Sunday, August 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసురవరం..మేధావి, అత్యంత నిరాడంబరుడు

సురవరం..మేధావి, అత్యంత నిరాడంబరుడు

- Advertisement -

ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
ప్రధమ వర్థంతి సభలో వక్తల నివాళి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ ‌రెడ్డి మంచి కమ్యూనిస్టు అని, ఆయన జీవతం అందరికీ స్ఫూర్తిదాయకమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్‌ ‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ‌అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని మఖ్దూం భవన్‌‌లో సురవరం సుధాకర్‌‌రెడ్డి ప్రధమ వర్థంతి సభను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు సురవరానికి నివాళులర్పించారు. వివిధ సందర్భాల్లో పలు అంశాలపై సురవరం రాసిన వ్యాసాల సంకలనం ‘ఉద్యమాక్షరం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ “ఎంత కాలం జీవించామనేది కాదు. ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యం” అనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన సూక్తికి సుధాకర రెడ్డి జీవితం పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు. సమసమాజ స్థాపన అధికారంతో కాదనీ, కమ్యూనిస్టుల ఏకీకరణతో మాత్రమే అది సాధ్యమనే విషయాన్ని ఆయన విశ్వసించేవారని గుర్తు చేశారు. సురవరం గొప్ప ఉద్యమకారుడే కాదు.. రచయిత, వ్యాసకర్త, గొప్ప విద్యార్థి, యువజన, రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన నిరాడంబరుడిగా జీవించిన మహానేత అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కడినైనా మార్చగలిగితే ఆయన గొప్ప కమ్యూనిస్టు అవుతాడని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సురవరం సుధాకర రెడ్డి అని చెప్పారు.

అయన ఆదర్శాల ప్రభావం గ్రామీణ ప్రాంత యువతపై ఎంతో ఉందని, ఇందుకు ఉదహరణ కల్వకుర్తిలో ఓ దళిత యువకుడి గాథే నిదర్శమని వివరించారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన సురవరం ప్రస్తుతం జరుగుతున్న జెన్-జీ ఉద్యమ సమయంలో లేకపోవడం తీరని లోటని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ సురవరం జీవితాన్ని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని సీపీఐ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు భావజాలం ఒక వ్యక్తి మాటల్లో కాకుండా వారి ప్రవర్తనలో ప్రతిబింబించాలని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మానవత్వం, ప్రజా సంక్షేమం దెబ్బతింటున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మరింత నిబద్ధతతో ఉద్యమించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. బాధ్యత ఏదైనా సరే వ్యక్తిగత నిర్ణయాలకు కాకుండా సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ సురవరం సూచించేవారని గుర్తు చేశారు.

కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టులను ఏమీ చేయలేమనే విషయం ప్రధాని మోడీకి అర్థమయిందని ఎద్దేవా చేశారు. అందుకే కొత్తగా ‘దిమాగి నక్సల్స్’ అనే పదాన్ని ఆయన అందుకున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు భావజాలం భారత సమాజంలో బలంగా ఉందని, మేధోపరమైన ఉద్యమాలు, వాటి ప్రభావంతో ఏర్పడిన భావజాల పునాదులే ఉద్యమాలకు నాంది పలుకుతున్నాయని చెప్పారు. విద్యావంతులు, ప్రొఫెసర్లు, న్యాయవ్యవస్థ, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్లోనూ కొంతమందిలో కమ్యూనిస్టు భావజాలం ఉందని వ్యాఖ్యానించారు. దాని ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సురవరం స్ఫూర్తితో మేధావులు, విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను కలుపుకొని మేధో ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు.

పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ ‌కమిషన్‌ ‌చైర్మెన్‌ కె నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో దూరదృష్టి, నిబద్ధత, కార్యకర్తల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సురవరం అని గుర్తు చేశారు. అపారమైన మేధస్సు, సహనం ఆయనకుందని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులెదురైనా ఆవేశానికి లోనుకాకుండా, ఎంతో సంయమనంతో వ్యవహరించడం ఆయన ప్రత్యేకతని తెలిపారు. సురవరం సతీమణి బీవీ విజయలక్ష్మి మాట్లాడుతూ కార్మికులకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ చైర్మెన్‌‌గా పని చేసిన సురవరం… ఆ అవకాశాన్ని కార్మికుల హక్కుల రక్షణ కోసం వినియోగించారని గుర్తు చేశారు. తన అనుభవాలను ఆధారంగా చేసుకుని రాజకీయ, సామాజిక సమస్యలపై ఎప్పుడు, ఏ విధంగా స్పందించేవారే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ఏఐకెఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు, తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఈటి నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కలవేణి శంకర్, ఎం బాల నరసింహ, విఎస్ బోస్, బాగం హేమంత్ రావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -