది. అందులో 551 మంది కౌలు రైతులు సీసీఐలో కాకుండా బయట అమ్ముకున్నారు. దీనివల్ల క్వింటాకు రూ.6,500 మాత్రమే పొందారు. సీసీఐ కనీస మద్దతు ధర రూ.8,110తో పోలిస్తే రూ.1,600 తక్కువ. ఐదెకరాలు కౌలుకు సాగు చేసిన పత్తి రైతు సగటున ఎకరాకు రూ.64 వేలు నష్టపోయిన పరిస్థితి. భూ యజమాని ఖాతా మీద 26 శాతం మంది కౌలు రైతులు పత్తి పంటను అమ్ముకున్నారు. సీసీఐకి అమ్ముకున్నవారిలోనూ తమ సొంత భూమిలో పండిన పంటకు జోడించి అమ్ముకున్న పరిస్థితి. 888 మంది కౌలు రైతులు వానాకాలం సీజన్‌‌లో వడ్లు సాగు చేశారు. ధాన్యం అమ్మిన డబ్బులు నేరుగా భూ యజమానుల ఖాతాల్లో పడుతుం డటంతో సన్నవడ్లకు బోనస్‌ ‌విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయమే జరుగుతున్నది. 680 మంది సన్నవడ్లను సాగు చేస్తే కేవలం 163 మంది కౌలు రైతులే రూ.500 బోనస్‌‌ పొందగలిగారు.

భూ యజమాని, కౌలు రైతు సంబంధాలు అంతంతే…
దున్నేవారికే భూమిపై హక్కు కలగాలని పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన సంగతి తెలిసిందే. ఆ పోరాట ఫలితంగానూ, ఏడున్నర దశాబ్దాలుగా వివిధ రూపాల్లోనూ గ్రామీణ పేదలకు భూములు అందినా భూ సమస్య పరిష్కారం కాలేదు. అసైన్డ్‌ ‌పేరిట పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములనూ అభివృద్ధి పేరిట పాలకులు గుంజుకుంటున్న పరిస్థతి. దీంతో అనివార్యంగా విదేశాలకు, నగరాలకు వలసెళ్లిపోయిన భూ యజమానుల దగ్గర పేదలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూ యజమానులు పెత్తందారీ ధోరణులతో వ్యవ హరిస్తున్న పరిస్థితి సర్వేలో తేలింది. రైతు భరోసా, రైతు బీమా, పంట నష్టపరిహారం, బ్యాంకు రుణాల వంటి ప్రభుత్వ పథకాలు కూడా భూ యజమాని కేంద్రంగానే ఉంటున్నాయి. వారే లబ్ది పొందు తున్నారు. ఆరుగాలం భూమినే నమ్ముకుని శ్రమ కోరుస్తున్న కౌలు రైతులు మాత్రం పుట్టెడు అప్పు ల్లోకి కూరుకుపోతున్నారు. రెండేండ్లలో 341 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో 200 మందికిపైగా కౌలు రైతులే ఉన్నారు.

రుణార్హత కార్డులతోనే ఊరట
2011 చట్టం ప్రకారం కౌలురైతులకు రుణార్హత కార్డులివ్వాలి. వాటి ద్వారా రుణాలు లభిస్తాయి. రుణమాఫీ లాంటి పథకాలు అందు తాయి. కౌలు రైతులకు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వర్తించే అవకాశం ఉంటుంది. పంట అమ్ముకునే సౌకర్యం కలుగుతంది. అదే సమయంలో కౌలు రేట్ల నిర్ణయంపైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.




​యూరియా ఓటీపీ సిస్టమ్‌ ఎత్తేయాలి…కౌలు రైతులకు న్యాయం చేయాలి
పంట ఎదిగే సమయంలో యూరియా అవసరం చాలా ఉంది. యూరియా ఓటీపీ సిస్టమ్‌ మాకు ఇబ్బందిగా మారింది. దాన్ని వెంటనే ఎత్తేయాలి. నేను చేస్తున్న భూమి యజమాని అమెరికాలో ఉంటున్నడు. ఇక్కడ మార్నింగ్‌ ఉంటే అక్కడ రాత్రి అయితున్నది. వాళ్లు ఫోన్‌ ఎత్తడం లేదు. యూరియాకు ఇబ్బంది అవుతున్నది. గత్యంతరం లేక బ్లాక్‌‌లో ఐదారొందలు పెట్టి కొనాల్సి వస్తున్నది. భూమినే నమ్ముకుని బతుకుతున్న మాలాంటి కౌలు రైతుల బాధల్ని గుర్తించి సర్కారు న్యాయం చేయాలి. ఐడీ కార్డులివ్వాలి. బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. ఇబ్బందులు లేకుండా పంటల్ని కొనాలి. -గిరి, నారేగూడెం, నవాబ్‌‌పేట మండలం, వికారాబాద్‌ ‌జిల్లా

రేవంత్‌‌రెడ్డి సారూ గుర్తింపు కార్డు ఇచ్చి సాయం చేస్తే పుణ్యముంటది
మాకు రెండెకరాలుంది. ఇటుపొంటి, అటుపొంటి ఉన్న నాలుగెకరాలు కౌలుకు దీసుకున్న. ముందే ఎకరానికి 9 వేల లెక్క 36 వేల కౌలు కట్టినం. ఆరెకరాల భూమిల పోరాడుతున్నం సార్‌. రెండేండ్ల నుంచి వాతావరణం సరిగా లేదు. ఎంత పోరాడినా పెట్టుబడి పెట్టిన పైసలు మళ్ల తిరిగొస్తలేవు. భూమి పట్టుకుని నష్ట పోతున్నం. మా మొగుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యిండు. వద్దని ఏడుస్తుంటే నన్ను కొట్టి మందు తాగి చస్తనని సేనుకు పోయిండు. ఇద్దరు పిల్లలను వెన్కపొంటి పంపిన. వాళ్లుపోయి కాపాడిర్రు. అట్టనో, ఇట్టనోజేసి మొగుడి ప్రాణం నిలబెట్టుకున్న. వ్యవసాయం చేసేటోళ్లకు గిన్ని కష్టాలెందుకు? సర్కారు ఇచ్చేవన్నీ పట్ట భూములోళ్లకే పోతున్నయి. క్రాప్‌ ‌లోన్లు వాళ్లకే ఇస్తున్నరు. మా అసోంటి పేదళ్లను ఎవ్వరూ గుర్తుచేస్తలేరు. రేవంత్‌‌రెడ్డి సార్‌ ‌మాఅసోంటి బీదోళ్లకు దేవుడి లెక్క. మాకు సాయం చేస్తమన్నరు. అడగనీకి హక్కుంది. మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. మాకు నష్టపరిహారం ఇవ్వాలి. – చాందీబాయ్‌, ‌జమ్మడ తండా షేకాపూర్‌, 
జహీరాబాద్‌ ‌మండలం, సంగారెడ్డి జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -