ఎఫ్‌ఐఆర్‌లో గందరగోళం
ఎక్సైజ్ శాఖలో కలకలం..
సీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్
జిల్లా స్థాయి అధికారిపై చర్యలు
ఎస్పీ కార్యాలయానికి అటాచ్?
నవతెలంగాణ-భద్రాచలం
గంజాయి కేసులో పట్టుబడిన రిమాండ్ ఖైదీ పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎక్సైజ్ శాఖలో కలకలం రేపింది. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. పంచనామా తదితర ప్రక్రియ అనంతరం వారిని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాల్సి ఉంది. అయితే వారిని స్టేషన్‌లోనే ఉంచినట్టు తెలిసింది. ఇద్దరికి ఒక కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేసినప్పటికీ భద్రతా ఏర్పాట్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఓ నిందితుడు సిబ్బంది కళ్లుగప్పి పరారైనట్టు సమాచారం.
ఎఫ్‌ఐఆర్ కాపీపై అనుమానాలు
నిందితుడు పరారైన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నిందితులను స్టేషన్‌లో ఉంచిన విధానం, ఎస్కార్ట్ సిబ్బంది వ్యవహరించిన తీరు, ఘటన అనంతరం నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో కేసు రికార్డులు, ఎఫ్‌ఐఆర్ కాపీ విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించాల్సి ఉండగా.. రికార్డుల్లో ఒకరిని మాత్రమే చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సంతకాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై శాఖాపరమైన విచారణ పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
సీఐ, కానిస్టేబుల్‌పై వేటు
విచారణలో సీఐ స్థాయి అధికారిపై బాధ్యత ఉందని, ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో సీఐ మునిసా బేగం, కానిస్టేబుల్ రవికుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్య ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వ్యవహారంలో సీఐకి సహకరించినట్టు భావిస్తున్న జిల్లా స్థాయి అధికారిపైనా చర్యలు తీసుకొని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో గతంలో పనిచేసిన జానయ్యకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి ఈఎస్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
రిమాండ్ ఖైదీ పరార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



