యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది
విజయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోంది : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
టెహ్రాన్ : అమెరికాతో నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అమెరికా కంటే తామే బలంగా ఉన్నామని ఆయన తెలిపారు. ‘మనం ప్రస్తుతం శక్తివంతమైన, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నందున యుద్ధానికి ఇప్పుడే ముగింపు పలకడం మంచిది’ అని వైద్యులతో జరిగిన సమావేశంలో పెజెష్కియాన్ అన్నారు. నిబంధనలను అన్నింటినీ ఉల్లంఘించి పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా దానిని అందరూ ద్వేషిస్తున్నారని, అలాగే మన విజయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోందని చెప్పారు. జూన్‌లో ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఎంఓయూ ఇప్పుడు బలహీనపడుతోందని, కాబట్టి అది ఏ విధంగానూ ఇరాన్ ఓటమిని సూచించదని అన్నారు. ‘ఈ ఒప్పందంలో లంగుబాటును సూచించే ఒక్క నిబంధనను కూడా వారు కనుక్కోలేకపోయారు. ఇచ్చిన హామీలన్నీ ఎదుటి పక్షానికి సంబంధించినవే’ అని పెజెష్కియాన్ తెలిపారు.



