Sunday, August 23, 2026
E-PAPER
Homeకథనీడలు

నీడలు

- Advertisement -

తన చిన్న నాటి స్నేహితురాలు సరళ అపుడపుడు వేసే ప్రశ్న గుర్తు చేసుకుని నవ్వుకుంది వనజ. ఆమెకు ఎందుకా ప్రశ్న తోస్తుంది! అన్నీ బాగుంటే అసలా ప్రశ్నే రాదు. ”ఏమైందే” అని అడిగితే
”ఏం లేదు. అందరూ బాగున్నాం” అంటుంది.
”అందరూ బాగుంటే ఇదేం ప్రశ్న?” అని నిలదీస్తే నవ్వి ఊరుకుంటుంది సరళ. ఏదో సరళలో బయటకు చెప్ప లేని బాధ. కష్టాల్లో ఉన్నపుడు జీవితం భారంగా వుంటుంది. ఆనందం గా వున్నప్పుడు రోజులు ఇట్టే గడిచి పోతాయి. సరళకు జీవితం భారంగా వున్నట్టుంది. ఏ పనీ లేకపోతే కూడా బతుకు భారమనిపిస్తుంది. తనకూ అంతే కదా! ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ నాలుగేండ్లు ఎంత భారంగా గడిచాయో!
నేను కూడా అడ్వకేట్‌ గా తనతో పాటు ప్రాక్టీస్‌ చేస్తుంటే టైం తెలియదు. జీవితం వడి వడిగా గడిచి పోతున్నట్టు అనిపిస్తుంది. కాలం ఒక ప్రవాహం. నదిలా ప్రవహిస్తూ వుంటుంది. జీవితం కూడా నదిలా నిత్యం దొర్లుతూ ప్రవహిస్తూ సాగుతుందనిపిస్తుంది తనకు! అదే మాట సరళతో అంది తాను. ఆమె ఫోన్లో అవునన్నదో కాదన్నదో అర్థం కాలేదు .
మనిషి చర్యల ద్వారా తన ఉనికిని తెలియజేస్తాడు. నదితో మనిషిని పోల్చడం సరిపోతుందా? నదికి పలువురికి మేలు చేయడమే తెలుసు. మనిషి అట్లా కాదు కదా? మరి ఈ లింకేమిటీ? ఈ భూగోళంలో ఏ నది పెద్దది.. ఏ నది చిన్నదో చెప్పొచ్చు. మరదే జీవితం గురించి చెప్పాలంటే.. చిన్న జీవితమో పెద్ద జీవితమో? ఎలా చెప్పగలం? ఎంత చెట్టుకు అంతగాలి.
”మమ్మీ…” అన్న పిలుపుతో తన ఆలోచనలు కట్టి పెట్టి ఏంటన్నట్టు చూసింది వనజ.
”ఏమైందమ్మా…” అని పదిహేనేళ్ల కూతురి వైపు చూస్తూ అడిగింది.
”ఎవరో ఫోన్‌ చేశారు.. సరళ అట. అంటూ సెల్‌ తల్లి చేతికి ఇచ్చి తన గదిలోకి వెళ్లింది. తన హోం వర్క్‌ పనిలోపడి పోయింది పాప.
చాలా ఆశ్చర్యం వేసింది. తాను సరళ గురించే ఆలోచిస్తోంది. ఆమెనే ఇపుడు ఫోన్‌ చేయడం! చాలా థ్రిల్లింగ్‌గా ఫోన్‌ తీసుకుంది వనజ.
వనజ హలో…”నేను వన….”, ”అవును తెలుసు”.
”నేను సరళ..”
అవతలి నుండి మాట.
”తెలుసు లేవే? ఏంటే ఇంత పొద్దున్నే తీరికగా పోన్‌ చేశావు” ఫోన్‌లో కబుర్లు ఎంతసేపైందో తెలియదు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. రోజూ కల్సి కష్టాలు, సుఖాలు కలబోసుకున్న వారిలా.
ఆ… ఆ సంగతి ఏమైంది? అంది సరళ..
ఆ విషయం గురించి ఒక్క ముక్కలో చెప్తే అర్థం కాదు. ఒకటి రెండు రోజులైన పడుతుంది.! అయినా ఇప్పుడా విషయం ఎందుకు.? ఇంట్లో.. ఒంట్లో అంతా బాగేనా..? సూటిగా అడిగింది వనజ.
”ఒంట్లో సంగతి ఎట్లా ఉన్నా ఇంట్లో వాళ్లు మాత్రం భేషుగ్గా ఉన్నారు.” సరళ సమాధానం.
”హైద్రాబాద్‌ ఎప్పుడొస్తావు.. అంది వనజ. ”రేపొద్దున్న అక్కడ దిగుతున్నాను. ఆ మాట చెప్పడానికే ఫోన్‌ చేసిన. ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ కు వచ్చి పికప్‌ చేసుకోవాలి” అంది సరళ. ” సరే” ఆనందంగా ఫోన్‌ పెట్టేసింది వనజ. ఎదురుగా మనిషి ఉన్నట్లుగానే భావించి తలూపుతూ.
సరళ బతుకు ఇట్లా ఎందుకైంది?
మనిషి జీవించి ఉన్నంత కాలం కష్టాలతో కుస్తీయేనా.? లోలోపల అనుకున్నది. ముఖానికి పట్టిన చెమటను చీర కొంగుతో తూడ్చుకున్నది. బ్యాగ్‌ సర్దుకుని ఆఫీసుకు బయలు దేరింది వనజ.


ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా.. అంటూ ఎఫ్‌ఎం రేడియోలో పాట పక్కింటి నుండి లీలగా విన్పిస్తూ ఉన్నది.
వనజ ఆలోచనలు తన స్కూలు జీవితం. తన చిన్న నాటి మిత్రులు. తన కుటుంబం ఇలాంటి విషయాలవైపు మళ్లింది. ఇంతలోనే శ్రీవారి నుండి హలో.. చారు అని అరుస్తున్నట్లు అడిగిన మాట.. వెంటనే తేరుకుని ఓ నిముషం తర్వాత టీ కప్పు అందించింది.
వనజ ఆమె భర్త వరుణ్‌ ఇద్దరూ లాయర్లే. పొద్దున లేచింది మొదలు ఎన్నో రకాల జీవితాలు కోర్టు మెట్ల వద్ద కన్పిస్తూ ఉంటాయి. అంతే కాదు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎందరో ఎన్నో రకాల కేసుల్లో ఇరుక్కుని కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. శిక్షలు పడి జైళ్లకు వెళ్లే వారు కొందరు. వాయిదాల కోసం తిరిగే వారు మరి కొందరు. వీళ్లందర్నీ చూసినప్పుడు జీవితం ఏమిటో అని అన్పిస్తూ ఉంటుంది వనజకు.
పక్కింట్లో ఉన్న సుమిత్రను చూసినప్పుడల్లా మనస్సు ఏదోలా అన్పిస్తూ ఉంటుంది. డిగ్రీ వరకు చదివింది. ఉద్యోగం చేయాలని తనకు ఉంటుందని, కానీ ఇల్లు, పిల్లలతో జీవితం సరిపోతుందని చాలా మార్లు తనతో వాయిపోయింది. సుమిత్ర జీవితం కూడా సరళ జీవితం లాగే బోర్‌గా ఫీలవుతుంది. ఆమె ఏ ఉద్యోగం చేయనీయకుండా వాళ్ళాయన.
తాను కాస్త పట్టుబట్టకుంటే తన జీవితం కూడా వంటింటికి పర్మినెంట్‌ అయ్యేదని మనస్సులో చాలా సార్లు అనుకున్నది.
ఓ నాలుగేళ్ల పాటు ఇంట్లోనే ఉండటం వలన జీవితం చాలా కష్టంగా, ఇంత చిన్న జీవితానికి ఇన్ని కష్టాలా? అని తనలో తాను చర్చించుకున్న సందర్భాల్లో ఎన్నో. లెక్క లేదు. లెక్క పెట్టాలనే ఆలోచనా అప్పుడు లేదు. ఇప్పుడూ లేదు.
పనిలో మునిగిపోవడంతో ఎక్కువ సేపు ఆ తరహా ఆలోచనలు ఉండవు. తెగిపోయి అతుక్కుంటున్న దారాల మాదిరిగా అవో నిత్యనిరంతర స్రవంతి లాంటివి. హాస్పిటళ్లు, కోర్టుల వద్దే ఎక్కువ జనాలుంటారా? అని కొన్ని సార్లు తనలో తానే అనుకున్నది. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పాలని కూడా అన్పించ లేదు.
ఏమిటో ఈ మనుష్యులు తనకు తాను ప్రశ్న వేసుకుంటుంది. ఎందుకీ ఆలోచన అని సమాధాన చెప్పుకుంటుంది. మొన్నా మధ్య జరిగిన ఓ కేసు గురించి సరళకు చెప్పింది వనజ. హైద్రాబాద్‌ కు వస్తున్నది. తనను కలుస్తుంది. అయినా ఆ కేసు గురించి ఎంత ఉత్సకతనో తనకు. అనుకుంటూ వాచీ వైపు చూసింది. బాగా పొద్దు పోయింది. పిల్లలు వాళ్ల గదిలో రాసుకుంటున్నారు. వరుణ్‌ ఏదో కేసు గురించిన ఫైల్‌ చాలా సీరియస్‌ గా చదువుతున్నాడు. మళ్లీ ఆలోచనల్లోకి వెళ్లింది వనజ.
తల్లిదండ్రులను గాంధీ ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లిన పిల్లలు అంటూ పత్రికలో వచ్చిన వార్త గుర్తుకు వచ్చింది. సంతానం తమను పట్టించుకోవడం లేదని ఆస్తి పాస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన దంపతులు అని మరో వార్త.
వీరి జీవితాలు ఏమిటో. పిల్లలు వారి గురించిన తాపత్రయాలు. చివరకు వీరి బతుకులు ఇట్లా అయ్యాయి. అనుకుంటూ సెల్‌ ఫోన్‌ చూస్తూ నిద్రలోకి జారుకుంది.



హలో.. సరళ.. ఇటు చూడు.. ఇటు.. నీకు కుడివైపున ఫుట్‌ పాత్‌పై ఉన్నాను. అంటున్నది వనజ.
హలో… పిల్లర్‌ నెంబర్‌ ఎంత?
ఆ…అవును అక్కడే ఉన్నాను.
‘ఇది ఎప్పుడూ ఇంతే ఒకటికి పది సార్లు చెప్తే గానికి బుర్రకు ఎక్కదు. ఇతరుల ముచ్చట్లు మాత్రం చాలా జాగ్రత్తగా వింటుంది. గుర్తు పెట్టుకుంటుంది ‘అనుకుంటూ వనజ అటూ వెళ్లింది. ఇద్దరు కల్సుకున్నారు. ఒకరినొకరు అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. కానీ కలుసుకోవడం లేదు. సరళ చేతిలోని బ్యాగ్‌ ను వనజ భుజానికి వేసుకున్నది. ఒకరి నొకరు పట్టుకుని రోడ్డు దాటి ఇతలికి వచ్చారు. అక్కడి నుండి ఆన్‌ లైన్‌లో ఆటో బుక్‌ చేసుకుని ఇంటికి చేరుకున్నారు.
పది నిముషాల్లో ఇంట్లోకి అడుగు పెట్టారు. సరూ.. నీవు స్నానం చేయి అంటూ బాత్‌ రూం వైపు నడిపించింది వనజ. వచ్చీ రావడంతోనే పరిచయ కార్యక్రమం పెట్టుకోలేదు. ఫ్రెష్‌ అయిన తర్వాత తన భర్తకు, పిల్లలకు సరళను పరిచయం చేసింది.
తన స్నేహితురాలి తాత్విక ఆలోచనల గురించీ చెప్పింది. తానూ అడ్వకేట్‌ కావాలని అనుకున్నదని, కానీ మరో వత్తిలోకి మారాల్సి వచ్చిందని చెప్పింది.
మాట్లాడుతూనే ఉంటావా. లేక పోతే ఆల్పహారాలు ఇస్తావా? ఇవ్వకపోతే ఈ అల్ప ప్రాణాలు ఎండకి అల్లాడిపోయేలా ఉన్నాయి.
ఎండ తీవ్రత గుర్తు చేస్తూ వరుణ్‌ కోటు తగిలించుకుంటూ అన్నాడు.
అందరికీ ఇడ్లీలు, వడలు వడ్డించింది వనజ.
తాను ఇవ్వాళ కోర్టుకు రాలేన చెప్పింది. వనజ.
వరుణ్‌ హడావిడిగా కేసు ఫైళ్లు పట్టుకుని కోర్టుకు వెళ్లాడు. పిల్లలు బ్యాగులేసుకుని కాలేజీ బాట పట్టారు. ఇద్దరు మిత్రులు మగిలారింట్లో. ఈ రోజు పనమ్మాయి రాను అని చెప్పింది. నేను అంట్లు తోమి వస్తానని లేచింది వనజ. ఓహో మంచిది.. ఇద్దరం కల్సి ఆ పనిచేద్దాం అని లేచింది సరళ. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే.. పాత పాటనే కొత్తగా పాడుతూ, నవ్వుతూ ఇద్దరు కిచెన్‌ వైపు వెళ్లారు.
మాటలు ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తున్నాయో అర్థం కావడం లేదు. మాట్లాడుకుంటూనే అన్నం, కూరలు సిద్దం చేశారు. అప్పడాలు, ముర్కులు చిన్న గిన్నెలోకి తీసుకున్నారు. చెరోటి నములుకుంటూ ముచ్చట్లలో మునిగారు.
ఇంతలో వనజ ఊ.. అని ఆగింది. ఏంటీ.. అని అడిగింది సరళ.
నేను ఓ ప్రశ్న వేస్తాను. దానికి సూటిగా సమాధానం చెప్పాలి అంది వనజ.
మోగుతున్న సెల్‌ వైపు చూసింది వనజ. ఏవోవే కాల్స్‌ వస్తూ ఉంటాయి ఈ పోన్లుతో పెద్ద తలనొప్పి అని పక్కన పెట్టేస్తూ.
జీవితం చిన్నదా.. పెద్దదా..? అని అడిగింది.
అది మనిషిని బట్టి. వారి వారి జీవన విదానాన్ని బట్టి. పరిస్థితులను బట్టి నిర్వచనం మారుతూ ఉంటుంది ” అని ఒక్క ముక్కలో తేల్చింది సరళ. ఇంకా ఇట్లా చెప్పింది…. కొందరి దష్టిలో జీవితం చాలా దుర్భరమైనది. మనం చదువుకుని పెళ్లిళ్లు చేసుకుని అత్తారిళ్లకు చేరుకున్నాం. మన తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారనే విషయం ఆలోచిస్తున్నామా.? జీవితపు ఉరుకుల పరుగుల్లో లైట్‌ పురుగుల్లా మారిపోతున్నాం. అంటూ తన కుటుంబం గురించీ, తన పెళ్లి సందర్భంగా ఇంట్లో జరిగిన చర్చోపచర్చల గురించీ బాధగా చెప్పింది సరళ.
ఎవరి జీవితం అయినా అంతేకదా. నేను మాత్రం దానికి భిన్నం ఏమీ కాదు. మా కుటుంబంమూ అంతేకదా. కట్నాలు, సారెలు, చీరెలు, కాన్పులు ఎన్ని ఖర్చులో కన్నవారికి. వారి జీవితాన్ని వారు నెట్టుకొస్తూ మన ఖర్చులూ భరించారు కదా? అని నిట్టూర్చింది వనజ. ఇద్దరూ ఇట్లా తమ జీవితాల గురించి వలపోసుకుంటున్నారు. కొద్ది రోజులుగా జీవితం గురించిన ఆలోచనలే నన్ను చుట్టేస్తున్నాయి అంది వనజ.
”అక్కడికే వస్తున్నా అంటూ… సరళ అందుకున్నది.
”మనం ఆనందంలో ఉన్నప్పుడు జీవితం చాలా హాయిగా తేలికగా, చిన్నదిగా కన్పిస్తుంది. ఎందుకూ? అది ఎక్కువ సేపు ఉండదు కాబట్టి. అదే కష్టాల్లో ఉంటే అయ్యో దేవుడా ఈ కష్టాలు పగ వారికి కూడా రావొద్దు అని అన్పిస్తూ ఉంటుంది. అవి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి. అప్పుడు జీవితం దుర్భరంగా, చాలా భారంగా అన్పిస్తుంది. జీవితం చాలా పెద్దదిగా తోస్తుంది అంటూ గ్లాసులో నీళ్లు నోట్లో పోసుకుని మళ్లీ చెప్పనారంభించింది సరళ.
”ఓ కేసు గురించి ఫోన్లో అడిగితే నేరుగా మాట్లాడుకుందాం అన్నావు కదా. ఆ కేసులో గెలిచిందెవరు.? అని అడిగింది సరళ.
ఐదుగురు ఆడపిల్లల తండ్రి కథ. తన ఆస్తిని సమానంగా అందరికీ పంచి ఇచ్చాడు. తనను వారే ఆదరిస్తారని భావించాడా పెద్ద మనిషి. బిడ్డలు పోటీ పడి తండ్రిని, తల్లిని వంతుల వారిగా పోషించేందుకు సిద్ద పడ్డారు. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన కోట్లాది ఆస్తిని అనుభవిస్తున్నారు. కోర్టు పెద్ద వారి పక్షాన్నే తీర్పు ఇచ్చింది అని ముక్తసరిగా చెప్పింది వనజ.
మనం మన తల్లిదండ్రులను మన వద్దే ఉంచుకుంటే బావుంటుంది కదా.? అని వెలితిని వ్యక్తం చేస్తూ అన్నది వనజ. దానికి తన వద్ద సమాధానం లేదంటున్నట్లుగా సరళ తల అడ్డంగా ఊపింది. సరళ ఏదో చెప్పబోతుండగా వనజ తాపకోసారి గోడపై ఉన్న వాచీ వైపు చూస్తోంది.
ఎందుకు అలా చూస్తున్నావని సరళ అడగ లేదు. పైగా ఈ కేసులోని హదయలోతులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేసింది. ఐదుగురు బిడ్డల జీవితంలోకి కోట్లాది రూపాయలు వచ్చాయి. అట్లాగని వారు సంతోషంగా ఉన్నారని చెప్పలేం. అదే సందర్భంలో వారి జీవితాలు మానసికంగా కష్టాల్లో ఉన్నాయని అనుకోలేం. కానీ వారి తల్లిదండ్రుల కోణంలో జీవితం అంటే దుర్భరం. అని ముగించింది సరళ.



సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చారు. స్నాక్స్‌ తీసుకుని ట్యూషన్‌ కు వెళ్లారు. పొద్దున బరువు కంటే ఇప్పుడు కాస్త తక్కువ బరువున్న బస్తాలను తీసుకెళ్లారు. ఇద్దరు మిత్రులు మళ్లీ మాటల్లో మునిగిపోయారు. చిన్నప్పటి స్కూళు విషయాలు. కాలేజీ కహానీలు. ఒకటేమిటీ అన్నీ గుర్తు చేసుకున్నారు. కాసుపు నవ్వుకున్నారు. కొందరి గురించి తల్చుకుని బాధపడ్డారు. తామిద్దరు కల్సి చూసిన సిన్మాల గురించీ మాట్లాడుకున్నారు. ఈ మద్య వచ్చిన ఓటీటీల గురించి…. నాటి-నేటి ఆడపిల్లల గురించి, ఇంటి పరిస్థితుల గురించి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. సరళ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వనజకు తెలుసు. తన శక్తి మేరకు సాయం చేస్తానని చెప్పింది. కానీ తమ బంధువులు…తమకు మరి దగ్గరి వారు కూడా తమ కష్టాలను చూసి తప్పుకు తిరుగుతున్న విషయాన్ని సరళ కన్నీళ్లతో వనజకు చెప్పింది. తమ ఉమ్మడి కుటుంబ ఆస్తి పాస్తులు, పంపకాలు, ఆ తర్వాత బంధువులు, చుట్టూ భారీ బలగం ఉన్నా తమ వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చినప్పుడు కనీసం కన్నెత్తి కూడా ఎవ్వరూ చూడ లేదని, తాను ప్రయివేటు ట్యూషన్లు చెప్తూ కుటుంబాన్న పోషించిన సందర్భాల గురించి పూస గుచ్చినట్లు చెప్పింది సరళ. అంతే కాదు తాను సినిమాలకు కథలు కూడా రాస్తున్నానని, వాటి ద్వారా కొంత డబ్బులు సంపాదిస్తున్నాననికూడా చెప్పింది. అందకే సరళకు జీవితం గురించి ఇంత తాత్వికత వచ్చిందా అని వనజ తనలో తానే అనుకున్నది. మళ్లీ ఓ సారి గోడకున్న వాచీ వైపు చూసింది.

మరు నాడు సరళను తీసుకుని సైక్రియాటిస్టు దగ్గరికి బయలు దేరింది వనజ.
”మాట్లాడుతూ మాట్లాడుతూ” మీరిద్దరూ నాలుగైదు కౌన్సిలింగ్‌ లకైనా రావాలి. మీరు అతిగా ఆలోచిస్తున్నారు. బాగా తగ్గించుకోవాలి. టూ మచ్‌ అడ్వాన్స్‌ థింకింగ్‌ లీడ్స్‌ టు నెగెటివ్‌ థింకింగ్‌! ఒక కౌన్సిలింగ్‌ కు పదిహేను వందలు. అలాగే వనజ అందుబాటులో వున్న నిడిట్షన్‌ సెంటర్‌ కు వెళ్లి అందరితో పాటు ధ్యానం చేస్తూ ఉండాలి.
వనజ ఆశ్చర్య పోయింది.. తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. తాను కూడా ట్రీట్మెంట్‌ తీసుకోవాలా?
”సరే లే” అని సెలవు తీసుకుని బయట పడ్డారు.
”మనం మానసిక రోగులమా? దేశంలో సగం మంది మానసిక రోగులే.?”
తోవలో తలుచు కొని పడీ పడీ నవ్వుతున్నారిద్దరూ!
మరుసటి రోజు ఉదయమే సరళ బయలుదేరింది.
మెట్రో దగ్గర దించి వచ్చే ముందు ఓ నాలుగు ధైర్యం మాటలు చెప్పి ఇంటి ముఖం పట్టింది వనజ.
ఒక రోజు సాంతం తమ ఇద్దరి జరిగిన సంబాషణల గురించిన ఆలోచనల్లో మునిగి తేలుతూ ఇంట్లోకి అడుగు పెడుతుండగా
”అమ్మా..” అని పెద్దామ్మాయి పిలిచింది. ”ఏంటీ అమ్మా… మురిపెంగా..” అంటూ అటు చూసింది వనజ. గోడకున్న గడియారం వైపు తన కళ్లు పోయాయి. తన స్నేహితులురాలున్నప్పుడు తనకు సమయమే తెలియలేదు.
కొన్ని సార్లు పొద్దు ఇంకా పోదా అన్పిస్తూ ఉంటుంది. మనకు ఇష్టమైన వారు తమతో ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
అయ్యో అప్పుడే టైం అయిపోందా అన్పిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే జీవితం చిన్నది అందరితో మంచిగా ఉండాలని మనస్సు చెప్తుంది. అదే బాధ అయితే గనుక ఈ సమయం గడిచి పోతే బాగుండు.. ఇంకా పొద్దు పోదేమీ అన్పిస్తుంటుంది. అందుకే జీవితం చాలా పెద్దదిగా తోస్తుంది. మరి జీవితం పెద్దదా..? లేక చిన్నదా..? ఏమో ఎవ్వరి కోణంలో వారికి అన్పిస్తూ ఉంటుంది కావొచ్చు అనుకుంటూ అమ్మాయి వంక చూస్తూ ఏమిటీ అని అడిగింది.
”అట్లా పార్క్‌కు వెళ్లొద్దామా ?” అన్నది. ఇద్దరూ అక్కడి నుండి కదిలారు.

వొద్యారపు స్వప్న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -