రాజకీయ కోణంలో కేంద్రం అనుమతి నిరాకరణ
లండన్ నుంచి రేపు హైదరాబాద్‌కు రాక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడిందని కేంద్రం తెలిపిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన యూకేలో ఉన్నారు. అక్కడి నుంచి ఆదివారం హైదరాబాద్‌కు వస్తారు.
విధివిధానాలు, ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే, అమెరికా పర్యటనకు రాష్ట్రం కేంద్ర అనుమతిని కోరింది. తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతికి, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే ఈ పర్యటనకు “రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం” పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలనీ, బోస్టన్, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రఖ్యాత విద్యాసంస్థలను
హైదరాబాద్‌కు తేవడమే లక్ష్యం
కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. “ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తేవడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న యువత ఆకాంక్షలకు
ఇవి సమాధానంగా నిలిచేవి” అని అని రేవంత్‌రెడ్డి వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన
కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలనీ, ఆయా విశ్వవిద్యాలయాలతో అవసరమైన అన్ని అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ), భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్‌సీయూ, జేఎన్టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు.
ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి కార్పొరేషన్లు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి, 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం యూకేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించి, వాటి ప్రతినిధులతో సమావేశాలు కొనసాగిస్తారు. యూకేఈలోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో సమావేశమై, తెలంగాణతో భాగస్వామ్యాలను అధికారికంగా ఖరారు చేసేందుకు ఈ పర్యటనలో ప్రయత్నిస్తారు.
“హైదరాబాద్ ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ లేదా ఎంఐటీ, ఎల్‌బీఎస్, ఎల్‌ఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందగలగాలి. ఎందుకంటే చాలామంది నాయకులు వారి పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకుంటున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్‌కు తేవాలని భావిస్తున్నా” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతోపాటు ఇతర అధికారులు, ప్రతినిధులు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చలు జరిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి భారతదేశంతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేశారు.
నిర్దిష్ట నిబంధనలు పాటించనందుకే..: రణధీర్ జైస్వాల్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. విదేశీ పర్యటన సీఎం పదవి ఉద్దేశానికి తగినట్టుగా ఉండాలని అన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన అంశంలో ఈ నిర్దిష్ట నిబంధనలు పాటించలేదని తెలిపారు. అందుకే సీఎం అమెరికా పర్యటనకు అనుమతి రాలేదని వివరణ ఇచ్చారు.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీని సందర్శించిన రేవంత్‌రెడ్డి
ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. దాదాపు 900 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో సీఎం ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఆక్స్‌ఫర్డ్ అనుబంధ విద్యాసంస్థల్లోని నూతన సంస్థల్లో ఇది ఒకటి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని క్యాంపస్‌లో కలిశారు.
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



