Saturday, August 29, 2026
E-PAPER
Homeసోపతినట విదుషీమణి షావుకారు జానకి

నట విదుషీమణి షావుకారు జానకి

- Advertisement -

నాలుగు తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్ర ముగ్ధులను చేసిన అలనాటి నటి షావుకారు జానకి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుల్లో జానకి ఒకరు. ఏడున్నర దశాబ్దాలకు పైగా విస్తరించిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర తారలందరి సరసన మెప్పించారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఈ చిత్రం విజయంతో ‘షావుకారు జానకి‘ గా గుర్తింపు పొందారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించారు. (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆమె కన్నుమూశారు.

షావుకారు జానకి 1932, డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కన్నడ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి టి. వెంకోజీ రావు, తల్లి శచీదేవి. వెంకోజీ రావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు. ఈయన ఇంగ్లాండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. ఉద్యోగ రీత్యా కొంతకాలం అస్సాంలో ఉన్నారు. అక్కడే జానకి విద్య సాగింది. జానకి 14 ఏళ్ళ ప్రాయంలో మద్రాసు చేరారు. తన 11వ ఏటా అక్కడే ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అదే సమయంలో రంగస్థల నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించారు. 15 ఏళ్ల చిన్న వయసులోనే శంకరమంచి శ్రీనివాస్‌తో పెళ్లైన తర్వాత జానకి 1950 లో హీరోయిన్‌గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా సత్తా చాటారు. జానకి మొట్టమొదటి చిత్రం : 1950లో జానకి తన 18 ఏళ్ళ వయసులో మహానటుడు ఎన్టీఆర్ సరసన, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. జానకి ‘షావుకారు’ సినిమాలో నటించే సమయానికి ఒక బిడ్డకు తల్లి. దర్శక, నిర్మాత బి.ఎన్.రెడ్డి రికమండేషన్‌తో ఆమెకు ఈ చిత్రంలో అవకాశం వచ్చింది.

తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘షావుకారు’ చిత్రంలో సుబ్బులు పాత్రలో నటించారామె. ఆ చిత్రంలోనే మహానటుడు యన్టీఆర్ తొలిసారి హీరోగా నటించడం విశేషం! ఆ తీరున రామారావుకు జానకి తొలి హీరోయిన్. అలాగే ఆమెకు ఆయనే తొలి హీరో. ‘షావుకారు’ జానకిగా చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సాగారామె. ఇక జానకి రెండో చిత్రం ‘ముగ్గురు కొడుకులు’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జానకి మగ బిడ్డకు జన్మినిచ్చారు. యన్టీఆర్‌కు ఆమె ఓ సెంటిమెంట్‌ : ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా.. స్వయంకృషితో హీరోయిన్‌గా ఎదిగారు. ఆ సమయంలోనే కే. బాలచందర్‌తో కలిసి రాగిణి క్రియేషన్ సంస్థతో కలిసి తమిళంలో కొన్ని నాటకాలు ప్రదర్శించారు. తెలుగులో యన్టీఆర్ సరసన ఎక్కువ సినిమాల్లో ఆమె నటించారు. వారిద్దరూ నటించిన “వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కం, రేచుక్క-పగటి చుక్క, పెంపుడు కూతురు” వంటి చిత్రాలు విజయం సాధించాయి. వీటితో పాటు యన్టీఆర్ హీరోగా రూపొందిన “సవతి కొడుకు, చెరపకురా చెడేవు, అన్న-తమ్ముడు, కాడెద్దులు ఎకరం నేల” వంటి సినిమాల్లోనూ జానకి ముఖ్యపాత్రలు ధరించారు.

యన్టీఆర్ తొలి సొంత చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’లో కీలకమైన పాత్ర పోషించారు. అందులోనే తొలిసారి ఆమె చెల్లెలు కృష్ణకుమారి, రామారావుకు జోడీగా నటించారు. యన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమాలోనూ, ఆయన నిర్మించిన మొదటి చిత్రంలోనూ జానకిని ఎంపిక చేసుకోవడం వెనుక యన్టీఆర్‌కు ఆమె అంటే ఓ సెంటిమెంట్ ఉండడమే కారణం. ఇక యన్టీఆర్ సొంత సంస్థ ‘యన్.ఏ.టి.’ పతాకం బ్యానర్‌లో శ్రీవేంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మధ్యలో పెట్టి, కుడి వైపున లక్ష్మీదేవిగా జానకినే కూర్చోబెట్టడం కూడా విశేషమే! యన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను ‘తాతమ్మకల’తో చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ సినిమా తరువాత ‘రామ్-రహీమ్’లో నటింప చేశారు. అందులోనూ, ఆ తరువాత వచ్చిన బాలయ్య చిత్రం ‘వేములవాడ భీమకవి’లోనూ బాలకృష్ణకు తల్లిగా నటించారు జానకి. తమిళంలో మరింత గుర్తింపు : ఇక ఏయన్నార్ సరసన జానకి నటించిన “రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, అక్కాచెల్లెలు” మంచి ఆదరణ పొందాయి. వీటిలో ‘రోజులు మారాయి’ ఒక్క చిత్రంలోనే జానకి సోలో హీరోయిన్. మిగిలిన సినిమాల్లో ఇతరులు కూడా నాయికలుగా కనిపించారు. ‘అక్కాచెల్లెలు’లో జానకిపై చిత్రీకరించిన “పాండవులు పాండవులు తుమ్మెదా.. పంచపాండవులోయమ్మా తుమ్మెదా..” పాట ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది.

‘నాగులచవితి’లో నాగదేవతగా జానకి అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తెలుగులో షావుకారు జానకిని అనుకున్న పాత్రల్లో ఆమె చెల్లెలు కృష్ణకుమారిని ఎంచుకోవడం మొదలు పెట్టారు సినీజనం. దాంతో తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు జానకి. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఇతర భాషల్లో మంచి పాత్రలు దక్కాయి. తమిళంలో శివాజీగణేశన్, ఎమ్జీఆర్‌తోనూ, మళయాళంలో ప్రేమ్ నజీర్ సరసన, కన్నడలో రాజ్ కుమార్‌తోనూ జానకి నటించారు. తమిళంలో శివాజీకి హిట్ పెయిర్‌గా నిలిచారామె. ఇక దర్శకుడు కె.బాలచందర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం! వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒంటరి పోరాటం.. : జానకి సినిమాల్లోకి వచ్చిన కొద్దిరోజులకే భర్తతో విభేదాలు రావడంతో ఆయనకు దూరమయ్యారు. ఆ రోజుల్లో ఓ తల్లిగా ముగ్గురు పిల్లల బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ఒంటరిగా పెంచి పెద్ద చేశారు. ఆ కాలంలో సినిమాల్లో నటిస్తోందనే కారణంతో సొంత బంధువులు కూడా ఆమెను ఇళ్లలోకి రానివ్వలేదు. ఇక సమాజం నుంచి ఎదురైన ఎన్ని అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ధైర్యంగా నిలబడి తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించారు. నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన జానకి ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో షావుకారు జానకి సాధించిన అరుదైన రికార్డులు ఎన్నో ఉన్నాయి.

తెలుగులో ఎన్.టి.రామారావు, తమిళంలో ఎంజీఆర్, ఎం. కరుణానిధి, జయలలిత వంటి ముఖ్యమంత్రులతో కలిసి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ సీఎం ఎం. కరుణానిధి స్క్రిప్ట్ అందించిన సినిమాల్లోనూ ఆమె పాత్రలు పోషించి, అత్యధికంగా నలుగురు ముఖ్యమంత్రులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక కథానాయికగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
సినీ నిర్మాతగా : షావుకారు జానకి నటిగానే కాదు నిర్మాతగానూ తన ప్రతిభను చాటుకున్నారు. 73 ఏండ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె రెండు సినిమాలనూ నిర్మించారు. బెంగాలీలో ఉత్తమ్ కుమార్ నిర్మించిన ‘ఉత్తర్‌ ఫాల్గుణి’ సినిమాను ఆమె కె. బాల చందర్ దర్శకత్వంలో ‘కావియ తలైవి’ పేరుతో రీమేక్ చేశారు. బెంగాలీలో సుచిత్రాసేన్ తల్లీ కూతుళ్ళుగా నటించిన ఆ పాత్రల్ని తమిళంలో జానకి పోషించారు. 1970లో విడుదలైన ఈ తమిళ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. కానీ ఈ చిత్రంలో హీరోగా నటించిన జెమినీ గణేశన్‌ ఉత్తమ నటుడిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ఇక జానకి నిర్మించిన రెండో సినిమా ‘రంగరాట్టనమ్’. కృష్ణన్‌ – పంజు దర్శకత్వ ద్వయం దీనిని తెరకెక్కించారు. ఇందులోనూ జానకితో పాటు శివాజీ గణేశన్, రవిచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. 1971 డిసెంబర్‌‌లో విడుదలైన ఈ సినిమా కూడా జానకికి చేదు అనుభవాన్నే కలిగించింది. దాంతో ఆమె ఇక చిత్ర నిర్మాణం జోలికి పోలేదు.

ఆస్తులు వందల కోట్లల్లో : ‘షావుకారు’ జానకి పేరుకు తగ్గట్టుగానే ఆస్తులు సంపాదించారు. జానకి తన సంపాదనతోనే పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తరువాతి రోజుల్లో అవే ఊహించని ఆస్తులుగా మారాయి. మద్రాసులో షావుకారు జానకి తన అభిరుచికి తగ్గట్టుగా ఓ భవంతిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో అనేక తెలుగు, తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం విశేషం! చెన్నైలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో జానకి చనిపోయేవరకు ఉన్నారు. దాని విలువ రెండు వందల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. తొలి సినిమా పారితోషికం రూ.2500తో కెరీర్‌ని ప్రారంభించి వేల కోట్లకు ఎదిగారు. కానీ భర్త చాలా వరకు పోగొట్టారు. అయితే వాటిలో సగం వరకు పొదుపు చేసుకున్నారట. అంటే ఇప్పటికీ ఆమె ఆస్తులు వందల కోట్లల్లో ఉంటాయని చెప్పొచ్చు. అంతేకాదు 1990లో చెన్నైలో ఆమె ‘కోకోనట్‌ గ్రోవ్‌’ పేరుతో రెస్టారెంట్‌ని కూడా నిర్వహించారు. అప్పట్లో అది చాలా ఫేమస్‌ అని సమాచారం. అయితే ఆ తర్వాత అది ఉన్నదా లేదా అనే సమాచారం లేదు. కాకపోతే అందులో ఫుడ్‌ చాలా ఫేమస్‌ అని ఇప్పటికీ అంటుంటారు. మొత్తంగా షావుకారు జానకి వేల కోట్ల ఆస్తులు సంపాదించి, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను తమ పిల్లలకు ఇచ్చి వెళ్లిపోయారు.

