Saturday, August 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎవరిదీనేరం?

ఎవరిదీనేరం?

- Advertisement -

బాల్యం ఓ మధురమైన స్మృతి ఎవరికైనా. ఏ బాదరబందీ లేక, బాధ్యతలేక, కల్మషాలు, కుట్ర, కుతంత్రాలు ఏవీ ఎరుగని వయసుగా బాల్యాన్ని చూస్తాము. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉంటుందని అనుకుంటాం! బాల్యం అంటే ఇపుడు వయసును కూడా తిరిగి సరిచేసుకోవాలేమో! అంతలా మారిపోతున్నది తరం. పాఠశాల వయసులోనే ఘోర నేర ప్రవృత్తికి, జల్సాలు, వ్యామోహాలకు, క్రూర మనస్తత్వానికి పిల్లలు గురవుతున్నారంటే, మనం ఎలాంటి సామాజిక వాతావరణాన్ని భావితరాలకు అందిస్తున్నామో అర్థం చేసుకోవాల్సి ఉంది. ‘జెన్‌ ఆల్ఫా’ పిల్లలు, వారి అవసరాలకోసం, హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారని ఒకవైపు సంతోష పడుతున్నప్పటికీ, మరోవైపు అనేకానేక కారణాలతో బాల్య జీవితం ఎంత భయానకంగా మారుతున్నదో చూస్తే ఒళ్లు జలధరిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా పిల్లల మనస్తత్వాలు మారుతున్నాయి. కొత్తగా ఆలోచనలుండటం వేరు. క్రూరంగా ఆలోచించడం వేరు. ఇవి కొన్ని సంఘటనలుగానే చూడలేము. రేపు ఒక సామూహిక తత్వంగా మారిపోవచ్చు. మన ఇంటిలోకి వచ్చి చేరుతుంది.

మొన్న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య సంఘటన సమాజాన్ని నివ్వెరపరుస్తున్నది. అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్లాన్‌ వేసుకుని ఘోరంగా ఇరువై ఏడుసార్లు కత్తితో పొడిచి చంపివేయటం చూస్తుంటే, పిల్లల మనసు ఇంత క్రూరంగా ఎందుకు తయారయిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటేకాదు, సొంత తల్లిని ఒక బాలుడు, డబ్బుకోసం హత్య చేయడాన్ని ఆలోచించాలి. రూపారెడ్డి హత్య వెనకాల కూడా డబ్బు ప్రభావమే ఉంది. చాలా నైపుణ్యంగల నేరగాళ్ల మాదిరిగా ప్రణాళికలు రచించడం, ఆలోచించడం ఎవరినుంచి ఎలా నేర్చుకుని ఉంటారు? ఇంతటి నేరమయ ప్రపంచంలోకి భావితరం అడుగుపెడు తున్నందుకు ఎవరు కారకులు? ఇది కొండమల్లేపల్లితో ఆగదు. వాళ్లపై వేసే శిక్ష‍లతోనూ ఆగదు. ఈ వ్యవస్థ గమనం ఈ దుర్మార్గాలకు కారణమంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. పిల్లలపై తల్లిదండ్రులు, పాఠశాల, సమాజమూ అందరి ప్రభావమూ ఉంటుంది. సమాజంలో బాగా డబ్బుండి, అన్ని సౌకర్యాలు, విలాసాలు అనుభవిస్తున్న వారు, సంపాదనలేక, ఆశలు చావక బతుకులీడుస్తున్న వారూ ఉన్నారు.

ఇంకోవైపు తేలికగా డబ్బు సంపాదించి విలాసాలనుభవిస్తున్న వారూ ఉన్నారు. తేలికగా సంపాదించడం ఎలాగో నేర్పే పాఠాలూ మన చేతిలోని సెల్‌ ప్రపంచం బోధిస్తూనే ఉంది. ఎన్ని వైపరీత్యాలను సెల్‌ఫోను ప్రేరేపిస్తోందో, ఇంకా మనకు అర్థం కావడంలేదు. మనిషిలోని మృగత్వాన్ని మేలుకొలిపే కంటెంట్‌ విచ్చలవిడిగా నెట్టింట్ల నాట్యమాడుతోంది. అత్యంత జుగుప్సాకరమైన భయంకరమైన దృశ్యాలను, కథనాలను ఆసక్తిగా వీక్ష‍ిస్తున్న యువత దానికి లోనవుతున్నారు. తల్లిదండ్రుల ప్రవర్తనలూ అందుకు భిన్నంగా ఉండటం లేదు. హత్య చేసిన పిల్లలు, ఒక్కరోజులోనే తయారైన వాళ్లు కాదు. కుటుంబం, పాఠశాల, సమాజం మొత్తంగా చేసిన ఉత్పత్తి అది. నేడు కుటుంబ వ్యవస్థ త్రీవ సంక్ష‍ోభంలో కొట్టుమిట్టాడుతోంది. భార్యలు భర్తలని, భర్తలు భార్యలని చంపుకోవడం సాధారణమై పోయింది. ఆర్థికాంశాలు, భ్రమలు, వ్యామోహాల ప్రభావం పెరిగింది. అందుకు సినిమాలు, సీరియళ్లు, రీల్స్ డర్టీ కంటెంట్‌ విపరీతంగా చేతిలోకి వచ్చేసింది. హింస, విధ్వంసం, జల్సా, విచ్చలవిడి తనమే స్వేచ్ఛగా, ఆనందంగా జీవితంగా ప్రచారం జరుగుతున్నది. ఇక బడులు మార్కులే, ర్యాంకులే లక్ష్యంగా పిల్లల మెదళ్లపై ఒత్తిడి దాడిగా పరిణమించింది. చదువులో ఫస్ట్ ర్యాంక్‌ రాకపోతే ఇక జీవితమే వృథాగా చిత్రించడం పెరిగింది.

ప్రయివేటు బడులలో సరైన శిక్ష‍ణలేని ఉపాధ్యాయులు, వారికి పిల్లల మానసిక పరిస్థితుల గురించి తెలియనే తెలియదు. నిర్వాహకులకు కూడా విద్య నెరపడంపై శిక్ష‍ణేదీ లేదు. అంతేకాదు, వ్యాపారస్తులు కదా విద్యాలయాలు నడుపుతున్నది! పూర్వం బడి ఉపాధ్యాయులే కౌన్సిలర్స్‌గా విద్యార్థులను సక్రమమార్గంలో నడిపేవారు. నేడది లేదు. తప్పక ప్రతి పాఠశాలలో మానసిక శాస్త్రం తెలిసిన కౌన్సిలర్‌ అవసరం ఉంది. కొందరు కొట్టడం, కర్ర ఉపయోగించడం ద్వారా క్రమశిక్ష‍ణ సాధించవచ్చని వాదిస్తుంటారు. అది తప్పు. కొడితే, శిక్ష‍వేస్తే నేరాలు పోతాయనుకుంటే, సమాజంలో ఎప్పుడో పోయేవి. ఇక మన సినిమాలు ఎట్లాంటి వాళ్లను హీరోలుగా చూపిస్తున్నారు! రౌడీలు, గూండాలు, డాన్‌లు, పోకిరీలు నాయకులు. అంతేకాదు, మన రాజకీయ నాయకులూ అలానే తయారైపోయారు. ఇలాంటి ఘటనలు, వ్యక్తులను ఆదర్శంగా చూపిస్తున్న సమాజానిది బాధ్యత ఏమీలేదా? చిన్న చిన్న విషయాలకే ప్రతి చర్యలకు పూనుకుంటున్న పెద్దలనూ, పిల్లలనూ నేడు చూస్తున్నాము. అలాంటి మానసికతను అందిస్తున్న సమాజ పోకడను గమనించకపోతే మరిన్ని అనర్థాలూ చూడవలసి వస్తుంది. అన్నిటికీ ఆర్థిక వ్యత్యాసాలు పెరగడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సాంస్కృతిక విధ్వంసమూ కారణం. వ్యాపార సంస్కృతి విస్తరించడం మనల్ని ఈ దిశకు నెడుతోంది. బాల్యమూ దానికి బలౌతున్నది. వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావలసి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -