బాంబే ప్రోగ్రెసివ్‌ల సంస్థలో మరో ముఖ్య కళాకారుడు మక్బుల్ ఫిదా హుస్సేన్. ఈయన పేరు సమాజంలో కళాజగత్తు నుండి ఎంతో దూరంగా వున్నవారు కూడా విని ఉంటారు. ఈయన చెప్పులు వేసుకోడనీ, సినీతార మాధురీ దీక్షిత్ అభిమానిగా, ఆమెపై సినిమా తీశాడనీ ఈయన పేరు ఎందరో విని ఉన్నారు. ఒక విధంగా కళాకారులు అనే కోవ సామాన్య సమాజానికీ ఈయన వలన పరిచయం అయిందనీ చెప్పవచ్చు.
హుస్సేన్ ఎన్నో పెద్ద పెద్ద చ్రితాలు వేశాడు. ప్రతీ చిత్రం మొదలుపెట్టే ముందు ఒక గణేషుడి చిత్రం వేసేవాడు. ఈయన 1915లో పండరీపురంలో పుట్టాడు. పుట్టిన ఒకటిన్నర సంవత్సరాలకే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లిరూపం గుర్తు తెలియక, ఆమె రూపం వెతుకుతూ మదర్ థెరిస్సా చిత్రాలు ఎన్నో వేశాడు. విశ్వమాతగా వున్న ఆమె చిత్రాలలో తల్లి ప్రేమ వెతుక్కునేవాడు. ఆమె చిత్రాలలో చాలా సార్లు ముఖంలో కను ముక్కు రూపం వేయక, ఆ ముఖంలో తన తల్లి రూపం వెతుక్కుంటున్నాడనిపిస్తుంది. అతని బాల్యం ఇండోర్‌లో గడిచింది. అక్కడి మొహరం పండుగ ఊరేగింపులలో చేసే గుర్రాల బొమ్మల తయారీలో పాల్గొనేవాడు. ఆ గుర్రపు ఆకారాన్ని, గుర్రాల తయారీ ఉత్సాహ శక్తిని, గుర్రపు బొమ్మల అలంకరణ చూసి ఎంతో ప్రేరితమయ్యాడు. ఆయన ఎన్నో రకరకాల ఆకారాల్లో, కదలికల్లో తన జీవితమంతా గుర్రాల చిత్రాలు వేశాడు. ఫ్రాన్స్ కళాకారుల క్యూబిజం అనే పద్ధతిన ఆకారాన్ని త్రికోణం, చతురస్రాలుగా అవగాహన చేసుకుని చిత్రాన్ని గీస్తారు. హుస్సేన్ వెడల్పు గీతల క్యూబిజం పద్ధతి చిత్రాలు ఎంతో జీవకళ ఉట్టిపడుతూ దర్శకుల దృష్టిని ఆకట్టుకుంటాయి. ఈయన చిన్నతనానే కలీగ్రఫీ నేర్చుకున్నాడు. అలాగే కుఫిఖత్ అనే అరబిక్ పద్ధతి అక్షరాలూ నేర్చుకున్నాడు. అవి బిందువులు, రేఖలు కలిపినట్టు జ్యామితి గణిత రూపంలో వుంటాయి. అందువలన క్యూబిజం ఈయనకు జీవపట్టులా అందింది. మత గురువు అవడానికి తర్ఫీదు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ కలిపి చిన్నతనాన కళలపై ఆసక్తిని పెంచాయి.
తండ్రి రెండవ వివాహం చేసుకున్నాక ఇల్లు వదిలి బరోడాలో తన మామ దగ్గర మదర్సాలో ఉన్నప్పుడు కవితలు రాయడం నేర్చాడు. 1935లో బొంబాయికి వెళ్లిపోయాడు. మొదట కొంతకాలం జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చిత్రం నేర్చుకోవటానికి ప్రయత్నించాడు. 1940 నుండీ తన అవగాహన ప్రకారం చిత్రం వేసుకున్నాడు. 1947లో ఇతను చేసిన చిత్ర ప్రదర్శన చూసి, బొంబాయి ప్రోగ్రెసివ్ సంస్థని నిర్మించిన సూజా తన సంస్థలో కలవమని ఆహ్వానించాడు. అలా ఆ సంస్థలో చేరి వారితో పాటు ప్రదర్శన ఇచ్చాడు. ఇతను స్వయం బోధన చేసుకుని నిలిచిన కళాకారుడు. గొప్పగా టెక్నిక్‌ని అభ్యాసం చేసినవాడు. ఈయన చిత్రాలు ఒక కథ చెప్పినట్టు వుంటాయి. మన భారతీయ పండుగలు, సమాజంపై వేసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి. సామాన్య ప్రజల జీవితాల చిత్రాలను, ఆధునిక పద్ధతిలో అందరికీ అర్థం అయ్యేలా చిత్రించటం ఈయనకు పేరు తెచ్చిపెట్టాయి. 1991 లో భారత ప్రభుత్వం పద్మవిభూషన్‌తో సత్కరించింది. 1997లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 3 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. 1986 నుండి 1992 వరకూ రాజ్యసభ సభ్యుడిగా వున్నాడు. 2011లో ఈ లోకం వదిలాడు. సయ్యద్ హైదర్ రజా : ఈయన 1922లో జన్మించి, 2016లో చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లో భిల్లులు, గోండుల ఉత్సవాలను చూస్తూ, అడవికి దగ్గరగా ప్రకృతితో స్నేహం చేసి ప్రకృతి చిత్రాలు వేశాడు. దేశ విభజనలో ఈయన తోడబుట్టిన వారు పాకిస్తాన్ వెళ్లిపోయినా, ఈయన ఇక్కడే వుండిపోయాడు.
జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ నాగపూర్‌లో చిత్రకళ నేర్చుకున్నాడు. బిందువు అనే శూన్యతకు ఆధ్యాత్మక అర్థంతో ఎన్నో చిత్రాలు వేశాడు. బొంబాయి ప్రోగ్రెసివ్‌ల సంస్థతో పాటు చేరి ఒక ప్రదర్శన ఇచ్చి ఆపై విదేశం వెళ్లిపోయాడు. ఆపై తిరిగి వచ్చి ఢిల్లీలో జీవించాడు. 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది ప్రభుత్వం. (రజా చిత్రకళపై నా విపులమైన వ్యాసం 31, జులై 2016 సోపతిలో ప్రచురింపబడింది.) సదానంద బాక్రే : బొంబాయి ప్రోగ్రెసివ్‌ల సంస్థలో ఒకే ఒక శిల్పకారుడు ఈయన. 1920లో బరోడాలో జన్మించాడు. బొంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చిత్రకళలో శిక్షణ పొందాడు. మొదట ఈయన నిజమనిపించేలా శిల్పాలు చేశాడు. ఆపై ఈ బ్రిటీష్ వారి బోధన పద్ధతి వదిలి నిరూప శిల్పం చేసే పద్ధతి అవలంభించాడు. ఈ సమయాన యూరోప్‌లో రోడా వంటి శిల్పకారులు, తమ శిల్ప పద్ధతి మార్చి, ఆధునికతకు అర్థం చెపుతూ, వ్యక్తిత్వం గోచరించే అర్థవంతమైన శిల్పం తయారు చేశారు. బాక్రే కూడా ఆ పద్ధతి అవలంభించి రూప ప్రదర్శన శిల్పం కాక అర్థం తెలిపే శిల్పం తయారు చేశాడు. 1951లో బ్రిటన్ వెళ్లి చిత్రం కూడా వేశాడు. ఆపై భారతదేశం తిరిగి వచ్చి మహారాష్ట్రలో అనామకుడిగా జీవించి 2007లో కన్నుమూశాడు. 2004లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు.
హరి అంబాదాస్ గాడే : 1917లో అమరావతి, మహారాష్ట్రలో జన్మించాడు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. 1939లో నాగపూర్ ఆర్ట్ స్కూల్లో చిత్రం నేర్చుకున్నాడు. జబల్‌పూర్‌లో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1949 – 50లో మళ్లీ మాస్టర్స్ పట్టా కోసం చిత్రకళ నేర్చుకున్నాడు. 1958లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఒక సంవత్సరం చదువుకున్నాడు.
మొదట నీటిరంగులతో చిత్రం వేసినా ఆపై తైల వర్ణ చిత్రాలు వేశాడు. బ్రిటీష్ వారు నేర్పిన చిత్రకళ పద్ధతి వదిలేశాడు. ఇతని చిత్రంలో రంగులు ముఖ్యం రూపం కంటే. బొంబాయిలోని ప్రజల పేదరికంపై 1950లో చిత్రాలు వేశాడు. అలాగే ప్రకృతి చిత్ర ప్రియుడు కూడా. కేరళ ప్రకృతి దృశ్యాలు, రాజస్థాన్ ప్రకృతి దృశ్యాలు వేశాడు. ఈయనకు సైన్స్, గణితంపై వున్న అభిరుచి వలన ఆ పద్ధతిన చిత్రం వేయటంలో క్యూబిజం పద్ధతి కూడా అనిపిస్తుంది. ఈయన బాంబే ప్రోగ్రెసివ్‌ల ఒక కళాకారుడు. 1956లో ఆ సంస్థ విచ్చిన్నమయ్యే వరకు ఆ సంస్థ సభ్యుడు. ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. ఎన్నో చోట్ల ఈయన చిత్రాలు పొందుపరిచి వున్నాయి. బహుమతులూ సంపాదించాడు. 2001లో కన్నుమూశాడు.
బాంబే ప్రోగ్రెసివ్‌ల సంస్థలో సుజా, రజా, బాక్రే విదేశాలకు వెల్లపోయినా, ఆ సంస్థలో మిగిలిన ముగ్గురూ తమ పని, తమ సిద్ధాంతాల ప్రకారం కొనసాగించారు. కొత్త సభ్యులు ఇందులో వచ్చి కలిశారు. వారూ ఈ సిద్ధాంతాలను నమ్మినవారేను. అందులో కొద్దిమంది.. కట్టింగెరి కృష్ణ హెబ్బర్ : ఉడిపి, కర్నాటకలో 1911లో జన్మించాడు. ఇతని తండ్రి గణపతి విగ్రహాలు పండుగకి తయారు చేసేవాడు. అవి చూసి తను కళలు నేర్చుకోవాలని, కొంత మైసూరులోనూ, బొంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లోనూ కళలు నేర్చుకుని, ఆపై జె.జె.స్కూల్‌లో కళలు నేర్పించాడు. ఈయన చిత్రం జానపద చిత్రకళకు దగ్గరగా మన పండుగలు, పర్వాల మీద చిత్రిస్తాడు. బొంబాయి నుండీ 1945 తరువాత పారిస్‌లో కళాధ్యయనం చేశాడు. మొదట కేరళ ప్రకృతి దృశ్యాలపై చిత్రాలు వేశాడు. ఆపై యూరోప్ చిత్రకారుల పద్ధతిన చిత్రించి, ఆధునిక భారతీయ కళకు ఒక ప్రత్యేకత తీసుకువచ్చాడు. ఈయన పేదరికం, సామాజిక విషయాలు, అణుబాంబుల విధ్వంసం వంటి విషయాలపై కూడా చిత్రాలు వేశాడు. 1989లో పద్మభూషణ్‌తో సత్కరించబడ్డాడు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 1996లో కన్నుమూశాడు.
బాల్ చ్ఛాబ్దా : పంజాబ్‌లో 1923లో జన్మించాడు. ముందు కళాభిమాని, చిత్రాలు నిర్మించేవాడు. హుస్సేన్ వంటి వారి ప్రేరణ వలన 1958లో చిత్రం వేయ ప్రారంభించాడు. నిరూప చిత్రాలే కాదు, భావాత్మక, రంగుల చిత్రాలు వేశాడు. ప్రదర్శనలూ ఇచ్చాడు. 1972లో రాక్ ఫెల్లర్ అవార్డు గ్రహీత. 2013లో మరణించాడు. అక్బర్ పదమ్‌సీ : 1928లో గుజరాత్ కచ్‌లో బోరా ముస్లింల ఇంట జన్మించాడు. ఇతని పూర్వుజులు కవులు, చరిత్రకారులు. ఇతని తాత వాఘనగర్ ఊరి సర్పంచ్. ఆయనకి పదమ్‌సీ అనే పేరు ఇవ్వబడింది. అది పద్మశ్రీ వంటి పదమేను. అది తరాల పేరు అయింది. ఈయన అన్న అలిఖ్ పదమ్‌సీ నాటక, సినిమా వేదిక వారు. అక్బర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో కళలు అభ్యసించాడు. 2010లో పద్మభూషణ్‌తో సన్మానించబడ్డాడు. ఇతను నిరూప చిత్రాలు ఆధ్యాత్మిక భావ ప్రకటన కోసం చిత్రించాడు. అలాగే నీటి రంగులు, తైల వర్ణ చిత్రాలు, ముద్రణ కళలు, ఫొటోగ్రఫీ, శిల్పం చేశాడు. సినిమాలు తీశాడు. ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. ఎన్నో చోట్ల ఈయన కళాకృతులు వున్నాయి. 2020లో మరణించాడు.
డా.యం. బాలామణి, 8106713356



