తండాల అభివృద్ధిని అడ్డుకున్నారు..

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై
– మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ వర్గీయుల ఆగ్రహం
– మహబూబాబాద్‌ ఎంపీ స్థానంపై సమీక్షలో వాగ్వాదం
– మరోసారి ఛాన్స్‌ ఇవ్వండి : ఎంపీ మాలోత్‌ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ హయాంలో తమ తమ తండాలను పంచాయతీలు కాకుండా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అడ్డుపడ్డారంటూ ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆయా తండాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని వారు వాపోయారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్‌ ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ వర్గీయులు సత్యవతి రాథోడ్‌పై విమర్శలు గుప్పించినట్టు తెలిసింది. డోర్నకల్‌ నియోజకవర్గంలోని కొన్ని తండాలను పంచాయతీలు కాకుండా ఆమె తొక్కి పట్టారంటూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలోని వాస్తవాలను అధిష్టానానికి చెప్పే వీల్లేకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు సత్యవతి రాథోడ్‌ తమ నోర్లు నొక్కేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు ఇరువర్గాలను సముదాయించటంతో పరిస్థితి సద్దుమణిగింది. సమావేశానికి హాజరైన సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ నుంచి తనకు మరోసారి టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. గత ఐదేండ్లుగా కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకెళుతున్నానని ఆమె తెలిపారు. అందువల్ల తనకు ఇంకోసారి పోటీ చేసే అర్హత ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కవిత…బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామంటూ వారు ఆమెకు హామీనిచ్చారు.

Spread the love