Thursday, August 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సామాన్యుడిపై 'ఎల్‌నినో' దెబ్బ

సామాన్యుడిపై ‘ఎల్‌నినో’ దెబ్బ

- Advertisement -

వర్షాభావంతో పడిపోయిన వరి సాగు
ఆకాశాన్నంటిన బియ్యం ధరలు
‘ఇథనాల్‌’తో చేదెక్కిన చక్కెర
మార్కెట్లో సన్న బియ్యం కృత్రిమ కొరత
కేంద్రం ‘ఈ-20’ ఇథనాల్‌ తో చెరుకు పక్కదారి.. చేదెక్కిన ‘చక్కెర’
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలపై నెలకు రూ.168.23 కోట్ల పెనుభారం!
మరోవైపు విచ్చలవిడిగా కల్తీ సామ్రాజ్యం
నిద్రమత్తులో ధరల 
నియంత్రణ కమిటీ!
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

​ఒకవైపు ప్రకృతి ‘ఎల్‌నినో’ సృష్టించిన వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఇంధన రంగంలో మార్పుల పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఈ-20 ఇథనాల్‌’ విధానం నిత్యావసర మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడక వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గి బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి.. పెట్రోల్‌ మిశ్రమం కోసం చెరుకును ఇథనాల్‌ తయారీకి భారీగా మళ్లించడంతో చక్కెర ధర ఊహించని రీతిలో పెరిగిపోయింది. ఈ రెండింటికి తోడు వ్యాపారుల సిండికేట్‌, కృత్రిమ కొరత మాయాజాలం తోడవడంతో సగటు మానవుడి వంటిల్లు భగ్గుమంటోంది. ఉదయం తాగే కప్పు టీ నుంచి రాత్రి తినే అన్నం వరకు ప్రతి దానిపైనా ధరల భారం పడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 11.21 లక్షలకు పైగా కుటుంబాలపై నెలకు ఏకంగా రూ.168.23 కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. ఓ వైపు ధరల మంట సామాన్యుడిని కుంగదీస్తుంటే, ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు విజృంభిస్తూ నకిలీ సామ్రాజ్యాన్ని ఏలుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

​సన్న బువ్వకు ‘ఎల్‌నినో’ గండి.. ఇథనాల్‌ దిశగా బియ్యం!
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాధారణంగా 12 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా, నీళ్లు లేక ఇప్పటివరకు కేవలం 7 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాగు గణనీయంగా తగ్గడం, దిగుబడి తగ్గుతుందన్న అంచనాలను వ్యాపారులు ముందే క్యాష్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. జులై నుంచి హెచ్‌ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌), జై శ్రీరామ్‌ వంటి సన్న బియ్యం ధరలు క్వింటాలుపై రూ.800 నుంచి రూ.1,200 వరకు పెరిగాయి. హోల్‌సేల్‌లో క్వింటాలు సన్న బియ్యం రూ.5,400 నుంచి రూ.7,000 పైగా పలుకుతుండగా, రిటైల్‌ మార్కెట్‌లో కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు పెరిగి రూ.55 నుంచి రూ.75 మధ్య విక్రయిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఒక్క ఎఫ్‌సీఐ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 6.35 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని తక్కువ ధరకు ఇథనాల్‌ డిస్టిలరీలకు విక్రయించడంతో ఓపెన్‌ మార్కెట్‌లో బియ్యం కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

​’ఈ-20′ ఇథనాల్‌ దెబ్బ.. చేదెక్కిన చక్కెర ధర!
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (ఈ-20) కలపాలనే నిబంధనను తీసుకురావడంతో, చక్కెర ఉత్పత్తికి ఉపయోగించాల్సిన చెరుకు రసాన్ని భారీగా ఇథనాల్‌ డిస్టిలరీలకు మళ్లిస్తున్నారు. దీనికి తోడు రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టించారు. ఉమ్మడి జిల్లాలో సగటున 210 మెట్రిక్‌‌ టన్నుల చక్కెర విక్రయాలు జరుగుతున్నాయనేది ఒక అంచనా. వారం కిందట 50 కిలోల హోల్‌సేల్‌ చక్కెర బస్తా ధర రూ.2,100 ఉండగా, ప్రస్తుతం అది రూ.3,250కి ఎగబాకింది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో చక్కెర రూ.45 నుంచి ఏకంగా రూ.66 – రూ.70కి చేరింది. దీనిపై నిఘా కరువైంది. ఫలితంగా హోటళ్లలో రూ.10కి లభించే కప్పు టీ ధర రూ.15-18కు పెరిగింది.

​ఉమ్మడి కరీంనగర్‌పై రూ.168.23 లక్షల పెనుభారం!
సమగ్ర సర్వే లెక్కల ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా (కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి) పరిధిలో 11,21,540 నివాస గృహాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంపైనా నెలకు సగటున రూ.1,500 చొప్పున భారం వేసినా, ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు రూ.168.23 లక్షల అదనపు భారం పడుతోంది. 2011 జనాభా ప్రకారం 37.76 లక్షల మంది ఉండగా, ప్రస్తుతం లెక్కల్లో 33.26 లక్షల మంది నమోదయ్యారు. ఇష్టారాజ్యంగా పెరిగిన ధరలను అదుపు చేయాల్సిన ‘ధరల నియంత్రణ కమిటీ’ కనీసం సమీక్షలు కూడా నిర్వహించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

​ధరల మంట కొలిమిలో ‘కల్తీ’ మహమ్మారి!
ధరల భారాన్ని తట్టుకోలేక సగటు మనిషి సతమతమవుతుంటే, నిత్యావసరాల వ్యాపారంలో కల్తీ రాయుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రెండు నెలల కాలంలో వెలుగుజూసిన ఘటనలే ఇందుకు అద్దంపడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా రామడుగులోని మేఘా ఇండస్ర్టీస్‌పై దాడి చేసిన అధికారులు జంతువుల పొట్టు, తవుడు కలిపి తయారు చేస్తున్న 750 కిలోల నకిలీ సోయా చంక్స్‌ను సీజ్‌ చేశారు. కరీంనగర్‌ మార్కెట్లలో భారీగా నకిలీ పసుపు, కారం, ధనియాల పొడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 లీటర్ల వేడి నీళ్లలో రెండు మాత్రలు వేసి కేవలం అరగంటలో ‘గడ్డ పెరుగు’ పేరిట హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠానూ పట్టుకున్నారు. కరీంనగర్‌ డెయిరీ అవుట్‌లెట్‌లో గడువు తీరిన 600 ఐస్‌క్రీమ్‌ ప్యాకెట్లను సీజ్‌ చేయగా, ప్రముఖ స్వీట్‌ షాపుల్లో రసాయన రంగులు వాడిన నిల్వ స్వీట్లను అధికారులు ధ్వంసం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -