వివాదాస్పదంగా సీఐ వ్యవహార శైలి…!
కోదాడ ఘటనపై ఎక్స్ లో స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
నడిరోడ్డుపై వీరంగం… మహిళ పట్ల దురుసుగా ప్రవర్తన
వీడియోలు తీస్తున్న జర్నలిస్టుపైనా దాడికి యత్నం
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఘటన వీడియోలు
నవతెలంగాణ -కోదాడ టౌన్
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని 32వ వార్డులో యాదవ బజార్ ప్రాంతంలో డబ్బా కొట్టును తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 30 ఏండ్లుగా అదే డబ్బా కొట్టుపై ఆధారపడి జీవిస్తున్నామని, ఒక్కసారిగా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళనకారుడు మందల ఉపేందర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఉపేందర్‌పై సీఐ చేయి చేసుకున్నట్టు, అతడిని రోడ్డుపైకి నెట్టివేసి లాక్కెళ్లినట్టు, అంతటితో ఆగకుండా గొంతు పట్టుకుని నొక్కి.. బూటుకాలితో తన్నినట్టు వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపైన కూడా సీఐ దురుసుగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. ఓ మహిళ ఛాతిపై చెయ్యేసినట్టు కనిపిస్తున్న దృశ్యాలు సైతం వీడియోల్లో ఉండటంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాం శంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో మహిళలను తోసేయడం, బాధితుడిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో ఘటనను వీడియో చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టు పైనా సీఐ రెండుసార్లు దాడికి యత్నిం చాడు.. పోలీసు అధికారి అయి ఉండి ఆందోళనకారులతో వ్యవహరించిన తీరు, మీడియా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించిన వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
30 ఏండ్ల జీవనాధారం..
ఒక్కసారిగా తొలగింపు
బాధితుల కథనం ప్రకారం.. మూడు దశాబ్దాలుగా డబ్బా కొట్టును నిర్వహిస్తూ కుటుంబాలను పోషించు కుంటున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డబ్బా కొట్టును తొలగించడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. అధికారులు తమ సమస్యను ముందుగా వినాలని, ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా జీవనోపాధిని దెబ్బ తీయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బా కొట్టు తొలగింపుపై మొదలైన ఆందోళన కాస్తా పోలీసుల తీరుతో ఉద్రిక్తంగా మారడం.. సీఐ వ్యవహారశైలికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడం ప్రస్తుతం కోదాడలో చర్చనీయాంశంగా మారింది. బాధితుల ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఎమ్మెల్యే ఆలోచనలకు..
సీఐ వ్యవహారం ఆటంకం
స్థానిక ఎమ్మెల్యే పద్మావతి కోదాడను ప్రగతి పథంలో తీసుకెళ్లేం దుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడా ల్సిన పోలీసు అధికారి వ్యవహారశైలి ఎమ్మెల్యే ఇమేజ్‌కు నష్టం కలిగించేలా మారిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఐనే వివాదాలకు కేంద్రంగా మారుతున్నారనే విమర్శలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంలో బాధితులు ఆందోళన చేపట్టిన సమయంలో సీఐ శివశంకర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులపై దాడికి దిగడం, మహిళలను తోసే యడం, జర్నలిస్టుతో దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు రావడం తో పోలీసుల తీరుపై ప్రజల్లో చర్చ మొదలైంది. శాంతిభద్రతలు కాపాడాల్సి న అధికారే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసుల పాలనా?: మాజీ మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో ఉన్నది ప్రభుత్వ మా? పోలీసుల పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం చేయిస్తున్నారు.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపితే అరెస్టు చేస్తున్నారు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎక్స్‌లో స్పందించారు. కోదాడలో జరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. ‘కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపును నిరసిస్తూ బైటాయిస్తే వారిపై సీఐ దౌర్జన్యం చేశారు. ఇదేనా మీరు చెపుతున్న ప్రజాపాలన అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మొన్న మహబూబాబాద్ లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్థించాడు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజి పేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటు కాళ్లతో తన్ని మూత్రం తాగించారనే ఆరోపణలు వచ్చాయి. సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు పెట్టారు’ అని స్పందించారు.



