Sunday, August 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు

మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు

- Advertisement -

ది హిందూ మాజీ సంపాదకులు ఎన్‌.రామ్
జర్నలిజం వ్యాపారం కాదు..
సామాజిక బాధ్యత : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్‌లో లాంఛనంగా ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ప్రారంభం


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో అధికారంలో ఉన్న పాలక వర్గాలు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాయని ది హిందూ మాజీ సంపాదకులు ఎన్‌. రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ ‌క్లబ్‌‌లో దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రెస్ క్లబ్‌లు ఏర్పాటు చేసిన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ పాత్రికేయులపై నిర్బంధం, వేధింపులు ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేదా ప్రభుత్వానికో పరిమితం కాలేదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా క్రిమినల్ కేసులు, పాత్రికేయులను అరెస్టు చేసే ప్రయత్నాలు వంటి చర్యలకు పాల్పడిందని తెలిపారు. రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలతోనే పత్రికా స్వేచ్ఛ మనుగడ సాగించలేదనీ, సమర్థవంతమైన ప్రజాస్వామ్య సంస్థగా మీడియా కొనసాగడానికి ప్రజల విశ్వాసం కూడా కీలకమని పేర్కొన్నారు. మీడియా ఆర్గనైజేషన్లు, రాజకీయ ఒత్తిడి ఫ్రీ డం ఆఫ్‌‌ స్పీచ్‌‌కు, ఇండిపెండెంట్‌ ‌జర్నలిజానికి సంకేళ్లు వేస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. కొన్ని పత్రికల వల్ల మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశంలోని మేయిన్‌ ‌స్ర్టీమ్‌ ‌మీడియా కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతోందనీ, ఇది మంచి పరిణామం కాదన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు అన్ని ప్రెస్‌క్లబ్ లు ఏకతాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల నిరసనల తర్వాత 1988లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పరువు నష్టం బిల్లును బేషరతుగా ఉపసంహరించుకుందని గుర్తు చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జర్నలిజం వ్యాపారం కాదనీ, అదొక సామాజిక బాధ్యత అని అన్నారు. మనసులోని మాటను నిర్భయంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ తెలంగాణ గడ్డ స్వభావంలోనే ఉందనీ, తమ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా గౌరవిస్తుందని భట్టి స్పష్టం చేశారు. స్వేచ్ఛగా మాట్లాడండి, స్వేచ్ఛగా ప్రశ్నించండి. ఆ విమర్శలను వినే ధైర్యం అధికారంలో ఉన్న మాకు ఉందని అన్నారు. అదే సందర్భంలో స్వేచ్ఛ ఒకరి ప్రతిష్టను దెబ్బతీసే లైసెన్స్‌గా మారకూడదన్నారు. “అధికారంలో ఉన్నవారిని వదలకండి.. అదే సమయంలో మీ వృత్తి ప్రమాణాలను కూడా వదలకండి. మమ్మల్ని జవాబుదారీగా ఉంచండి. మిమ్మల్ని మీ ప్రమాణాలకు జవాబుదారీగా ఉంచుకోండి. ఈ రెండింటి ప్రయోజనం చివరికి పౌరుడికే దక్కాలి” అని పేర్కొన్నారు.​ ​సోషల్‌ ‌మీడియా పరిధి విస్తృతమైన ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికలు, జర్నలిస్టులు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు వృత్తిపరమైన రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంగీత బరువా దిషరోటీ, కారవన్ పత్రిక ఎడిటర్ అనంతనాథ్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ నుంచి గౌతమ్ లాహిరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -