Sunday, August 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవలస వీసాల నిషేధం చెల్లదు

వలస వీసాల నిషేధం చెల్లదు

- Advertisement -

ట్రంప్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చిన మాన్‌హట్టన్‌ జడ్జి
75 దేశాల దరఖాస్తుదారులకు ఊరట

వాషింగ్టన్‌ : వివిధ దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు వలస వీసాల జారీని నిలిపివేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మాన్‌హట్టన్‌లోని యూఎస్‌ న్యాయమూర్తి జెన్నెత్‌ వర్గస్‌ కొట్టివేశారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో యొక్క చట్టబద్ధమైన అధికార పరిధిని ఈ విధానం అతిక్రమించిందని ఆమె తెలిపారు. ఈ విధానం ఫెడరల్‌ వలస చట్టానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పారు. వలస వీసాలపై నిర్ణయం తీసుకునేందుకు కాన్సులర్‌ అధికారులకు ఉన్న అధికారాలను విదేశాంగ కార్యదర్శి నుంచి ఫెడరల్‌ వలస చట్టం తొలగించింది. ‘దరఖాస్తుదారుడి జాతీయత ఆధారంగా వలస వీసాల జారీని కచ్చితంగా నిషేధించే ఈ విధానం చట్టబద్ధమైన పథకాన్ని నేరుగా రద్దు చేస్తోంది’ అని ఆమె తన తీర్పులో వివరించారు. న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు వలస వీసాల కోసం దరఖాస్తు చేసిన 75 దేశాల వారికి ఊరట ఇచ్చింది. కాథలిక్‌ లీగల్‌ ఇమ్మిగ్రేషన్‌ నెట్‌వర్క్‌, ఆఫ్రికన్‌ కమ్యూనిటీస్‌ టుగెదర్‌ సంస్థతో పాటు వలస వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, నిర్దేశిత దేశాల నుంచి తమ కుటుంబ సభ్యులకు స్పాన్సర్‌షిప్‌ ఇస్తున్న అమెరికా పౌరులు దాఖలు చేసుకున్న వ్యాజ్యంలో వర్గస్‌ ఈ తీర్పును వెలువరించారు.

ఈ సంవత్సరం జనవరిలో వచ్చిన ఈ విధానం కారణంగా బ్రెజిల్‌, కొలంబియా, ఉరుగ్వే వంటి లాటిన్‌ అమెరికా దేశాలు, బోస్నియా, అల్బేనియా వంటి బాల్కన్‌ దేశాలు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, కరేబియన్‌లోని అనేక దేశాల దరఖాస్తుదారులను ప్రభావితం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ తన పదవీకాలంలో వలసదారులపై తీవ్రమైన అణచివేత చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. 39 దేశాలపై జనవరి 1న అమలులోకి వచ్చిన విస్తృత ప్రయాణ నిషేధం, గత డిసెంబర్‌ చివరలో డైవర్సిటీ వీసాల జారీ నిలిపివేత వంటి చర్యల తర్వాత ప్రభుత్వం వేగవంతంగా విధించిన ఆంక్షలలో ఈ నిలుపుదల ఒకటి. ఇమ్మిగ్రేషన్‌ అణచివేత విధానం భావప్రకటనా స్వేచ్ఛను, న్యాయబద్ధమైన విచారణ హక్కులను ఉల్లంఘిస్తోందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -