Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల భూములను బంధిస్తే ఊరుకోం

ప్రజల భూములను బంధిస్తే ఊరుకోం

- Advertisement -

22ఏ నుంచి భూములను వెంటనే తొలగించాలి
​సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడిస్తాం
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
బాధితులకు అండగా ఉంటాం
: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్‌‌లో 22-ఏపై ప్రత్యేక సమావేశం
నవతెలంగాణ-దుండిగల్/ కుత్బుల్లాపూర్

​ప్రజల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చి బంధిస్తే ఊరుకునేది లేదని, సెప్టెంబర్‌ 7‌న అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌‌రావు అన్నారు. హైదరాబాద్‌ కుత్బులాపూర్‌ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను జాబితా నుంచి తొలగించాలని ‌డిమాండ్‌ ‌చేశారు. షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ 22-ఏ బాధితుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 22-ఏ కేవలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్య కాదని, వేలాది మంది భూ యజమానుల భవిష్యత్‌కు సంబంధించిన అంశమని అన్నారు. భూములను విక్రయించలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక భూ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22-ఏ అంటే కేవలం ఒక నంబర్ కాదని.. ఒక కుటుంబం భవిష్యత్‌పై పడే తాళం అని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూభారతి సాక్షిగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, 2023 డిసెంబర్ నుంచి 22-ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు బహిర్గతం చేయాలని కోరారు. ప్రభుత్వం 22-ఏ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 7వ తేదీలోగా సమస్యను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని, అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల తరఫున పోరాడుతారని, బయట బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని కొనసాగిస్తాయని తెలిపారు.
​ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. 22-ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -