ఈ పన్నెండేండ్లలో భారత్‌ది వెనుకబాటే!
తలసరి ఆదాయంలో వెయ్యి డాలర్ల లోటు
భావ వ్యక్తీకరణ,మతస్వేచ్ఛలోనూ భారీ క్షీణత
‘మోడీ పాలన’ లేకుంటే దేశం మరింత సంపన్నం ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ మెరుగ్గా ఉండేవి
అమెరికా పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు
న్యూఢిల్లీ : మోడీ పాలనను కేవలం గత ప్రభుత్వాలతో పోల్చడం కాదు.. ‘మోడీ లేకపోతే భారత్ ఎలా ఉండేది?’ అన్న ప్రశ్నకు సమాధానం వెతికిన అధ్యయనం ఇది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీకి చెందిన కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ రూపొందించిన ‘వాగ్దానాలు : మోడీ, బీజేపీ పాలనలో గవర్నెన్స్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా’ అనే పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలను వివరించారు. 2014కు ముందు భారత పరిస్థితులకు దగ్గరగా ఉండే దేశాల సమ్మిళిత నమూ నాను రూపొందించారు. ‘సింథటిక్ ఇండియా’తో 2014-2023 మధ్య వాస్తవ భారత్ పనితీరును పోల్చారు. ఫలితం మాత్రం మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టింది.
పదేండ్ల పాలన.. పది సూచీల్లో క్షీణత
అధ్యయనం ప్రకారం… రాజకీయ అవినీతి, ప్రజాస్వామ్యం, ఉదార ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సంఘటితమయ్యే స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం, చట్టపరమైన సమాన రక్షణ, కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయపరమైన నియంత్రణలు, శాసన వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై నియంత్రణలు వంటి మొత్తం పది పాలనాపరమైన సూచీల్లో భారత్ పనితీరు గణనీయంగా దిగజారింది. ముఖ్యంగా మత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఉదార ప్రజాస్వామ్యం, చట్టం ముందు సమానత్వం వంటి అంశాల్లో క్షీణత గణనీయంగా కనిపించిందని నివేదిక పేర్కొంది.
అవినీతిపై పోరాటం ఎక్కడీ
2014 ఎన్నికల సమయంలో అవినీతిని ప్రధాన రాజకీయ అంశంగా మలుచుకున్న బీజేపీ.. అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ అధ్యయనం మాత్రం మోడీ పాలనలో రాజకీయ అవినీతి సూచీ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొంది. అంటే అవినీతిని నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. దానిని సాధించలేకపోయింది.
ఆర్థిక వ్యవస్థకు తీవ్ర దెబ్బ
దేశ ఆర్థిక రంగంలోనూ అధ్యయనం ఆసక్తికరమైన అంచనాను ముందుకు తెచ్చింది. 2014కు ముందు భారత ఆర్థిక ప్రస్థానానికి దగ్గరగా ఉన్న దేశాల ఆధారంగా రూపొందించిన ‘సింథటిక్ ఇండియా’తో పోల్చితే.. 2023లో భారత తలసరి వాస్తవ ఆదాయం సుమారు 1,000 డాలర్లు తక్కువగా ఉందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ తేడాను మొత్తం ఆర్థిక వ్యవస్థకు అన్వయిస్తే సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక ఉత్పత్తికి సమానమని నివేదిక పేర్కొంది. అంటే దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని చెప్పిన మోడీ… అందులో విఫలమయ్యారు.
’అభివృద్ధి’తో పాటు క్షీణించిన స్వేచ్ఛ
ఈ అధ్యయనంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై చేసిన అంచనా. 2023 నాటికి భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సూచీ.. మోడీ లేకుండా కొనసాగిన ‘సింథటిక్ ఇండియా’తో పోలిస్తే 56.2 శాతం తక్కువగా ఉంది. ఇక మత స్వేచ్ఛ విషయంలో అధ్యయనం మరింత తీవ్ర అంతరాన్ని చూపించింది. 2023 నాటికి మత స్వేచ్ఛ సూచీలో భారత్, సింథటిక్ కౌంటర్ ఫ్యాక్చువల్ మధ్య 1.407 పాయింట్ల తేడా ఉందనీ, ఇది 2013 స్థాయితో పోలిస్తే 168.7 శాతం అంతరానికి సమానమని నివేదిక పేర్కొంది.
‘సింథటిక్ ఇండియా’ అంటే?
ఈ అధ్యయనంలో కీలకమైన పదం ‘సింథటిక్ ఇండియా’. మోడీ ప్రధానమంత్రి కాకపోయి ఉంటే 2014 తర్వాత భారత్ ఎలా అభివృద్ధి చెందేదో ప్రత్యక్షంగా చూడటం అసాధ్యం. అందుకే పరిశోధకులు 1984-2013 మధ్య భారత పనితీరుకు దగ్గరగా ఉన్న వివిధ దేశాల డేటాను కలిపి ఒక కఅత్రిమ నమూనాను రూపొందించారు. ఆ నమూనాలో ఆర్థిక విశ్లేషణకు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాత 2014-2023 మధ్య నిజమైన భారత్ పనితీరును ఈ నమూనాతో పోల్చారు.
ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి బలం
ఇక్కడే మరో కీలక ప్రశ్న ఎదురవుతుంది. పనితీరుపై ఇలాంటి విమర్శలు ఉంటే బీజేపీ ఎందుకు వరుసగా ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోంది? అని. పరిశోధకులు దీనికి భారత ఎన్నికల విధానాన్ని, ప్రతిపక్షాల విభజనను కారణాలుగా సూచించారు. బీజేపీకి మొత్తం ఓటర్లలో సంపూర్ణ మెజారిటీ లేకపోయినా.. ప్రతిపక్ష ఓట్లు విభజించబడటం వల్ల పెద్ద పార్టీగా అధికారాన్ని సాధించగలుగుతోందని వారు పేర్కొన్నారు.