కేరెక్టర్ రోల్స్ లోకి : హీరోయిన్ వేషాలు తగ్గగానే జానకి కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ తనకు తగ్గ పాత్రల్లో ఆమె అలరించారు. ‘తాయారమ్మ-బంగారయ్య, పార్వతీపరమేశ్వరులు, సంసారం ఓ చదరంగం” వంటి చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు జానకి. ఈ మధ్య ‘అన్నీ మంచి శకునములే’ అనే చిత్రంలో నటించారు.
సినీ వారసురాలు వైష్ణవి : జానకి చెల్లి కృష్ణకుమారి సినిమా రంగంలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన.. జానకి పిల్లలు ఎవ్వరూ ఈ రంగంలోకి రాలేదు. కానీ ఆమె సినీ వారసత్వాన్ని తన పెద్ద కుమార్తె యజ్ఞ ప్రభ కుమార్తె ‘వైష్ణవి’ ముందుకు తీసుకెళ్లారనే విషయం చాలామందికి తెలియదు. వైష్ణవి దక్షిణాది సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘రోజా’లో హీరోయిన్ మధుబాల అక్క పాత్రలో వైష్ణవి నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమ’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు లీజ్జీ పాత్రలో కనిపిస్తారు. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ సరసన ‘అత్తింట్లో అద్దె మొగుడు’, ‘చామంతి’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. వీటితో పాటు ‘అయ్యప్ప కరుణ’, ‘పరువు ప్రతిష్ట’ వంటి సినిమాల్లోనూ మెరిసారు. తెలుగుతో పోలిస్తే తమిళ, మలయాళ భాషల్లో వైష్ణవి ఎక్కువ సినిమాలు చేశారు. అలా షావుకారు జానకి కుటుంబం నుంచి వచ్చిన మరొక ప్రతిభావంతమైన నటిగా వైష్ణవి గుర్తింపు పొందారు.

చివరి శ్వాస వరకూ కళాసేవ : షావుకారు జానకి వెండితెరపైనే కాకుండా, బుల్లితెరపై ‘ఊరరింద రహస్యం’, ‘వరూధిని పరిణయం’ వంటి ధారావాహికల ద్వారా ప్రేక్షకులను అలరించారు. వయసు మీదపడుతున్నా నటనపై ఉన్న మక్కువతో ఇటీవల ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కొత్త తరంతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భారత చలనచిత్ర జగత్తులో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఏడు దశాబ్దాలకు పైగా వెండితెరపై సహజ నటనతో, హుందాతనంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి పద్మశ్రీ షావుకారు జానకి (94) ఆగస్టు 21 వ తేదీ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. జానకి పొందిన పురస్కారాలు : దక్షిణాది భారత సినిమాకి చేసిన కృషికి గాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న జానకి అంతకుముందు అనేక అవార్డులను అందుకున్నారు. 1969-1970 లో తమిళనాడు ప్రభుత్వం ద్వారా కలైమామణి పురస్కారం, 1970లో ‘ఇరు కోడుగల్’ చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 1984లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

1985లో మహానటి సావిత్రి అవార్డు, 1985లో ఆమె ఎంచుకున్న రంగంలో శ్రేష్ఠత కోసం అరిజోనాలోని వరల్డ్ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 1987లో ‘సంసారం ఒక చదరంగం’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, 1989లో ఇండియన్ ఎక్స్ప్రెస్ దియోనారా గోల్డెన్ అవార్డు, 1990లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ ఎంజిఆర్ పురస్కారాన్ని స్వీకరించారు. 2000లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వంచే శ్రీ కృష్ణ దేవరాయ అవార్డు, 2004లో నడిగర్ తిలగం శివాజీ జీవితకాల సాఫల్య పురస్కారం, 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘అమూల్యం’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, 2023లో సైమా జీవితకాల సాఫల్య పురస్కారం, 2015లో కర్ణాటక ప్రభుత్వం నుండి రాజ్యోత్సవ అవార్డు, 2019లో స్ట్రీరాట్నా అవార్డ్స్, 2019లో వండర్ ఉమెన్ అవార్డ్, 2020లో భారతీయ సినిమా ఎవర్గ్రీన్ ఎంటర్టైనర్ తమిళనాడు ప్రభుత్వం నుండి పురచ్చి తలైవి డాక్టర్ జె. జయలలిత స్పెషల్ కలైమామణి అవార్డు అందుకున్నారు.

​డా. పొన్నం రవిచంద్ర,
సీనియర్ జర్నలిస్టు,
సినీ విమర్శకులు
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -