Saturday, August 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

- Advertisement -

వాట్సాప్, మెయిల్‌లో వచ్చిన ఫిర్యాదులపైనా స్పందించాలి
కార్యాలయాల చుట్టూ 
ప్రజలను తిప్పుకోవద్దు
అర్జీలు వచ్చిన వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి: అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం

నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి /పానగల్
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసినా, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపినా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలోని పాన్‌గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, పోలీస్, దేవాదాయ, అటవీ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యలు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేండ్లలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కరించారు.? ఇంకెన్ని పెండింగ్‌‌లో ఉన్నాయనే విషయాలపై మంత్రి ఆరాతీశారు. మండలానికి సంబంధించి మొత్తం 489 వినతులు అందగా, 373 సమస్యలపై అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు.

మరో 50 దరఖాస్తుల్ని పరిష్కరించాల్సి ఉందన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి 60 అర్జీలు పరిష్కరించగా, మరో 19 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పాన్‌గల్ తహసీల్దార్ పరిధిలో 99 అర్జీలు రాగా, 68 పరిష్కరించగా మరో 31 పెండింగ్‌‌లోనే ఉన్నాయన్నారు. ఒక సమస్య కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా పేర్కొని, చిరునామా, ఫోన్ నంబరు వివరాలతో సంబంధిత శాఖాధికారులకు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపుకోవచ్చన్నారు. వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా అధికారులు ప్రింట్ తీసుకుని సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు
గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మండల స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమీక్షలో అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, గ్రంథాలయ చైర్మెన్‌ గోవర్ధన్ సాగర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతి, ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో మంత్రి సమీక్షించారు. పలు సమస్యలను అధికారులతో అక్కడికక్కడే పరిష్కరించారు. రెవెన్యూ సమస్యలపై ముందుగా సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుదారులు తమ భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి, పెండింగ్‌కు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కూడా మంత్రి సమీక్షించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ ఆర్థిక స్థోమత లేక నిర్మాణ పనులు ప్రారంభించని లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా మంత్రికి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -