Tuesday, August 25, 2026
E-PAPER
Homeఆటలుధ్రువ్‌ ధనాధన్‌

ధ్రువ్‌ ధనాధన్‌

- Advertisement -

సెంచరీతో మెరిసిన జురెల్‌
రిషబ్‌ పంత్‌ అర్థ సెంచరీ
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 503/9 డిక్లేర్డ్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 8/2

కొలంబోలో భారత్‌ ‌భారీ స్కోరు చేసింది. తొలి రోజు ఆటలో పడిక్కల్‌ (117) ‌సెంచరీ సాధించగా, రెండో రోజు ఆటలో ధ్రువ్‌ ‌జురెల్‌ (115 ‌నాటౌట్‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. రిషబ్‌ ‌పంత్‌ (63) సైతం అర్థ సెంచరీతో మెరువగా తొలి ఇన్నింగ్స్‌‌లో భారత్‌ 503/9 ‌వద్ద ఇన్నింగ్స్‌‌ను డిక్లరేషన్‌ ‌ప్రకటించింది. బౌలర్ల మ్యాజిక్‌‌తో శ్రీలంక 8/2తో ఆరంభంలోనే ఒత్తిడిలో కూరుకుంది!.
నవతెలంగాణ-కొలంబో
శ్రీలంకతో రెండో టెస్టులో టీమ్‌ ఇండియా పైచేయి కొనసాగుతుంది. వర్షం అంతరాయంతో రెండో రోజు ఆటలో పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. అయినా, భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌లో 503/9 పరుగుల భారీ స్కోరు చేసింది. ధ్రువ్‌ జురెల్‌ (115 ‌నాటౌట్‌, 177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వికెట్‌ ‌కీపర్‌ ‌బ్యాటర్‌ ‌రిషబ్‌ ‌పంత్‌ (63, 89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. జురెల్‌, పంత్‌ ‌జోరుతో రెండో రోజు ఆటలో భారత్‌ 53 ఓవర్లలో 203 పరుగులు జోడించింది.

​శతక మోత
ఓవర్‌‌నైట్‌ ‌స్కోరు 300/5తో రెండో రోజు బ్యాటింగ్‌‌కు వచ్చిన భారత్‌ ఉదయం సెషన్లో వేగంగా పరుగులు చేసింది. సరాంశు జైన్‌ ‌నిరాశపరిచినా.. ధ్రువ్‌ ‌జురెల్‌‌తో రిషబ్‌ ‌పంత్‌ ‌జట్టు కట్టాడు. మోచేతి గాయంతో రిటైర్డ్‌‌హర్ట్‌‌గా నిష్క్రమించిన పంత్‌.. మళ్లీ బ్యాట్‌ ‌పట్టాడు. జురెల్‌, పంత్‌ ‌జోడీ ఉదయం సెషన్లో మరో వికెట్ ఇవ్వలేదు. జురెల్‌ ఐదు ఫోర్లతో 97 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. పంత్‌ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌‌తో 81 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేశాడు. లంచ్ తర్వాత వరుణుడు రాకతో ఆటకు అంతరాయం ఏర్పడింది. పలుమార్లు వర్షంతో ఆటకు ఇబ్బంది ఏర్పడినా.. జురెల్‌ ‌జోరు తగ్గలేదు. పంత్‌ అవుటైనా.. ఓ ఎండ్‌‌లో టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. తొమ్మిది ఫోర్లతో 171 బంతుల్లో సెంచరీ సాధించిన ధ్రువ్‌ ‌జురెల్‌ ‌భారత్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో భారీ స్కోరు అందించాడు. 503/9 స్కోరు వద్ద కెప్టెన్‌ శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ఇన్నింగ్స్‌‌ను డిక్లరేషన్‌ ‌ప్రకటించాడు.

​వేట మొదలైంది
వర్షం కారణంతో రెండో రోజు ఆటలో పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడలేదు. టీ సెషన్‌ ఆఖర్లో తొలి ఇన్నింగ్స్‌‌లో బ్యాట్‌ ‌పట్టిన ఆతిథ్య శ్రీలంకకు మూడు ఓవర్లలోనే రెండు సార్లు షాక్‌ ‌తగిలింది. తొలి ఓవర్లో మహ్మద్‌ ‌సిరాజ్‌‌ను ఎదుర్కొన్న లంకేయులు.. ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్‌ ‌కోల్పోయారు. ఓపెనర్‌ ‌లహిరు ఉదార (1)ను మూడో స్లిప్స్‌‌లో జైస్వాల్‌ ‌మెరుపు క్యాచ్‌‌తో ప్రసిద్‌ ‌కృష్ణ అవుట్‌ ‌చేయగా.. నైట్‌‌వాచ్‌‌మన్‌ ‌ప్రభాత్‌ ‌జయసూర్య (2) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెలుతురు లేమితో మూడో ఓవర్లో పేస్‌ ‌బౌలింగ్‌‌కు అంపైర్లు నిరాకరించగా.. మానవ్‌ ‌సుతార్‌ ‌బంతి అందుకుని మాయ చేశాడు. 3 ఓవర్లలో 8 పరుగులకు శ్రీలంక 2 వికెట్లు కోల్పోయింది. నైట్‌‌వాచ్‌‌మన్‌ ‌కామిల్‌ ‌మిశార (5 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌‌లో శ్రీలంక మరో 495 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.

​స్కోరు వివరాలు :
భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (‌బి) ఫెర్నాండో 45, రాహుల్‌ (‌సి) డిక్వెలా (బి) కుమార 18, పడిక్కల్‌ (‌బి) నువాంత 117, గిల్‌ (‌సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50, పంత్‌ (‌సి) ఉదార (బి) నువాంత 63, జురెల్‌ ‌నాటౌట్‌ 115, జైన్ (సి) మిశార (బి) ఫెర్నాండో 6, సుతార్‌ (‌సి) డిక్వెలా (బి) జయసూర్య 18, సిరాజ్‌ (ఎల్బీ) జయసూర్య 3, ప్రసిద్‌ ‌కృష్ణ నాటౌట్‌ 4, ఎక్స్‌‌ట్రాలు : 21, మొత్తం : (138 ఓవర్లలో 9 వికెట్లకు) 503 డిక్డేర్డ్‌.
వికెట్ల పతనం : 1-37, 2-66, 3-186, 4-281, 5-296, 6-307, 7-419, 8-458, 9-489.
బౌలింగ్‌ : అషిత ఫెర్నాండో 29-5-106-4, లహిరు కుమార 20-4-68-1, ప్రభాత్‌ ‌జయసూర్య 42-7-132-2, కేశర నువాంత 38-3-154, 2, సోనల్‌ ‌దినుశ 3-0-8-0, ధనంజయ డిసిల్వ 2-0-8-0, కామిల్‌ ‌మిశార 4-0-16-0.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ : లహిరు ఉదార (సి) జైస్వాల్‌ (‌బి) ప్రసిద్‌ 1, కామిల్‌ ‌మిశార నాటౌట్‌ 5, ప్రభాత్‌ ‌జయసూర్య (ఎల్బీ) సుతార్ 2, మొత్తం : (3 ఓవర్లలో 2 వికెట్లకు) 8.
వికెట్ల పతనం : 1-1, 2-8.
బౌలింగ్‌ : మహ్మద్‌ ‌సిరాజ్‌ 1-0-1-0, ప్రసిద్‌ ‌కృష్ణ 1-0-1-1, మానవ్‌ సుతార్‌ 1-0-6-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -