నవంబర్ 7 నుంచి డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్
లీగ్ వ్యవస్థాపకులు డాక్టర్ రవి అండ్రూస్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్
పికిల్‌బాల్ అత్యంత వేగంగా వృద్ది చెందుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయితో పాటు స్థానికంగా పికిల్‌బాల్ ఆడేందుకు క్రీడాకారులు, ఉద్యోగులు, వైద్యులు, బ్యూరోక్రాట్స్ మొగ్గు చూపుతున్నారు. నిత్యం పని ఒత్తిడితో గడిపే వైద్యులు తమ ఆరోగ్యం కోసం ఆటవిడుపుగా సమయం కేటాయించాలనే ఉద్దేశంతో డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ మొదలైంది. వైద్యులు తమ ఆరోగ్యాన్ని ఆటలతో మెరుగుపర్చుకోవాలనే లక్ష్యంతో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి అండ్రూస్ ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. తొలి సీజన్‌ను విజయవంతంగా ముగించుకున్న ఈ లీగ్.. ఈ ఏడాది రెండో సీజన్‌కు ముస్తాబైంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 19 వరకు గండిపేట్‌లోని క్రాస్‌కోర్ట్స్ వేదికగా డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు డాక్టర్ మునా, అనికెత్‌లు షెడ్యూల్‌ను ప్రకటించారు.
పికిల్‌బాల్ లీగ్ ఫార్మాట్
డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ రెండో సీజన్ నవంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సైతం డాక్టర్లు ఇందులో పోటీపడుతున్నారు. జట్టు తత్వంతో లీగ్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు.. వ్యక్తిగత విభాగాల్లో కాకుండా జట్టు విభాగంలో పోటీలు ఉంటాయి. తొలి దశలో ప్రతి జట్టు రౌండ్ రాబిన్ పద్దతిలో ఇతర జట్లతో తలపడతాయి. రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత లీగ్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరేందుకు రెండు అవకాశాలు ఉండగా.. 3, 4వ స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో ఆడనున్నాయి.
భారీ ప్రైజ్‌మనీ
డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ విజేతలకు భారీ నగదు బహుమానం దక్కనుంది. తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ లీగ్‌లో విజేతకు రూ.4 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుండగా, రన్నరప్ రూ. 2 లక్షల క్యాష్‌ప్రైజ్ అందుకోనుంది. ప్రొఫెషనల్ స్థాయిలో జరిగే లీగ్‌ల్లో ఇదే అత్యధిక నగదు బహమతి అని నిర్వాహకులు తెలిపారు.
వీకెండ్స్‌లో క్రీడావినోదం
ఆటలతో పాటు వినోదం సైతం ఉండేలా డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్‌ను రూపొందించారు. నవంబర్ తొలి శనివారంతో లీగ్ ఆరంభం కానుండగా, డిసెంబర్ 19తో ముగియనుంది. పని ఒత్తిడితో ఎంతో బిజీగా గడిపే వైద్యులు.. వారాంతంలో కుటుంబంతో కలిసి పికిల్‌బాల్ ఆడే విధంగా టోర్నమెంట్‌ను రూపొందించారు.
రిజిస్ర్టేషన్స్ ఆరంభం
డాక్టర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంబిబిఎస్ పట్టా పొంది, రిజస్టర్డ్ వైద్యులు మాత్రమే ఆడేందుకు అర్హులు. ప్రతి జట్టులో కనీసం ఐదుగురు ఆటగాళ్లు ఉండాలి. జట్టులో కనీసం ఓ మహిళా క్రీడాకారిణి కచ్చితంగా ఉండాలి. లీగ్‌లో పోటీపడేందుకు ఆసక్తి కలిగిన వైద్యులు అక్టోబర్ 31 లోగా తమ పేర్లను, జట్లను నమోదు చేసుకునేందుకు 9441981298 నంబర్‌ను సంప్రదించవచ్చు.
జెండర్ న్యూట్రల్ టోర్నీ!
డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్‌తో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ రవి అండ్రూస్. డబుల్స్ విభాగంలో మాత్రమే పోటీలు ఉండనుండగా.. మహిళలు మిక్స్‌డ్ డబుల్స్‌తో పాటు మెన్స్ డబుల్స్‌లోనూ పోటీపడేందుకు అవకాశం కల్పించారు. జెండర్ న్యూట్రల్ విధానంతో ఏదేని జట్లు పురుషుల డబుల్స్‌లో మహిళా అథ్లెట్‌ను సైతం బరిలోకి దింపవచ్చు.
ఆ ఆలోచనతో లీగ్‌కు పునాది
భారత్‌లో సగటు మనిషి జీవితకాలం 65-72 ఏండ్లు. కానీ, వైద్యుల సగటు జీవితకాలం 55-62 ఏండ్లు మాత్రమే. వైద్యుల జీవితకాలం తాము వైద్యం అందిస్తున్న రోగుల కంటే సుమారు పదేండ్లు తక్కువ. ఈ గణాంకాలు నాలో ఆందోళనతో పాటు ఓ ఆలోచనకు దారితీశాయి. పని భారం, ఒత్తిడితో వైద్యులు స్వీయ ఆరోగ్యం విస్మరిస్తున్నారు. వైద్యుల జీవనశైలిలో ఆటలను చేరిస్తే.. ఆరోగ్యంతో పాటు జీవితకాల సగటులో వృద్ది ఉంటుందని భావించాను. ఆ దిశగా, డాక్టర్స్ కోసం పికిల్‌బాల్ లీగ్ రూపకల్పన చేశాను. తొలి సీజన్‌లో 60 మంది వైద్యులు లీగ్‌లో పాల్గొన్నారు. ఈ సీజన్‌కు ఆ 60 మందితో పాటు మరో 20-40 మంది వైద్యులు లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచారు. దీర్ఘకాలంలో వైద్యుల జీవనశైలి, మెరుగైన ఆరోగ్యంలో పికిల్‌బాల్ సానుకూల ప్రభావం చూపిస్తుందని విశ్వసిస్తున్నాను.
డాక్టర్ రవి అండ్రూస్,
డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ వ్యవస్థాపకులు



