డేగలు వినువీధిన ఎగురుతోంటే
ఒక శంక … అశాంతికి చిహ్నంలా..
తమ ఆధిపత్యాల కోసం
అహం సంతృప్తి కోసం
ఆ బలవంతుల పోరును
మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా
బలవంతంగా రుద్దుతున్నట్టు
మనం బలిపీఠం పై ఉన్నట్టు
ఒక ఊహ…
నిజం కాకూడదని ఆ ఊహ
యధార్థ రూపం దాలిస్తే
మానవత్వం సిగ్గుతో
కుంచించుకు పోయేలా
ఉన్మాదుల పిపాసకు
మూల్యం చెల్లించుకుని
బతికున్న శవాల్లా మనం
మన రొద సొదగా మిగిలి
పీనుగుల గుట్టలు
నిస్సహాయంగా మనను
వెక్కిరిస్తే
అప్రయోజకుల్లా చేవ చచ్చిన
చీమూ నెత్తురు ఇంకిన
మనం వెల లేని మూల్యం చెల్లిస్తే
కనికరం లేని ఆ మదాందులు
సమభావనకు ఘోరీ కట్టి
వికటాట్టహాసం చేస్తూ
విర్రవీగుతుంటే
వారి రెక్కలు విరిచి
ఉత్తుంగ తరంగంలా
ఎగసి పడాలని కాంక్షతో
మనలో ఉడిగిన శక్తిని
పునరుత్తేజం చెందించి
జారిపోయిన ఆత్మలను చేపట్టి
ప్రశ్నించి, వేలెత్తి చూపి
కొత్త గొంతుక బాణాలు విసిరితే
పుడమి అక్కున చేర్చుకోదా..
ఆ అడుగుల జన్మ సార్థకం కాదా…
పంతంగి శ్రీనివాస రావు, 9182203351
ఆ అడుగుల జన్మ
- Advertisement -
- Advertisement -



