తెలంగాణ నీటి హక్కులను కేంద్రం కాపాడాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏపీవైపు నిండుగా పారుతున్న నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. కేఆర్ఎంబీ అంటే, త్రిసభ్య కమిటీ అంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. చాతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న సాగర్ డ్యామ్ నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీవైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడం దౌర్జన్యం కాదా?అని ప్రశ్నించారు. ఏపీ 47 టీఎంసీల నీటిని కోరిందనీ, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశమే వాయిదా పడిందని తెలిపారు. నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా, త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే ధైర్యం ఏపీకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు. నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని వివరించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికే రెండేండ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక తెలంగాణ నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీటి వినియోగం చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటినీ కాపాడాలనీ, ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత లేదా?అని ప్రశ్నించారు. ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ నీటి హక్కులను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు.
సాగర్ నీళ్లపై ఏపీ అధికారుల దౌర్జన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



