– ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు హెచ్. బసవయ్య డిమాండ్
– డిపో కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల నిరాహార దీక్ష
నవతెలంగాణ-సత్తుపల్లి
ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిన హామీలను తక్షణమే అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యూ ఎఫ్) రాష్ట్ర నాయకులు హెచ్. బసవయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన పనిభారాన్ని తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట డిపో కమిటీ కార్యదర్శి దొరబాబు అధ్యక్షతన ఆర్టీసీ కార్మికులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్. బసవయ్య ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులను 80 శాతం పెంచి ఇవ్వాలని, 2021 పే-స్కేల్ బకాయిలపై స్పష్టతనిచ్చి చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన కార్మికులకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ స్పష్టమైన రెగ్యులేషన్ తీసుకురావాలన్నారు. ఆర్టీసీలో పెంచిన పనిభారాన్ని తగ్గించాలని, రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షకు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా నాయకులు పూర్తి సంఘీభావం తెలిపారు.
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు మోరంపూడి పాండురంగారావు, రావుల రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మేరుగు సత్యనారాయణ, జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రసంగించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఎంతో న్యాయమైనవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ కమిటీతో అంగీకరించిన అంశాలపై తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం అలసత్వం వహిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లూరు చంద్రశేఖర్, ఐద్వా డివిజన్ అధ్యక్షురాలు చెరుకు రత్నకుమారి, పుష్పవల్లి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ దొరబాబు, రీజియన్ సహ కార్యదర్శి కృష్ణారెడ్డి, డిపో కమిటీ అధ్యక్షులు ఎస్.వి. రావు, ఎన్. జాకబ్, జగన్నాథం, కృష్ణవేణి, మంజురాణి, ధనలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.



