22ఏ నుంచి భూములను వెంటనే తొలగించాలి
సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడిస్తాం
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
బాధితులకు అండగా ఉంటాం
: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్‌లో 22-ఏపై ప్రత్యేక సమావేశం
నవతెలంగాణ-దుండిగల్/ కుత్బుల్లాపూర్
ప్రజల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చి బంధిస్తే ఊరుకునేది లేదని, సెప్టెంబర్ 7న అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ కుత్బులాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ 22-ఏ బాధితుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 22-ఏ కేవలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్య కాదని, వేలాది మంది భూ యజమానుల భవిష్యత్‌కు సంబంధించిన అంశమని అన్నారు. భూములను విక్రయించలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక భూ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22-ఏ అంటే కేవలం ఒక నంబర్ కాదని.. ఒక కుటుంబం భవిష్యత్‌పై పడే తాళం అని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూభారతి సాక్షిగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, 2023 డిసెంబర్ నుంచి 22-ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు బహిర్గతం చేయాలని కోరారు. ప్రభుత్వం 22-ఏ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 7వ తేదీలోగా సమస్యను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని, అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల తరఫున పోరాడుతారని, బయట బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని కొనసాగిస్తాయని తెలిపారు.
ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. 22-ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల భూములను బంధిస్తే ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



