Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి వలస కార్మికుడికి ఐడీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం దిశగా ముందడుగు

ప్రతి వలస కార్మికుడికి ఐడీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం దిశగా ముందడుగు

- Advertisement -

తెలంగాణ ఎన్‌ఆ‌ర్‌ఐ అడ్వైజరీ 
కమిటీ టూర్ పూర్తి
ఫిలిపీన్స్‌లో అమలవుతున్న 
విధానాలపై అధ్యయనం
ప్రభుత్వానికి రెండువారాల్లో నివేదిక
సమగ్ర చట్టం రూపొందించేందుకు అసెంబ్లీలో చర్చించే అవకాశం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి

పంటలసాగులో ఆటుపోట్లతో అప్ప్పుల పాలవుతున్న రైతులు, ఉన్న ఊర్లో సరైన ఉపాధి లేక కుటుంబ పోషణకు సైతం అప్ప్పులు చేసే పరిస్థితి. అప్ప్పులు తీర్చే మార్గం లేక కన్న తల్లిదండ్రులను, భార్యాపిల్లలను విడిచి ఎడారి దేశానికి పొట్టచేతపట్టుకొని వలసవెళ్లే దుస్థితి. ఎంతో శ్రమకోడ్చి అక్కడివరకు వెళ్లినా ఏజెంట్‌ల మోసాలు, పనిప్రదేశంలో ఇబ్బందులు, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి గల్ఫ్ కార్మికులు చనిపోతే వారిని ఆదుకునే దిక్కు లేదు. ఆఖరికి మృతదేహం కోసం పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు ఎదురుచూసే ధైన్యం. ఇలాంటి ఘటనలు ఉత్తర తెలంగాణతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో కోకొల్లలు. ఇక్కడి నుంచి వలసలు ఉన్నా.. వారి సంక్షేమం కోసం సమగ్ర పాలసీ లేకపోవడంతో వారి గోడు ఎడారి వేధనే అవుతోంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ‘తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ’ ని నియమించగా.. కమిటీ ప్రతినిధులు ఈ నెల 17-21వ తేదీ వరకు ఫిలిపీన్స్ దేశంలో పర్యటించి అక్కడ అమలవుతున్న వలస కార్మికుల విధానాలపై స్టడీ చేశారు. ప్రభుత్వానికి రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయనుండగా.. అసెంబ్లీలో చర్చించి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చట్టం చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది వివిధ గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గల్ఫ్‌లో ఎవరైనా కార్మికులు చనిపోతే.. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తోంది. దేశంలో ఇలాంటి పథకం లేనట్టు సమాచారం. అయితే దీంతో పాటు ఉపాధి నిమిత్తం వెళ్లే వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించడంతో పాటు ఆయా దేశాల్లో అమలవుతున్న కార్మిక చట్టాలు, వీరు ఎంచుకున్న రంగంలో గల నైపుణ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోనుంది.

​ఫిలిపీన్స్ విధానాలపై అధ్యయనం
దీంట్లో భాగంగా మాజీ ఐఎఫ్‌ఎస్ ఎం.వినోద్‌కుమార్ చైర్మెన్‌గా, మందా బీమారెడ్డి వైస్ చైర్మెన్‌గా, వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతిరెడ్డితో పాటు గల్ఫ్ కార్మికుల, ఇమ్మిగ్రేషన్ తదితర రంగాల నుంచి మొత్తం పది మంది సభ్యులతో కలిసి తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీని ‌రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఫిలిపీన్స్‌కు వెళ్లి అక్కడి విధానాలు అధ్యయనం చేసింది. ఆ దేశం జనాభా సుమారు 11 కోట్లు ఉంటే.. దాదాపు 2 కోట్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉపాధి నిమిత్తం ఉంటున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆ దేశం 1995లో ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చింది. ప్రధానంగా వివిధ దేశాల్లో ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రత్యేక అక్రిడేషన్ ఇచ్చి రిజిస్టర్ ఏజెన్సీల ద్వారా ఫిలిపీన్స్.. తమ దేశస్తులను పంపిస్తుంది. ఇందుకోసం కార్మికులకు స్కిల్, సెమిస్కిల్‌పై ట్రైనింగ్ ఇచ్చి, ఆయా దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలపై ముందస్తు అవగాహన కల్పించి పంపిస్తుంది. వలస వెళ్లే ప్రతి కార్మికుడికో గుర్తింపు నెంబర్ కేటాయించి వారి వివరాలు ఎప్పటికప్ప్పుడు ఆరా తీస్తూ ఉంటున్నారు. పని ప్రదేశాల్లో వేతనాలతో పాటు అనారోగ్యం, ప్రమాదాలు, ఇతరాత్ర ఏ సమస్యలున్నా.. వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆర్గనైజేషన్‌ల ద్వారా చొరవ తీసుకుంటుంది. దీంతో పాటు మధ్యలో తిరిగి వచ్చేసే వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు సైతం.. ప్రత్యేన నిధులు కేటాయించి వారిని ఆదుకుంటుంది. ఈ విధానాలు సమగ్రంగా అమలవుతుండటంతో చిన్నదేశమైనా గల్ఫ్ కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.

ఫిలిపీన్స్ మోడల్ బాగుంది
​ఫిలిపీన్స్ నుంచి వలస వెళ్తున్న అన్ని దేశాల్లో ప్రత్యేక కార్యాలయాలు కార్మికుల కోసం పని చేస్తున్నాయి. వారి సాధకబాధకాల్లో పాలుపంచుకుంటుంది. వారి మోడల్ బాగుంది. వాటిని ఇక్కడ సైతం అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి రెండువారాల్లో అందజేయనున్నాం. అసెంబ్లీలో చర్చించి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురానున్నాం. దీంట్లో కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్, ట్రాన్స్‌పోర్ట్, పనికాలం, ఇతరాత్ర అగ్రిమెంట్ చేసుకోవడంలో ప్రభుత్వం భాగస్వామిగా ఉండనుంది.
డా. ఆర్ భూపతిరెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. కమిటీ మెంబర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -