యువతను మత్తు పదార్థాలకు
దూరంగా ఉంచేందుకు కృషి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
ఎం.అరవింద్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణలో ‘మిస్టర్ తెలంగాణ’ బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని టీడీపీ సిటీ కార్యాలయంలో బుధవారం బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్ తో కలిసి ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 6న టీడీపీ తెలంగాణ సిటీ కార్యాలయంలో ‘ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ జూనియర్స్ అండ్ ఓపెన్ – మిస్టర్ తెలంగాణ 2026’ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 2026 తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఎన్టీఆర్ పేరిట, అలాగే నారా చంద్రబాబు నాయుడు మెన్స్ ఫిజిక్ ఓపెన్ చాంపియన్‌షిప్ పేరిట బహుమతులు, నగదు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన సందర్భంగా, పాఠశాల విద్యార్థుల వరకు కూడా చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మత్తు పదార్థాలు అమ్ముతున్నారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పినట్టు గుర్తు చేశారు. దీనిపై సమగ్ర నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని తాము డీజీపీని కోరినట్టు తెలిపారు. మత్తు పదార్థాలు లభించిన పాఠశాలల లైసెన్స్‌లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసిందన్నారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకే బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జంటనగరాల్లో యువత పెడదారి పట్టకుండా, వారి దృష్టిని ఫిజిక్, దేహదారుఢ్యంపై కేంద్రీకరించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహి స్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ తెలంగాణ నాయకు లందరినీ ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, భవాని శ్రీనివాస్, వైఎల్.నర్సింహా గౌడ్ పాల్గొన్నారు.
6న ‘మిస్టర్ తెలంగాణ’ బాడీ బిల్డింగ్ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



