Sunday, August 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఏకత విరుద్ధ కథ

ఏకత విరుద్ధ కథ

- Advertisement -

​‘‘అందరూ ఆచరణలో నిమగ్న మయ్యే ఉంటారు. కానీ ఆలోచనలూ మాటలే వారిననుసరించవు’’ అని అంటా రొక కవి. ఇది తిరగేసి వ్యంగ్యంగా చెప్పిన మాట. అంటే, చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని అర్థం. మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందనేది ఎప్పటినుంచో మనకు తెలిసిన విషయమే. అందుకే అంటారు, ‘మాటలు కోటలు దాటుతాయి, కాని చేతలు గడపలు దాటవు అని.’ ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్న గురజాడ గీతం ఇలాంటి వారిని చూసే రాసుంటారు. అయితే చెప్పే మాటల ప్రకారం చేయకపోతే పోనీ, చెప్పినదానికి విరుద్ధంగా, పూర్తి వ్యతిరేకంగా చేస్తున్న వారి గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేమంటే, ‘సార్వత్రిక ఏకతా ఉత్సవాల’ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహిస్తున్న సభలు నేడు అమెరికా దేశపు న్యూయార్క్ సిటీలోనూ ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆగస్టు 29 న జరిగే ఈ సభలో ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తున్నారు.

సార్వత్రిక ఏకతా ఉత్సవమని దానికి పేరుపెట్టటం మరీ విడ్డూరంగా ఉంది. అయితే వారి ఏకత కేవలం మతపరమైన ఏకతకు సంబంధించింది కావచ్చు. వీళ్లు అసలు మనుషుల ఐక్యతను ఎప్పుడూ కోరుకోరు. వీరి సిద్ధాంతంలోనే విభజన, విద్వేషం ఉంటుంది. ఐక్యత, ఏకత అనే మాటలకే పూర్తి విరుద్ధమైన ఆచరణ వాళ్లది. అట్లాంటి వాళ్లు సార్వత్రిక ఏకత కోసం ఉత్సవం చేస్తున్నారు. సరే వారి అర్థంలో విద్వేషాలను, విభజనను వెళ్లగక్కటానికి కావలసిన ఏకత కోసం ఈ పాట్లన్నీ పడుతున్నారు. కాబట్టే ఏ మాటల వెనుక ఏ అర్థాలు దాగున్నాయో తెలుసుకోనంతవరకు మోసపోతూనే ఉంటాం. ఇప్పుడు ముసుగేసుకున్న ఆ సంఘ్ ఏర్పడి వందేండ్లు నిండిన సందర్భంగా ప్రపంచంలోనూ తమ గళాన్ని, గరళాన్ని చిందించే క్రమంలో ఏర్పాటు చేసుకున్నదే న్యూయార్క్‌లో భగవత్ ప్రసంగ సభ. భారతదేశం నుం‌చి వీళ్లు పోయి అక్కడ చెప్పేదేమిటి?ఈ దేశపు సాంస్కృతిక జీవన విధానాన్ని ఏమైనా ప్రతిబింబిస్తారా?ప్రపంచంలోని ప్రజలకు వీళ్లు వినిపించే సందేశం ఏమిటి? న్యూయార్క్‌లో ఉన్న ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు వీళ్ల విషయాలన్నీ తెలుసు. అందుకే ‘మోహన్ భగవత్ ఇక్కడ సభ పెట్టటాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’ అని ప్రదర్శన తీశారు. వాళ్లింకా ఏమన్నారంటే, మహాత్మా గాంధీని చంపిన వారసులు వీళ్లు, వీళ్ల సభను జరగనివ్వమని నినదించారు. అంతే కాదు, వేలాది మందిని చంపిన యుద్ధ పిపాసి, ఫాసిస్టు హిట్లర్ వీరికి ఆదర్శం.

అటువంటి సంఘ్ శక్తులకు అవకాశం ఇవ్వవద్దని ధర్నా నిర్వహించారు. హిందూ మతతత్వ శక్తులకు ఇక్కడ చోటులేదని పెద్దఎత్తున మాడిసన్ వీధులలో ప్రదర్శనలు తీశారు. వాళ్లంతా హిందూ సమూహాలే కావడం విశేషం. ఇక న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దాని కూడా తాను ఈ కార్యక్రమానికి మద్దతివ్వటం లేదని ప్రకటించారు. అయితే అదొక ప్రైవేటు కార్యక్రమం కావడం వల్ల దాన్ని రద్దుచేసే అధికార పరిధి నగర ప్రభుత్వానికి ఉందా అన్నది వేరే ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. కానీ ఆరెస్సెస్‌ గురించిన తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. మమ్దాని గుజరాత్ రాష్ట్ర వారసత్వం కలిగినవారు. భారతదేశానికి సంబంధించిన అవగాహన ఉన్నవాడు. ఆయన ఏమన్నారంటే, ‘తన కుటుంబం తనకు నేర్పిన భారతదేశం, తాను పెరిగిన భారతదేశం ‘‘బహుళత్వ సమాజం, లౌకిక గణతంత్రం’’ అని, భారతదేశానికి చెందిన ప్రతి వ్యక్తికీ ఆ దేశంలో తనదైన స్థానం, హక్కు, గౌరవం ఉందనే భావనతో తాను పెరిగానని చెప్పారు. ఒక దేశం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానం ఒకే మతం, ఒకే వర్గం, ఒకే గుర్తింపుగా మారకూడదని, ఏ దేశాన్నయినా ఇతరులను వెలివేసే, పక్కనపెట్టే దృక్పథంతో చూడటం తనకు ఆందోళన కలిగించే విషయమని, అందుకే ఆరెస్సెస్‌ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

మమ్దాని వ్యాఖ్యలు మొత్తం సంఘ్ భావజాలంపై చేసినవి. అనేక మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశాన్ని గుర్తుచేసి, దేశపు బలాన్ని స్పష్టం చేశారు. మమ్దాని చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్‌ అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. అంతేకాక సంఘ్ ఆలోచనలతో నడుస్తున్న దేశంలో ప్రభుత్వ విధానాల అసహ్యతనూ ఎత్తిచూపింది. మేయర్ జొహ్రాన్ అనుభవంలోని భారతదేశాన్ని, దాని స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. దేశ వారసత్వ సంపద అయిన లౌకికత్వాన్ని తొలగించి, దేశం కేవలం హిందూత్వ రాష్ట్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నారు. బహుళ సంస్కృతులను, భిన్నత్వాలను ఏకత పేరుతో నిరాకరించడం, ప్రపంచం ముందు భారత దేశాన్ని ఒక మతతత్వ దేశంగా చూపెట్టడానికి, దిగజార్చడానికి ఆరెస్సెస్‌ కృషి చేస్తున్నది. ప్రపంచ దేశాలకీ ఈ చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఏకత పేరుతో అప్రజాస్వామిక, నిరంకుశ, ద్వేష ప్రచారం వమ్ముకాక తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -