జెన్ జి, బొద్దింకల తిరుగుబాటు ఇలా ఏ పేరుతో పిలిచినా విద్యార్థుల నిరసన రాజకీయ సంచల నాలకు దారి తీసిందనేది కాదనలేని నిజం. ఆ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి మోడీ సర్కారు నానా పాట్లు పడటం కనిపిస్తూనే ఉంది. రోజుకో విద్యాలయానికి వెళ్లి యువతతో సంభాషించాలని బీజేపీ-ఆరెస్సెస్ నాయకత్వం ఆదేశాలిచ్చిందంటున్నారు. అంతకంటే కూడా కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా పోస్టుల వివరాలు లెక్కలు చెప్పాలని తమ సంయోగి పోర్టల్ ద్వారా నిర్దేశించారు. మరోవైపున రాజస్థాన్‌లో స్కూలును బాగు చేయాలంటూ ఆందోళన చేసేందుకు వెళ్లిన సీజేపీ బృందంపై బీజేపీ మూకలు దాడికి దిగడం సంచలనం కలిగించింది. విద్యార్థులపై నిర్బంధాన్ని విచారించి నివేదిక నివ్వడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఇదే సమయంలో జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పెల్లెట్ ఉపయోగించిన ఘటనపై కేసు నమోదు చేసేందుకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పోలీసు స్టేషన్ ముందు నిరసన సాగించాల్సి వచ్చింది. విద్యార్థుల పోరాటం తదుపరి ఏ రూపం తీసుకుంటుందనే అంచనాలు ఒకవైపున సాగుతుండగా రైతాంగ నిరసన మరోసారి సంఘటితమవుతున్నది.
ఉద్యమాలకు సంబంధించిన ఈ కోణాలను అలా ఉంచితే ఈ సందర్భం మరో కీలకమైన అంశాన్ని ప్రపం చానికి తెలియజెప్పింది. మీడియా, సోషల్ మీడియాలు కూడా ఎంతగా సంకెళ్లలో ఉన్నాయో తేటతెల్లం చేసింది. వాటి విశ్వసనీయతా సంక్షోభాన్ని కండ్లకు కట్టింది. కొన్ని నెలల పాటు సిజెఐ సూర్యకాంత్ బొద్దింకలంటూ ఈసడించడం, దానిపై సీజేపీ పుట్టుక జరిగినప్పుడు మొదట సంచలనంగానే కథనాలిచ్చింది. కానీ, అదే సీజేపీ ఉద్యమ రూపం తీసుకుని ‘నీట్ లీజేజీ’పై నిర్దిష్ట పోరాటానికి సిద్ధమైన తర్వాత ప్రధాన మీడియా ఫోకస్ ఇవ్వడం మానేసింది. జంతర్‌మంతర్‌లో నెలల వారాల తరబడి సాగిన నిరసనను చూపించేందుకు వీరెవరూ సిద్ధం కాలేదు. ఛానళ్లలో ప్రైమ్ టైం, పత్రికలలో పతాక శీర్షికలు రాలేదు. కవరేజి కూడా ఎవరూ వెళ్లలేదని ప్రత్యక్ష సాక్షులు పరిశీలక వ్యాఖ్యాతలు చెబుతున్నారు. లొసుగులు చూపడానికి, తప్పులు మాట్లాడించడానికి ప్రయత్నాలు జరిగాయి. నిరసనకారులు చాలా అప్రమత్తంగానూ చాకచాక్యం గానూ వీటిని ఎదుర్కొని ఆందోళన తీవ్రం చేశాక పాలకులు కూడా ప్రకంపనల పాలైనాక మాత్రమే బడా మీడియా కండ్లు తెరవక తప్పలేదు. అప్పటికి అది అంతర్జాతీయ మీడియాలోనూ సంచలనమై పోయింది. బిబిసి, అల్ జజీరా, గార్డియన్ వంటివి కూడా ప్రముఖంగా కథనాలు ఇస్తుంటే అనివార్యంగా భారతీయ మీడియా రంగంలోకి రావలసి వచ్చింది.
గోడీ మీడియా అనేది అంతకుముందు అవహేళన పదంగా వుండేది. అదే అక్షర సత్యమని ఈ పరిణామాలు నిరూపించాయి. అక్కడికీ కండ్లు తెరవకపోగా రెచ్చగొట్టేలా మాట్లాడించి, తమపై దాడులు చేశారంటూ గగ్గోలు పెట్టేందుకు బడా మీడియా ప్రయత్నించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దాడులు మంచివి కావని చెబుతూనే గోడీ మీడియా ఈ నిరసన పట్ల వ్యవహ రించిన తీరు కూడా సరిగా లేదని ప్రతివారూ చెప్పకతప్పలేదు. ఒకవైపు ఉద్యమాలు పోరాటాలు సన్నగిల్లిపోయాయని గేళి చేస్తూ మరోవైపున వాటికి కనీస ప్రచారం ఇవ్వకుండా తొక్కిపట్టడం, కట్టుకళలు ప్రచారం చేయడం వీటికి వెన్నతో పెట్టిన విద్య. అనివార్యమై ప్రధానంగా కథనాలు ఇవ్వడం మొదలు పెట్టాక కూడా వెనువెంటనే అసత్య ప్రచారాలు, నిందారోపణలు, నిరసనకారులను నీచంగా చిత్రించే కుట్రలూ చూశాం. దీనికి కంగనా రనౌత్ వంటివారు కూడా గొంతు కలిపి భంగపడ్డారు. ఒకరిద్దరి కుటుంబాలపైన కూడా కథనాలతో విషం చల్లే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాలను ఒకే గొలుసుకట్టుగా చూడవలసిందే. పాలకవర్గాలు వారికి వంతపాడే శక్తులూ పోరాడే వారిపై బురదజల్లడానికి ఎంత నీచానికైనా దిగజారతారనే అనుభవం ఇక్కడా పునరావృతమైంది. తెలుగులోనూ ఇలాంటి మినీ గోడిమీడియా, లోకల్ అర్నార్ గోస్వాములు యథాశక్తి కట్టుకథలు చలామణిలో పెట్టేందుకు తంటాలు పడ్డారు. ఇది ఇంకా ముగిసిపోయిందను కోవడానికి లేదు.
కంటెంట్‌పై కత్తి
ఇక వ్యవస్థాగతంగా సర్కారు పరంగా జరిగిన పరిణామాలు ఇంతకంటే సూటిగా మన మీడియా దృశ్యాన్ని చెబుతున్నాయి. మోడీతోనే మొదలుపెడితే ఆయన విడుదల చేసిన వీడియోను ఫేస్‌బుక్ కొంతసేపు చూపించ లేదనే నోటీసుతో కథ మొదలైంది, మెటా ఫేస్‌బుక్ ఇన్‌స్టా, యూ ట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలన్నిటిని పిలిపించి మరీ విచారించారు. స్థానిక బాధ్యులు చెబితే చాలదని స్వయంగా మెటా అధినేత జుకర్‌బర్గ్‌తో క్షమాపణ చెప్పించాలన్నారు. సోషల్ మీడియాను జెన్ జి సమర్థంగా ఉపయోగిస్తున్న కారణంగా దాన్ని అడ్డుకోవడానికే ఈ నోటీసులు మందలింపుల తతంగం నడిచిందని అప్పుడే రాజ్‌దీప్ సర్దేశాయి వంటివారు సరిగానే ఊహించారు. ఒక్కక్లిక్‌తో ప్రపంచం అందుబాటులోకి వచ్చిందన్న కథలు పటాపంచలు చేస్తూ తాము చెప్పకుండా ప్రసారం చేయకూడదన్న ఆంక్షలు వచ్చేశాయి. ఈ ఉద్యమం మొదలైనాక మొత్తం లక్షా 95 వేల సార్లు ఇన్‌స్టా, మెటా ఫేస్‌బుక్ వంటివాటిని కంటెంటు తీసేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. సగటున రోజుకు 1275 తొలగింపులు జరిగాయి. తాము ఒక దశలో 19 ప్లాట్ ఫాంలకు కంటెంటు తొలగింపుపై 2312 ఉత్తర్వులిచ్చామని పార్లమెంటులో ఇచ్చిన సమాధానం, మరి ఏ విధమైన కొలబద్దలతో తొలగింపులు చేయించారని ప్రశ్నిస్తే దేశ ప్రయోజనాల రీత్యా ఇచ్చిన ఆ వివరాలు చెప్పలేమని ప్రభుత్వం సమాధానం నిరాకరించింది.
నియంత్రణకు అనుసరించిన పద్ధతులేమిటనే ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక సందర్భాలలోనే అలా చేస్తుంటారని దాటవేత జవాబిచ్చింది. అత్యున్నత శాసనవ్యవస్థ అయిన పార్లమెంటులోనే సమాధానమివ్వడానికి నిరాకరించి మరీ డిజిటల్ మీడియాను నియంత్రించినట్టు ఇక్కడే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విశేషమేమంటే నోటీసు ఇచ్చిన తర్వాత నచ్చని కంటెంటును తొలగించడానికి గతంలో మూడురోజుల గడువుంటే ఇప్పుడు మూడు గంటలలోపే తీసేయాలని తాజా నిబంధన విధించడం. నిర్దిష్ట కంటెంటును మాత్రమే గాక నిరంతరం తొలగిస్తూ ఉండవలసిన వ్యక్తులు సంస్థల పేర్లు కూడా కొన్ని ఈ ప్లాట్‌పాంలకు అందజేశారు. విదేశీ సంబంధాలు, దేశ భద్రత, రక్షణ, రాజ్యాంగ నిబంధనలు, సభ్యత సంసృతికి భంగం వంటి పలురకాల పేర్లతో కంటెంటు తొలగించమని ఆదేశించవచ్చు. అది కూడా తమ పథకాల ప్రకారమే ద్వంద్వ ప్రమాణాలు తప్ప నిజమైన ఏకసూత్రత ప్రజాస్వామ్య పద్ధతిలో జరగదు. వాస్తవానికి 79(3),69 ఎ సెక్షన్ల కింద మాత్రమే కంటెంటు తొలగింపు సాద్యపడుతుంది. కానీ, రకరకాల సాకులతో వేదింపులకు పాల్పడటం చూస్తున్నాం, కార్టూన్లు ఎఐ చిత్రాలు కూడా తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారు. వీటిపై ఆయా చిత్రకారులు జర్నలిస్టుల ప్రత్యక్ష అనుభవాలు కూడా మీడియాలో కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ ప్రధానితో మోడీ చిత్రాలు ట్రంప్‌తో ఆయన విచిత్ర స్నేహాలు, కాశ్మీర్‌లో మల్లగుల్లాలు, ఆఖరుకు విద్యార్థుల ఆందోళనపై విన్యాసాలు ఇలాంటి వాటిని వ్యంగ్యంగా చూపించే చిత్రలెన్నో వెంటపడి తీసేయించారు.
నానా వ్యూహాలు..
సామదానభేద దండోపాయాలన్నట్టు ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వాలు చతుర్మఖ వ్యూహమే అనుసరిస్తాయి. నచ్చని కంటెంటు ఇచ్చేవారిని శిక్షించడంతో పాటు నచ్చేలా చేసేవారికి విస్తారంగా ప్రోత్సహిస్తాయి. ఈ మధ్యన బీహార్ సర్కార్ లక్ష వ్యూస్ వస్తే పదివేల రూపాయలు బహుమానమిస్తామని అధికారికంగా ప్రకటించింది. తమ పథకాలకు సోగన్లు, కాన్సెప్టులు, షార్స్ట్ అవకాశాలు కల్పిస్తూ సోషల్ మీడియాను మచ్చిక చేసుకోవడం భారీ ఎత్తున సాగుతుంది. ఈ విధమైన ప్రలోభాలతో దుష్పచారాలను ముందుకు తెస్తాయి. కనీసం మధ్యేమార్గంలో ఉండేలా నడిపిస్తాయి. మొన్నమోడీ వాడిన దిమాగే నగ్జల్స్‌ను నిర్మూలిస్తామంటూ మొన్న ఎర్రకోట నుంచే ప్రసంగించడం బెదిరించడానికే, అయినా కొరకరాని కొయ్యలుగా ఉన్నవారిపై వేట కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు తాజాగా గుజరాత్‌కు చెందిన జర్నలిస్టు రవినాయర్ నివాసాలపై దాడి చేశారు. ఆయన లేకపోవడంతో ఇంట్లో దొరికిన పత్రాలు, పరికరాలు కొన్ని తీసుకున్నారు. ఆఖరుకు ఆయన స్నేహితుడి మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈయన సాదాసీదా జర్నలిస్టేమీ కాదు.
అదానీ షేర్లు పడిపోతున్న వేళ నిలబెట్టడం కోసం ఎల్‌ఐసి నిధులను ఉపయోగించి ఆయన కంపెనీలలో వాటాలు తీసుకునేలా చేశారని ఆయన ‘వాషింగ్టన్ పోస్టు’లో కథనం రాశారు. అయితే తాము మామూలు పద్ధతుల్లో కొన్నామే గానీ అదానీకి మేలు చేయడానికి కాదని ఎల్‌ఐసి వివరణిచ్చింది. ఈ లోగా అమెరికాలో అదానీపై కేసు విషయంలో రాజీ కుదిరింది. ట్రంప్ కుటుంబ సంస్థల్లో పెట్టుబడిపెట్టేందుకు అదానీ గ్రూపు అంగీకరించింది. అయినా అక్కడ కోర్టుల్లో అనేక మల్లగుల్లాలు తప్పలేదు. కానీ, ఆ కథనం రాయడమే తప్పయినట్టు రవినాయర్ ఆధారపత్రాలు స్వాధీనం చేసుకోవడానికి దాడులు జరిపారన్నమాట. గతంలోనూ పరంజయ గుహ టాగూర్ అదానీపై పరిశోధనాత్మక కథనాలు రాసినందుకు కక్షసాధింపులకు గురైన తీరు గుర్తు చేయాల్సి వుంది. వైర్, న్యూస్‌క్లిక్ వంటి వాటిపై వేట సాగింది. దేశంలో పదహారు మంది జర్నలిస్టులపై ‘ఉపా’ కేసులలో నిర్బంధం నడుస్తున్నాయి.
దాడి తీవ్రతరం?
కోర్టులు కొన్నిసార్లు జోక్యం చేసుకుని కొంత ఉపశమనం ఇచ్చినా అత్యధిక కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే న్యాయమూర్తులు కూడా పలుసార్లు సోషల్‌మీడియాపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాను భారీ ఎత్తున ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడు దానిపైనే దాడి ఎక్కుపెట్టడం యాదృచ్చికం కాదు. బీజేపీ కొత్త కార్యవర్గ నియామకంలోనూ సోషల్ మీడియా బాధ్యులను మార్చడం ద్వారా తమ భావి వ్యూహం ఎంత తీవ్రంగా ఉండబోయేది వెల్లడించారు. దీనికి దీటుగా వ్యవహరించడం ఇప్పుడు ప్రజా ఉద్యమాల ముందున్న సవాలు. పాలకులను గట్టిగా ఎదుర్కొని నిలవడమే గాక వారి కథనం (నారేటివ్)కు ప్రతిగా స్వంత కథనాలను ముందుకు తీసుకురాగలిగినందుకే విద్యార్థుల ఉద్యమం జయప్రదమైంది. ఇది అన్ని ఉద్యమాలకూ అన్ని సంస్థలకూ వర్తిస్తుంది.
తెలకపల్లి రవి



