ఉపాధ్యాయుల కొరతతో
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
పదోన్నతుల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీకి టీజీఎస్డబ్ల్యూ ఆర్ఈటీఎల్ఏ, తిర్ లెప్ట వినతి
సమస్యలు పరిష్కరించకపోతే
ఉద్యమిస్తామని వార్నింగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఖాళీ పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల సంఘం, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లెక్చరర్స్, ఎంప్లాయీస్, ప్రిన్సిపాల్స్ , టీచర్స్ అసోసియేషన్ (తిర్ లెఫ్ట) డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఇరు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆవుల సైదులు, డాక్టర్ పి.సుధాకర్ లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓఎస్డీ విజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఒక్కో సమస్యను ఓఎస్డీకి వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల మనోభావాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటించి సంస్థ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సమావేశమయ్యేలా కృషి చేస్తానని కూడా హమీ ఇచ్చినట్టు వెల్లడించారు. అనంతరం ఆ సంఘాల నాయకులు సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయికి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్, ఏక రూప స్టాపింగ్ ప్యాట్రన్, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్ఓ లు, సుమారు 150 ప్రిన్సిపల్ పోస్టులను, జూనియర్ లెక్చరర్స్ పోస్ట్ లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులతో పాటు అన్ని క్యాడర్ల పోస్టులను అర్హత కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, పెండింగ్ డీఏ ఏరియర్స్ విడుదల, అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ట్, క్రాఫ్ట్ , మ్యూజిక్, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాస్ ప్రమోషన్స్, సీఓఈ ల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ను నియామకం తదితర విషయాలపై చర్చించినట్టు వారు వెల్లడించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ సహాయ కార్యదర్శి కె.నాగరాజు, తిర్ లెప్ట సహాయ కార్యదర్శి డి.నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎస్సీ గురుకులాల్లో అటకెక్కిన పదోన్నతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



