ఉపాధ్యాయునిగా, ఉద్యమ కారుడిగా, కవిగా, రచయితగా, జర్నలిస్టుగా గుర్తింపునొందిన ఎన్ తిర్మల్ ‘మట్టి పువ్వు’ పేరుతో తన జీవిత చరిత్రను వెలుగులోకి తెచ్చారు. తిర్మల్ జననం, విద్యాభ్యాసం, ఉద్యోగం ఎక్కువగా పల్లెల్లోనే జరిగింది. ఆ మట్టి పరిమళాలు అతడిని బలంగా వెంటాడుతున్నాయి. రైతు కుటుంబాలలో ఉండే అమాయకత్వం, సాదాసీదాతనం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సిగరెట్, కల్లు, సారా తాగడం, తరగతులు ఎగ్గొట్టి సినిమాలు, షికారులకు పోవడం వాటన్నింటినీ స్పష్టంగా, నిజాయితీగా రాశాడు. కమ్యూనిస్టు కుటుంబంలోంచి వచ్చిన తిర్మల్ తొమ్మిదో తరగతిలోనే వామపక్ష ఉద్యమాల వైపుకు మళ్లారు. వామపక్ష విద్యార్థి సంఘం అనుబంధం పెరిగిన కొద్దీ తనకు తెలియకుండానే కొత్త ప్రభావాలు, మార్పులకు లోనయ్యాడు. అప్పుడే ఒక చేత్తో ఎర్రజెండా, మరో చేతిలోని కలంలో కదలాడే నల్లసిరా కాస్త ఎరుపు రంగులోకి మారడం మొదలైంది. ‘ఫోకస్’ పత్రిక, ‘ఈ వారం కవిత’లో, ఆ తర్వాత ‘విమోచన, ప్రజాపంథా, తిరుగుబాటు’ పత్రికల్లో భావప్రకటన మొదలైంది. కళాశాలల్లో సాహిత్య కార్యదర్శిగా ఎన్నికవ్వడం, కాలేజీ మేగజైన్‌లో రచనలు చేయడం మామూలైపోయింది. శ్రీశ్రీని ఖమ్మం రప్పించడంలో కీలకపాత్ర వహించడం ఒక మైలురాయి సంఘటన.
జీవనావసరాల కన్నా, ఉద్యమావసరాల కోసం అక్షరాల బాట పట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత నిర్మాణాత్మకంగా వివిధ రూపాలలో, అవసరాల రీత్యా రచనా రంగంలోకి వెళ్ళిపోయాడు. జర్నలిస్టుగా మారినా, కార్యకర్తగా మారినా సాహిత్యం కేంద్రంగానే ఎక్కువ పని చేశాడు. విరసం నుండి ప్రజా రచయితల సంఘంలోకి తదనంతరం పత్రికలు పెట్టి రచనలు చేసే వరకు.. కవులు, రచయితల నుండి రచనలు తెప్పించడం మొదలైన పనుల్లో తలమునకలయ్యారు. తిర్మల్ రచయితగా మారడానికి అవసరాలే తీర్చిదిద్దాయి. 2018లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉద్యోగ విరమణానంతరం అటు రచనారంగంలోకి, ఇటు రాజకీయ రంగంలోకి పూర్తి కాలం దిగిపోయాడు. ఆత్మకథ పేరిట రచయిత తన జీవితంలో వివిధ దశల్లో సంభవించిన అనేకానేక మార్పులు, సంఘటనలను యథాతథంగా అక్షరీకరించడంలో సక్సెస్ కాగలిగారు.
కె పి అశోక్ కుమార్ , 97000 00948



