Friday, August 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదిగజారుతున్న జీవన ప్రమాణాలు

దిగజారుతున్న జీవన ప్రమాణాలు

- Advertisement -

యుద్ధాలు, చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి తగ్గి జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016లో పెద్దనోట్ల రద్దుతో ప్రారంభమైన ఆర్థిక అస్థిరత కరోనా విలయంతో మరింత తీవ్రమైంది. అనంతరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, తాజాగా అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం చమురు, గ్యాస్ అవసరాల్లో సుమారు 85 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది. హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు సరఫరా, రవాణాపై అనిశ్చితి పెరగడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగే పరిస్థితి ఏర్పడింది.

చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్‌కే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బ ణంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 5.33 శాతానికి చేరిన పరిస్థితుల్లో కూరగాయల ధరలు కూడా అధిక స్థాయిలో కొనసాగు తున్నాయి. ఆదాయాలు పెరగకపోగా ఖర్చులు పెరగడంతో ప్రజల కొనుగోలుశక్తి తగ్గి జీవన ప్రమాణాలు దిగజారు తున్నాయి. ఇదే సమయంలో దేశంపై పెరుగుతున్న అప్పుల భారం మరో ఆందోళనకర అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2021లో వెల్లడించిన గణాంకాల ప్రకారం అప్పు రూ.138.66 లక్షల కోట్లు ఉండగా, కేవలం ఐదేళ్లలో మరో రూ.62.5 లక్షల కోట్ల అప్పు పెరిగి మొత్తం రూ.201.17 లక్షల కోట్లకు చేరిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. అంటే సగటున ప్రతి భారతీయుడి తలపై సుమారు రూ.1.36 లక్షల అప్పు భారం ఉన్నట్లవుతోంది. అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న ఈ రుణాల్లో గణనీయమైన భాగం వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తుండటంతో ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతోంది. రుణాలు తీసుకుని సంపద, ఉద్యోగాలు, ఉత్పాదక రంగాలు పెరగాల్సిన చోట అవి ప్రజల జీవితాలను మెరుగుపరచకపోతే భవిష్యత్ తరాలపై మరింత రుణభారం పడే ప్రమాదం ఉంది.
దేశ ఆర్థికాభివృద్ధి గణాంకాలు ఒకవైపు ఆశాజనకంగా చూపుతున్నప్పటికీ, సామాన్యుల వాస్తవ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడం, ఖాళీ ప్రభుత్వ పోస్టులు భర్తీ కాకపోవడం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు పెరగడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తా మన్న హామీలకు అనుగుణంగా అవకాశాలు లభించకపో వడంతో యువత నిరాశకు గురవుతోంది. ఉద్యోగాల కోసం పోరాడుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారిపై కఠిన చర్యలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. నీటి నిల్వలు తగ్గిపోవడం, సాగునీరు, తాగునీటి సమస్యలు, వర్షాలపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన పెరగడం భవిష్యత్ ఆహార భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముడి చమురు ధరల పెరుగుదల, ట్రంప్ సుంకాలు, కార్పొరేటీకరణ ప్రభావంతో అసంఘటిత కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. నిరుద్యోగం పెరుగుతుండగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

కృత్రిమ మేధ ప్రభావంతో సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా ఉద్యోగాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో వాహనాల విక్రయాలు, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో కూడా మందగమనం కనిపిస్తోంది. ఒకప్పుడు వేగంగా పెరిగిన టూ వీలర్‌ అమ్మకాల వృద్ధి రేటు 10.7 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పరిస్థితిని సూచిస్తోంది.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచడంతో పాటు ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రాయితీలు, రైతులకు గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు కల్పించాలి. విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి, ప్రభుత్వ రంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం దేశంలోని ఒక శాతం కార్పొరేట్ వర్గాల సంపద పెరగడమే దేశాభివృద్ధి కాదని పాలకులు గుర్తించాలి. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి ద్వారానే నిజమైన వికసిత భారత్ సాధ్యం తప్ప ప్రచార ఆర్భాటలతో కాదు. ప్రజల ఆదాయాలు పెరిగి, కొను గోలు శక్తి మెరుగుపడి, జీవన ప్రమా ణాలు పెరిగినప్పుడే దేశ ఆర్థికాభివృద్ధికి నిజమైన అర్థం.

ఐ.ప్రసాదరావు, 6305682533

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -