100 మందికి పైగా మృతి..750 మంది గల్లంతు
వీరిలో 105 మంది భారతీయులు
ఉత్తర నేపాల్‌లో ఉగ్రరూపం దాల్చిన భోటేకోశీ నది
వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులు ధ్వంసం
సహాయక చర్యలు ముమ్మరం
ఖాట్మండ్ : నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ సరిహద్దుల్లో ఉద్భవించిన ఈ మెరుపు వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకు 95 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాల్లో వరద తీవ్రతకు వంతెనలు, రహదారులు, డజనుకు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. బాధితుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది.బుధవారం ఉదయం 9 గంటల సమయంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోశీ నదికి ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. టిబెట్-రసువాగఢి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడటంతోనే ఈ విపత్తు సంభవించినట్టు ప్రాథమిక నివేదికలు, శాటిలైట్ చిత్రాల ద్వారా అధికారులు గుర్తించారు. లెంధే
నది ఉప్పొంగి ఆ వరద నీరు భోటేకోశీ మీదుగా త్రిశూలి నదిలోకి ప్రవేశించడంతో రసువా, ధాడింగ్, నువాకోట్, చిత్వాన్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో కలిపి మొత్తం 31 మంది మరణించినట్టు నేపాల్ అధికారులు ధ్రువీకరించారు.
750 మంది గల్లంతు
ఈ ఆకస్మిక వరదల్లో సుమారు 750 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అందులో వంద మందికి పైగా భారతీయులు, ఎన్నారైలు ఉన్నారు. తెలుగువారు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. గల్లంతైన భారతీయుల్లో కనీసం 59 మంది కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్తున్న వారని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. అలాగే 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 80 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు
వరద ఉధృతికి 42 కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో పాటు, 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ సైన్యం 12 హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు 80 మందిని రక్షించింది. నదికి అడ్డుపడిన ప్రదేశంలో నీరు ఇంకా పూర్తిగా బయటకు వెళ్లకపోవడంతో భోటేకోశీ, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
స్తంభించిన రాకపోకలు
భారీ వరద ప్రవాహంలో అనేక వాహనాలు, స్థానిక కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విలువైన సరుకులు కొట్టుకుపోయాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు రసువా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వరద ధాటికి నేపాల్ విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఆరు ప్రధాన విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. నేపాల్‌లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. పలు కీలక రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
అత్యవసర సమావేశం
విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మెడికల్ బృందాలు, స్కౌట్స్, రెడ్‌క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయం కోసం నేపాల్ పర్యాటక బోర్డు టోల్ ఫ్రీ నంబర్ 1234 లేదా హాట్‌లైన్ 1144 లేదా పర్యటక పోలీసుల నంబర్ 9851289445ను కూడా జారీ చేసింది.
భారత్ హెల్ప్‌లైన్
నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా +977 985 131 6807, +977 970 910 7500 హెల్ప్‌లైన్ నంబర్లును జారీ చేసింది. మరోవైపు నేపాల్‌కు సరిహద్దులో ఉన్న బీహార్, యూపీలకు కేంద్రం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది. బీహార్ సీఎం సమ్రాట్ చౌధరీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.



