Sunday, August 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్‌ ప్రక్రియ విధానంలో లోపాలు

సర్‌ ప్రక్రియ విధానంలో లోపాలు

- Advertisement -

అర్హులైన ఓటర్లను తొలగింలొద్దు..అనర్హులను చేర్చొద్దు
ఆ మేరకు చర్యలు తీసుకోండి
క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరిన్ని వారాలు
పొడిగించాలి : ఈసీకి సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ

ఏఎస్డీడీలో 73.39 లక్షల ఎంట్రీలు
తాత్కాలికంగా వెళ్లిన వారిని శాశ్వతంగా
వెళ్లినట్టు పరిగణించే అవకాశముందంటూ ఆందోళన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటర్ల సవరణ జాబితా (సర్ ప్రక్రియ) విధానంలో లోపాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. సర్ ప్రక్రియలో ఉన్న పలు లోపాలపై ముఖ్యమంత్రి ఆ లేఖలో ప్రస్తావించారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇండ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు. నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకు నేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించడం లేదని చెప్పారు. అలాంటి వారికి పాత నివాసంలో ఉన్న ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సదరు ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం ఉన్నారని సీఎం తెలిపారు. పరిశీలన నోటీసుల్లో ఇక్కడే 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆక్షేపించారు. సవరణ ప్రక్రి యను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రి యను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి, నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరం గంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని సీఎం తేల్చి చెప్పారు. వారికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోతే పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచిం చారు. హైదరాబాద్‌లోని ప్రతి నియోజక వర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరికి సేవలందిం చేందుకు కేవలం కొంతమంది ఓటర్ల నమోదు అధికారుల నియామకం సరిపోదని పేర్కొ న్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగు వన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమ యాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా, అనర్హులను చేర్చకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. సర్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఎం తెలిపారు. వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ఎఎస్డీడీ) గుర్తించారని ఈసీ గణాంకాలను ఉటంకిం చారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉన్నాయని సీఎం అభ్యంతరం తెలిపారు. 32.36 లక్షల పత్రాల కు గత ఓటర్ల జాబితాతో అనుసంధానించ లేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -